రోజూ ఒక కోడి గుడ్డు తినండి.. హెల్త్‌కి చాలా మంచిది అనేది నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) సూచన.
గుడ్లను మిడ్ డే మీల్స్‌లో కంపల్సరీ చేయొచ్చు అన్నది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సలహా.
పిల్లలకు వారానికి మూడు రోజులు గుడ్డు ఇవ్వాలనుకుంటున్నాం అని ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదన.
ఎగ్స్‌ని మేం తినం.. ఎవరినీ తిననివ్వం అనేది ఆ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రతిపక్షాల వాదన.
‘గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్లే పిల్లలకు బలమైన ఆహారం–మిడ్ డే మీల్ ప్రోగ్రాం’ అనే అంశంపై ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ లోపల, బయట ఎక్కడ, ఎప్పుడు చర్చ జరిగినా కోడి గుడ్డు చుట్టూనే చర్చ సాగుతోంది. కబీరుదాసు వర్గీయులు (కబీర్పంథీస్) ఇదే ఇష్యూపై పెద్ద ఎత్తున నిరసనలు, బంద్‌లకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. గిరిజనులు 40 శాతం కాగా, మిగతా జనాభాలో మార్వాడీలు, జైనులు, కబీరుదాసు ఫాలోవర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. వీరంతా కోడి గుడ్డు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు.
2015లో బడి పిల్లలకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే కోడిగుడ్డును అప్పటి బీజేపీ (రమణ్‌సింగ్) సర్కారు తీసేసింది. పిల్లల ఆరోగ్యం కోసం ఎగ్‌ని కంపల్సరీ చేయొచ్చన్న ఎన్ఐఎన్ సలహాను పట్టించుకోలేదు. గుడ్డుకి బదులుగా సోయా, అరటి పళ్లు ఇవ్వటానికి ప్రయత్నించింది. కానీ, ఆ ఆలోచన సక్సెస్ కాలేదు. పోయినేడాది చివరలో అధికారానికొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ కోడిగుడ్డు వైపు మొగ్గు చూపింది. వారానికి కనీసం మూడు రోజులు గుడ్లు ఇవ్వడం మొదలెట్టింది. దీంతో బడిలో హాజరుకూడా బాగా పెరిగింది. సోయా గింజలు ఇచ్చిన రోజుల్లో అటెండెన్స్ తక్కువగా ఉండేది. స్టూడెంట్స్ ఆరోగ్యాన్ని, వాళ్ల హాజరు శాతాన్ని పెంచటానికి కోడిగుడ్డు ఇవ్వడమే మంచిదని భావించింది. బడి పిల్లల పోషకాహారానికి సంబంధించి దాదాపు నాలుగేళ్లపాటు కొనసాగిన పద్ధతిని మార్చేసింది. రాష్ట్రంలో 14 ఏళ్ల లోపు విద్యార్థుల్లో 40 శాతం మంది ట్రైబల్ స్టూడెంట్స్ కాగా, 35 శాతానికి పైగా నాన్–ట్రైబల్ స్టూడెంట్స్ ఈ వయసువాళ్లకు కోడిగుడ్డు పెట్టడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని సర్కారు తెలిపింది.
రాజకీయమే నెగ్గింది
అయితే, దీన్ని కబీర్ పంథీలు వ్యతిరేకిస్తున్నారు. వాళ్లకు బీజేపీ సపోర్ట్ చేసింది. యాంటీ–ఎగ్ క్యాంపెయిన్రాష్ట్రమంతా విస్తరించింది. కోడిగుడ్డుని వ్యతిరేకించేవాళ్లలో… పక్కా వెజిటేరియన్లయిన జైనులు, మార్వాడీలు, ఇతర హిందూ మతాల లీడర్లు లేకపోవడం గమనార్హం. కేవలం కబీర్పంథీలే ఆందోళన చేస్తున్నారు. మరో వైపు ప్రతిపక్షాల వాదనను అసెంబ్లీ స్పీకర్ చరణ్‌దాస్ మహంతి సమర్థించారు. మహంతి కూడా కబీర్ వర్గీయుడే కావటం, ఆయన బాఘెల్కి రాజకీయ ప్రత్యర్థి కావటంతో… దీంతో కేవలం తినేవాళ్లకే గుడ్డు అందించాలని, వద్దనేవాళ్లకు వేరే ఐటమ్స్ ఇవ్వాలని బాఘెల్ సర్కారు దిగివచ్చింది.
గుడ్డులోనే ప్రొటీన్లు
కేవలం, మతం, వర్గం, సోషల్ స్టేటస్కి అతీతంగా ప్రతి ఒక్కరూ రోజుకో కోడిగుడ్డు తినాలని డైటీషియన్లు చెబుతుంటారు. ప్రొటీన్లు దండిగా ఉండే కోడిగుడ్డువల్ల డైట్ క్వాలిటీ మెరుగవుతుందని, విటమిన్–సీ తప్ప దాదాపు అన్ని పోషకాలూ కోడిగుడ్డులో ఉన్నాయని న్యూట్రిషనిస్టులు, పీడియాట్రీషియన్లు చెబుతున్నారు. శనగ పప్పు (76 శాతం), సోయా గింజలు (54 శాతం)తో పోల్చితే ఎగ్లోనే ప్రొటీన్ చాలా ఎక్కువగా (94 శాతం) ఉంటుందని ఎన్ఐఎన్ వివరిస్తోంది.