గుడ్డు ధర పైపైకి.. ఒక్కో ఎగ్ హోల్​సేల్​ రూ.6.20.. రిటెయిల్​ రూ.8

గుడ్డు ధర పైపైకి.. ఒక్కో ఎగ్ హోల్​సేల్​ రూ.6.20.. రిటెయిల్​ రూ.8
  • నిరుడు ఇదే నెలలో గుడ్డు హోల్ సేల్​ ధర రూ.5.50
  • గత ఐదు నెలల్లో ట్రే ధర రూ.60 పైనే పెరిగింది
  • -లేయర్​ కోళ్ల రీప్లేస్​మెంట్ ​లేకపోవడమే కారణం
  • క్రిస్మస్​, న్యూ ఇయర్​ వేడుకలతో పెరిగిన డిమాండ్​
  • హైదరాబాద్​లోనే రోజుకు కోటి గుడ్ల వినియోగం
  • రాష్ట్రంలో తలసరి గుడ్డు వినియోగం ఏడాదికి 180
  • రాష్ట్రంలో రోజుకు 3 కోట్ల వినియోగం

హైదరాబాద్, వెలుగు:  కోడి గుడ్డు ధరలు కొండెక్కాయి. బహిరంగ మార్కెట్‌‌‌‌లో గత కొన్ని రోజులుగా ఎగ్స్ రేట్​ క్రమంగా పెరుగుతున్నది. ఇదే సమయంలో చికెన్‌‌‌‌ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కార్తీక మాసం ఎఫెక్ట్ కారణంగా మాంసాహారానికి చాలా మంది దూరంగా ఉన్నారు. దీంతో చికెన్‌‌‌‌ ధర దిగొచ్చింది. అయితే కోడి గుడ్డు ధర మాత్రం పెరిగింది. ఒక్కో ఎగ్​ ధర హోల్‌‌‌‌సేల్‌‌‌‌గా రూ.6.20  ఉండగా.. రిటెయిల్​గా  రూ.7 , రూ.7.50 నుంచి రూ. 8 వరకు ధర పలుకుతున్నది. నిరుడు ఇదే టైమ్​కు హోల్​సేల్​లో రూ.5.50 ఉండగా ఈ యేడు 70 పైసలు అదనంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 6 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి కాగా.. ఈ సీజన్​లో లేయర్​ కోళ్లను రీప్లేస్​మెంట్​ చేయక పోవడంతో ప్రొడక్షన్​ కొంత తగ్గింది. మరోవైపు అంతేస్థాయిలో వినియోగం ఉండడంతో కోడిగుడ్లకు డిమాండ్​ పెరిగింది. అయితే, చలికాలంలో ఎగ్స్​ ధరలు పెరగడం సాధారణమేనని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. కానీ గత కొన్నేండ్లుగా ఇంత పెద్ద ఎత్తున పెరగలేదని మార్కెట్​ వర్గాలు అంటున్నాయి. మరో వారం పది రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి.

గుడ్డు పౌష్టికాహారమని, రోజూ తినాలని డాక్టర్లు సూచిస్తుండడంతో వీటి వినియోగం పెరిగింది.  కోడిగుడ్డును ప్రజలు తమ రోజువారీ మెనూలో ఆహారంగా తీసుకుంటున్నారు.చాలామంది రోజూ తప్పనిసరిగా గుడ్డు తింటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో వారానికి మూడు గుడ్లు , అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాల్లో 7 నెలల నుంచి చిన్నారులకు రోజుకో గుడ్డు, వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు ఆహారంలో రోజుకో గుడ్డును తప్పనిసరి చేశారు. తెలంగాణలో తలసరి ఎగ్​ వినియోగం ఏటా 180 ఉండగా.. దేశంలోనే ఇది ఎక్కువ. ఏపీలో తలసరి ఎగ్​వినియోగం 146 గుడ్లు కాగా.. దేశవ్యాప్తంగా 104 గుడ్లు అని ఎగ్‌‌‌‌‌‌‌‌ కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌ కమిటీ (నెక్‌‌‌‌‌‌‌‌)   గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  ప్రస్తుతం  హైదరాబాద్​ నగరంలోనే రోజుకు కోటి కోడి గుడ్లను వినియోగిస్తుండగా..  తెలంగాణ మొత్తం రోజుకు వినియోగించే గుడ్ల సంఖ్య 3 కోట్ల  మేర ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే దేశంలో రోజుకు 30 కోట్ల గుడ్లు ఉత్పత్తి జరుగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల ఎగ్స్​ ప్రొడక్షన్​ ఉండడం విశేషం. కాగా, కొద్దినెలలుగా గుడ్డు ధరలు క్రమంగా పెరుగుతుండడంతో లేయర్​ ఫామ్​ రైతులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read : రైతు భరోసాకు లిమిట్ 7 లేదా 10 ఎకరాలు

క్రిస్మస్​, న్యూఇయర్​ ఎఫెక్ట్​ 

డిసెంబర్​ లాస్ట్​ వీక్​లో  క్రిస్మస్‌‌‌‌‌‌‌‌ తో పాటు న్యూ ఇయర్​  వేడుకలు ఉంటాయి. ఈ రెండు సందర్భాల్లో కేక్ కట్​ చేస్తుంటారు. దీంతో కేక్​ల తయారీకి గుడ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా మార్కెట్​లో కోడిగుడ్ల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. డిసెంబర్​ చివరి నాటికి ఈ ధర మరింత పెరిగే చాన్స్ ఉన్నటదని అంటున్నారు.

డిమాండ్​ను బట్టి ధర 

 ఒక గుడ్డు రూ.7కు అమ్ముతున్నాం. ఒకేసారి ట్రే కావాలంటే రూ.210కు ఇస్తున్నాం. ఈ నెలలో గుడ్డు ధర పెరిగింది. చలికాలంలో ఎగ్స్​ ధరలు పెరుగుతుంటాయి. క్రిస్మస్‌‌‌‌‌‌‌‌, న్యూఇయర్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా వీటి వినియోగం మరింత పెరిగింది.నజీర్​, రెడ్డి చికెన్​ సెంటర్​ నిర్వాహకుడు , రామంతాపూర్​

లాస్ట్​ ఇయర్​ఒక్కో గుడ్డు ధర రూ.5.50 

లాస్ట్​ ఇయర్​ఇదే టైమ్​కు ఎగ్​ ప్రైస్​ హోల్​సేల్​ రూ.5.50 ఉండేది. ఈ సారి రూ.6.20గా ఉంది. లేయర్​ కోళ్ల రీప్లేస్​మెంట్​లేకే ప్రొడక్షన్​ తగ్గింది. దీనికితోడు ఈ సీజన్​లో వినియోగం పెరిగింది. రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం, అంగన్​వాడీల్లో ఎగ్ లను విరివిగా వినియోగిస్తున్నారు. ధర ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్న భోజనంలో వారానికి మూడు గుడ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం దృష్టి సారించాలి.
- బాలస్వామి, అడ్వైజర్, నెక్​

ఐదు నెలల్లో భారీగా..

గత ఐదు నెలల్లో డజన్​ గుడ్ల ధర రూ.16 వరకు పెరిగింది.  గతంలో 30 గుడ్లు ఉండే ఒక ట్రే ధర రూ.150 వరకు ఉంటే.. నేడు అది హోల్​సేల్​గానే రూ.210 కు పైగా ధర పలుకుతున్నది. రిటెయిల్​గా  ఒక ట్రే రూ.225కు అమ్ముతున్నారు. గత ఆగస్టు నెలలో కోడి గుడ్డు ధర హోల్​సేల్​లో రూ. 4.95 , రిటెయిల్​​ రూ. 5.70  ఉండగా, సెప్టెంబర్ నెలకు వచ్చే సరికి హోల్​సేల్​లో రూ.5.25, రిటెయిల్​లో  రూ.6.24కు పెరిగింది. అక్టోబర్ నెలలో హోల్​సేల్​లో రూ.5.35 ఉండగా.. రిటెయిల్​లో రూ.6.28 వరకు ధర పలికింది. నవంబర్ నెల వచ్చే సరికి హోల్​సేల్​లో రూ.5.95.. రిటెయిల్​లో రూ.6.50 అయింది. తాజాగా, డిసెంబర్ నెల ప్రారంభంలో ఒక్కో ఎగ్​ ధర  హోల్​సేల్​లో రూ.6.20 నుంచి రూ.7 కు  చేరింది. రిటెయిల్​లో నేడు అది రూ.7.50 నుంచి రూ.8 వరకు ధర పలుకుతున్నది.