కోడిగుడ్డు ధర పెరిగింది. గతేడాది మే 4న 100 కోడిగుడ్లు రూ.420 ఉండగా, ఈ ఏడాది రూ.445కి చేరింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కోళ్ల మరణాల రేటు పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గత నెల రోజులుగా కోడిగుడ్ల ధరలు స్వల్పంగానే పెరుగుతున్నాయి. గత నెల ఏప్రిల్ 5, మే 4 మధ్య, ఇక గుడ్డు ధర 70 పైసలు పెరిగింది. ఏప్రిల్ 5న గుడ్డు ధర రూ.4.35 ఉంటే, నెల తర్వాత మే 5న గుడ్డు రూ.5.25 పలుకుతోంది.
అయితే గత ఐదు రోజులుగా ఒక్క గుడ్డు ధర రోజురోజుకు పెరుగుతూ రూ.5.25కి చేరుకుంది. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా వేసవి వేడి కారణంగా గుడ్ల ఉత్పత్తి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.ఒక్కసారిగా గుడ్డు ధర పెరగడంతో.. కొందామని షాపుకు వెళ్లిన మధ్యతరగతి వారు ధర చూసి నోరెళ్లబెడుతున్నారు. కోడిగుడ్డు ధర పెరగడంతో వ్యాపారం సరిగ్గా జరగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.
ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ఇక చికెన్ ధరలు కూడా భారీగానే ఉన్నాయి. నగరంలో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.300 పలుకుతోంది. మరోవైపు కూరగాయలు ధరలు కూడా క్రమంగా పెరుగుతోన్నాయి. కిలో రూ.20 ఉన్న టమాటా తాజాగా కిలో రూ.30 నుంచి రూ.35 పలుకుతోన్నాయి.