ఎగ్​ సైజ్​ తగ్గింది..! 45 గ్రాముల బరువు ఉంటే చాలట!

  • ఎగ్​ సైజ్​ తగ్గింది..! 45 గ్రాముల బరువు ఉంటే చాలట!
  • ఇటీవలి టెండర్లలో  సర్కారు క్లారిటీ
  • కాంట్రాక్టర్లకు  నిబంధనల్లో సడలింపు 
  • అంగన్​వాడీ సెంటర్లకు  చిన్న సైజు గుడ్ల సరఫరా

భద్రాచలం, వెలుగు:  అంగన్​వాడీ కేంద్రాలకు సర్కారు సరఫరా చేసే ఎగ్​సైజ్​తగ్గిపోయింది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే కోడి గుడ్డు ఇకపై 45 గ్రాముల బరువు ఉంటే చాలట. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కోడిగుడ్ల సరఫరాకు టెండర్లను ఖరారు చేసింది. ఇప్పటి వరకు అంగన్​వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే కోడి గుడ్డు 50 గ్రాములకు తగ్గకుండా బరువు ఉండాలనే నిబంధన ఉండేది. కానీ కాంట్రాక్టర్లు మాత్రం చిన్న సైజు, తక్కువ బరువు ఉన్న గుడ్లనే సెంటర్లకు సరఫరా చేసేవారు. నిత్యం లబ్ధిదారుల నుంచి ఈ గుడ్లపై అభ్యంతరాలు వచ్చేవి. కొన్ని సందర్భాల్లో వివాదాలు కూడా జరిగేవి.

కానీ ఈసారి సర్కారే కాంట్రాక్టర్లకు వెసలుబాటు కల్పిస్తూ టెండర్లలో మార్పులు చేసింది. ట్రే కోడి గుడ్లు(30) కిలోన్నర బరువు ఉండాలి. 1.350 కిలోలు ఉన్నా ఒకే అంటూ కాంట్రాక్టర్లకు ఊరట కల్పించింది. దీంతో కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు​ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని చిన్న సైజు గుడ్లను పంపిస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక, నర్సాపురం, లక్ష్మీనగరం తదితర అంగన్​వాడీ సెంటర్లల్లో ఇటీవల చిన్న సైజు కోడిగుడ్లే వచ్చాయి. తూకం వేస్తే 45 గ్రాములే ఉంది. 16 మిల్లీమీటర్ల డయామీటర్, 3 మిల్లీమీటర్ల ఎత్తు గుడ్డు సైజు ఉండాలని నిబంధన తెచ్చారు. కొత్త నిబంధనలతో కాంట్రాక్టర్లు ఒక్కో ట్రేలో ఒక్కోరకంగా గుడ్లను సరఫరా చేస్తున్నారు. పంపిణీ చేసే సమయంలో ఒకరికి పెద్దవి, మరొకరికి చిన్నవి గుడ్లు వస్తుండడంతో లబ్ధిదారులు అభ్యంతరం చెబుతున్నారు. 

రంగుల విధానం అమలు కావట్లే...

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 11 ఐసీడీఎస్ ​ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2205 అంగన్​వాడీ సెంటర్లు పని చేస్తున్నాయి. గర్భిణులు 8100, బాలింతలు 6వేలు, 7 నెలల నుంచి మూడేళ్ల వయస్సున్న పిల్లలు 30వేలు, మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయస్సు ఉన్న పిల్లలు 2133 మంది ఉన్నారు. రోజుకు సుమారు 67 వేల వరకు కోడి గుడ్లు జిల్లాకు అవసరం ఉంది. రోజుకు రూ.3లక్షల చొప్పున నెలకు కనీసం రూ.కోటి వరకు గుడ్ల కోసం సర్కారు వెచ్చిస్తోంది. అయితే కాంట్రాక్టర్ల అవినీతిని అరికట్టేందుకు సర్కారు నిబంధనలు తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు.

వేసవిలో నెలకు రెండు సార్లు కోడి గుడ్లు అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేయాలి. మిగిలిన కాలాల్లో మాత్రం నెలకు మూడుసార్లు పంపించాలి. ఈ సమయంలో నెలలో ఒకటి నుంచి 10వ తేదీ వరకు ఇచ్చే కోడిగుడ్లకు పికాక్​కలర్, 11 నుంచి 20వ తేదీ వరకు సరఫరా చేసే గుడ్లపై రెడ్, 21 నుంచి 30వ తేదీ వరకు పంపే గుడ్లకు గ్రీన్​కలర్ వేయాలి. ఇలా గుడ్లకు రంగుల విధానం అమలు చేయడం ద్వారా సరఫరా సక్రమంగా జరుగుతుందా..? లేదా..? అనే విషయం తెలుస్తుంది. కాంట్రాక్టర్లతోపాటు కేంద్రాల్లో టీచర్ల అక్రమాలకు చెక్​పెట్టొచ్చనేది సర్కారు భావన. కానీ రంగుల విధానం ఎక్కడా అమలు కావడం లేదు. 

నిబంధనల ప్రకారం సరఫరా చేస్తాం..

కోడిగుడ్ల సరఫరాలో నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాం. గతంలో గుడ్లపై రంగుల విధానం ఉండేది. కానీ సరిగ్గా అమలు కాని మాట నిజమే. ఇకపై మాత్రం అలా జరగదు. మేమే ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నాం. గుడ్డు బరువు కూడా 45 నుంచి 52 గ్రాములు ఉండాలి. ట్రేలో గుడ్ల బరువు మొత్తం 1.350 కిలోల నుంచి కిలోన్నర వరకు ఉండాల్సిందే. జిల్లాకో గౌడౌన్​ఏర్పాటు చేసి అక్కడి నుంచి గుడ్లు కేంద్రాలకు సరఫరా చేసే బాధ్యత కాంట్రాక్టర్ దే.

- సబిత, పీడీ, ఐసీడీఎస్,  భద్రాద్రికొత్తగూడెం