ఓవరాక్షన్​ చేసినందుకే తీసేసిన్రు: ఈజీఎస్​ ఎఫ్​ఏలతో మంత్రి ఎర్రబెల్లి

పర్వతగిరి, వెలుగు: చిలకకు చెప్పినట్టు చెప్పిన.. అందరినీ కూసోపెట్టి చెప్పిన.. ఓవరాక్షన్​చేసిండ్లు.. సీఎంకు కోపం వచ్చిందంటూ ఈజీఎస్​ ఎఫ్ఏలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఫైర్​ అయ్యారు. తమను డ్యూటీలోకి తీసుకోవాలంటూ పలు మండలాల ఈజీఎస్​ఎఫ్ఏలు ఆదివారం వరంగల్​రూరల్​ జిల్లా పర్వతగిరిలోని మంత్రి ఇంటి వద్ద ఆయనను వేడుకున్నారు. బతుకు భారమవుతోంది సార్..18 మంది ఎఫ్ఏలు చనిపోయారు, మమ్మల్ని క్షమించండి.. మాది తప్పే సార్​అని వేడుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.  మీకు సాయం చేస్తనంటే వినకుండా మీరు వాళ్ల వీళ్ల మాటలు విని సమ్మె చేసిండ్రు. మీరు సమ్మెకు పోయినప్పుడు అందరినీ పిలిచి  జాయిన్​ అవ్వండని సీఎం చెప్పినా వినకుండా మీ మెడకాయ మీరే కోసుకున్నారని అన్నారు. యూనియన్​ లీడర్లు చేయబట్టే సమ్మెకు పోయి పిచ్చిపిచ్చి స్టేట్​ మెంట్లు ఇచ్చి ఆయన అంతు చూస్తామనడంతో మీ మీద కోపం వచ్చిందన్నారు. తాను సీఎంతోటి మాట్లాడుతున్నానంటూ కాన్వాయ్​లో వెళ్లిపోయారు.  కార్యక్రమంలో ఎఫ్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల రవి తదితరులు పాల్గొన్నారు.