బెంట్​ పిరమిడ్​కు టూరిస్టుల క్యూ

తిరగేసిన గరాటు ఆకారంలో ఉండే పిరమిడ్​ల నిర్మాణాలు ఇప్పటికీ ఇంజి నీరింగ్​ సవాల్​గానే నిలుస్తుంటాయి. వీటిలో ఎక్కువగా బండరాళ్లతో నిర్మించడమే ఇప్పటివరకు తెలిసిన ప్రక్రియ. తాజాగా సున్నపు రాయి (లైమ్​ స్టోన్​)తో కట్టిన బెంట్​ పిరమిడ్​ కూడా పరిశోధకులకు మంచి మేత నిస్తోంది. దాదాపు అయిదు వేల ఏళ్లనాటి ఈ కట్టడం ఇప్పుడు టూరిజం స్పాట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈజిప్ట్​కి ప్రస్తుత ఆదాయ వనరుల్లో టూరిజం మెయిన్​ రీసోర్స్​గా మారింది.

ఈజిప్టు పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పిరమిడ్లే. కొన్ని వేల సంవత్సరాల కిందట అప్పటికి అందుబాటులో ఉన్న  హైలెవల్ టెక్నాలజీతో నిర్మించిన కట్టడాలు ఈ పిరమిడ్లు. ఈజిప్టు రాజవంశానికి చెందినవారు చనిపోయినప్పుడు వారి కోసం పిరమిడ్లు కట్టడం అప్పట్లో కామన్. తొలి రోజుల్లో కేవలం రాజవంశీయులకు చెందినవారి కోసమే పిరమిడ్లు నిర్మించేవారు. అయితే తర్వాత రాజవంశీయులవే కాకుండా వారికి దగ్గరైన మంత్రులు, సేనాధిపతులు చనిపోయినా కూడా పిరమిడ్లు నిర్మించే  ట్రెండ్ మొదలైంది. పిరమిడ్ అంటే సమాధి. అన్ని పిరమిడ్లూ ఒకేలా ఉండవు. రకరకాల ఆకారాల్లో ఉంటాయి. వేల సంత్సరాల నాటి ఈజిప్టు నాగరికతకు ఈ పిరమిడ్లు ప్రతీకలుగా మారిపోయాయి.

చూడటానికి అనుమతి

ఈజిప్టులో అప్పుడప్పుడు ప్రజలు చూడటానికి కొన్ని వేల ఏళ్లనాటి పిరమిడ్లకు అనుమతి ఇస్తారు. కొన్ని రోజుల పాటు వాటిని తెరిచి ఉంచుతారు. లేటెస్ట్​గా పురాతన కాలానికి చెందిన ఓ పిరమిడ్ ను ప్రజలు చూడటానికి ఓపెన్​ చేశారు. అదే బెంట్ పిరమిడ్. ఈజిప్టు రాజధాని కైరోకు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్రీస్తు పూర్వం 2600 లో ఈ పిరమిడ్ నిర్మించారు. ఈజిప్టు రాజవంశానికి చెందిన కింగ్ స్నెఫేరు కోసం దీన్ని నిర్మించినట్లు  భావిస్తున్నారు. అప్పట్లో ఈ పిరమిడ్ నిర్మాణాన్ని  ఓ అద్భుతంగా ప్రజలు చెప్పుకునేవారట. పిరమిడ్ల కట్టడాల్లో ఒక సంధి దశకు బెంట్ పిరమిడ్ ప్రతిబింబంలా నిలిచింది. తొలి దశలో నిర్మించిన పిరమిడ్లకు, తర్వాతి తరంలోని పిరమిడ్లకు మధ్య బెంట్ పిరమిడ్ వారధిలా  నిలిచింది. నిర్మాణంలో కూడా బెంట్ పూర్తిగా డిఫరెంట్.కింది సగ భాగం పూర్తిగా లైమ్ స్టోన్​తో నిర్మించారు. పిరమిడ్ లోపల  79 మీటర్లు ఉండే ఇరుకైన సొరంగ మార్గం ఉంటుంది. దీని ద్వారా ప్రయాణించి మెయిన్ చాంబర్ కు చేరుకునే సదుపాయం ఉంటుంది. 101మీటర్ల ఎత్తుతో అసాధారణంగా ఉన్న బెంట్ పిరమిడ్ ఆ తర్వాతి కాలంలో  మరిన్ని  ప్రముఖ పిరమిడ్లు కట్టడానికి దారి చూపించిందంటారు నిపుణులు. బెంట్​ పిరమిడ్​ చూడటానికి ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు పెద్ద సంఖ్యలో ఈజిప్ట్​కు క్యూ కడుతున్నారు. పిరమిడ్​ నిర్మాణానికి ఉపయోగించిన అప్పటి టెక్నాలజీని చూసి నివ్వెర పోతున్నారు. ఈ పిరమిడ్​ను 1965లో  మూసివేసి లేటెస్ట్​గా మళ్లీ తెరిచారు. దీంతో వీటి నిర్మాణాలపై పరిశోధనలకు ప్రోత్సాహం లభించినట్లయింది.

మెహూ పిరమిడ్​లో ఆరు సమాధులు

ఈజిప్టులో ఇలా పాతకాలం నాటి పిరమిడ్లను  ప్రజలకోసం తెరిచి ఉంచడం కొత్త విషయం కాదు. అప్పుడప్పుడు  సమాధులను తెరిచి ఉంచుతారు. రెండేళ్ల కింద గిజా ప్రాంతంలో ఓ పాతకాలం నాటి పిరమిడ్​ని  తెరచి ఉంచారు. ఈ పిరమిడ్  మెహూది. 6వ శతాబ్దంలో ఈజిప్టును పాలించిన కింగ్ తితి దగ్గర మెహూ మంత్రిగా పనిచేసినట్లు చరిత్ర చెబుతోంది. మెహూ పిరమిడ్​ను1940లోనే గుర్తించారు. అయితే అప్పట్లో దానికి  కొన్ని  రిపేర్లు చేయాల్సి ఉండేది. అవి పూర్తయిన తర్వాత  ప్రజలు చూడటానికి  తెరిచారు. మెహూ పిరమిడ్​లో  మొత్తం ఆరు సమాధులు ఉన్నాయి.

మెహూ గోడల నిండా అద్భుత పెయింటింగ్స్

మెహూ సమాధి ఓ అందమైన కట్టడం. సమాధి గోడలపై ఎటు చూసినా కళ్లు జిగేల్​మనిపించే  పెయింటింగ్స్  కనిపిస్తాయి. పిరమిడ్లను చూడటానికి వచ్చే టూరిస్టులను ఈ పెయింటింగ్స్  కట్టిపడేస్తాయి.  ఫారో వంశస్తులు ఏలుతున్న దశను  పిరమిడ్ల నిర్మాణానికి స్వర్ణయుగంగా చెప్పుకుంటారు. ఈజిప్టులోని  అనేక గొప్ప పిరమిడ్లను ఫారోల కాలంలోనే కట్టారు. అయితే కాలక్రమంలో ఫారోల హవా తగ్గింది. ఈ ప్రభావం పిరమిడ్ల నిర్మాణంపై  కూడా పడింది. పెద్ద పెద్ద పిరమిడ్లను పక్కన పెట్టారు. చిన్న చిన్న పిరమిడ్లతో ఈజిప్టు సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

టూరిజం ప్రాజెక్టుల్లో పిరమిడ్లు

వేల ఏళ్ల నాటి పిరమిడ్లు ప్రస్తుతం ఈజిప్టుకు మేజర్ ఇన్ కం సోర్స్ గా మారాయి. పిరమిడ్లను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు ఈజిప్టుకు క్యూ కడుతుంటారు. 2011 వరకు టూరిస్టుల తాకిడి బాగా ఉండేది. 2011 తర్వాత ఈజిప్టులో  రాజకీయంగా అనేక మార్పులు వచ్చాయి. దీంతో టూరిజం బాగా దెబ్బతింది. ఆ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ టూరిస్టులను ఆకట్టుకోవడానికి అలనాటి పిరమిడ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు ప్రయత్నాలు మొదలెట్టింది.