ఐకేపీ సెంటర్ల దగ్గర అరిగోస పడుతున్న రైతులు 

ఐకేపీ సెంటర్ల దగ్గర అరిగోస పడుతున్న రైతులు 
  •  
  • ఇప్పటికీ 15% కొనుగోలు కేంద్రాలు కూడా తెరుచుకోలే
  • ఓపెన్​ చేసిన చోట్ల కాంటాలు పెడ్తలే
  • బార్దాన్​ లేక, మిల్లులను అలాట్​ చేయక ఆలస్యం
  • టార్పాలిన్లు లేక తడుస్తున్న వడ్లు.. కాపాడుకునేందుకు రైతుల తిప్పలు
  • మరో మూడు రోజులు వర్షాలు ఉండడంతో అన్నదాతల ఆందోళన

హైదరాబాద్/నెట్​వర్క్​, వెలుగు:  యాసంగి వడ్ల కొనుగోళ్లను ప్రభుత్వం మొదలుపెట్టి ఎనిమిది రోజులు గడుస్తున్నా స్పీడ్​ అందుకోలేదు. చాలా జిల్లాల్లో ఐకేపీ సెంటర్లకు మిల్లులను అలాట్​ చేయకపోవడం, సరిపడా బార్దాన్​లేకపోవడం వల్ల కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం.. ఏ సెంటర్​లో కూడా టార్పాలిన్లు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మార్కెట్​కు తెచ్చి కుప్పలుగా పోసుకున్న వడ్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. వడ్ల రాశులపై బయట నుంచి కిరాయికి టార్పాలిన్లు, బొంతలు తెచ్చుకొని కప్పుతున్నారు. గత యాసంగిలోనూ ఇట్లనే చెడగొట్టు వానలకు సెంటర్లు, కల్లాల్లో వడ్లు తడిసి నష్టపోయామని వారు వాపోతున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి యాసంగి వడ్లు కొంటామని సర్కారు ప్రకటించింది. కానీ కొనుగోళ్లు షురూ చేసి 8 రోజులు దాటినా ఇప్పటి వరకు 1,209 సెంటర్లు మాత్రమే ఓపెన్‌‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల టన్నుల వడ్లు వస్తాయని అంచనా వేస్తున్నామని, 60 రోజుల్లో కొంటామని ఇటీవల మంత్రి గంగుల చెప్పారు. ఈ లెక్కన రోజూ లక్ష  టన్నులకుపైగా వడ్లు కొనాలి. కానీ గత 8 రోజుల్లో కేవలం 34 వేల టన్నులు కొన్నారు. పొలాలను కోసిన వెంటనే వడ్లను సెంటర్లకు తెస్తున్న రైతులు, అక్కడ ఏర్పాట్లేమీ లేకపోవడం చూసి ఆందోళన చెందుతున్నారు. చాలా సెంటర్లలో కాంటాలు పెట్టకపోవడం, అకాల వర్షాలు వస్తాయన్న వాతవరణ శాఖ హెచ్చరికలతో కొందరు రైతులు రైస్ ​మిల్లుల్లో అగ్గువకు అమ్ముకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్​లాంటి జిల్లాల్లో సన్నవడ్లను కొంటారో, కొనరో స్పష్టత లేకపోవడంతో మిల్లులకు తరలిస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు మద్దతు ధర రూ. 1,960 ఉండగా.. రూ.1,600 నుంచి  రూ.1,700 వరకే చెల్లిస్తున్నారు. 

కావాల్సిన గన్నీ బ్యాగులు15 కోట్లు.. ఉన్నవి 3 కోట్లు.. 

ఈసారి యాసంగి వడ్లను కొనబోమని మొదటి నుంచీ చెబుతూ వచ్చిన రాష్ట్ర సర్కారు ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. మొత్తం వడ్లు కేంద్రమే కొనాలంటూ ఆందోళనలు చేసింది తప్పితే  రాష్ట్రం నుంచి ఎన్ని వడ్లు ప్రొక్యూర్​మెంట్​ చేస్తామో, ఎన్ని సంచులు కావాలో కేంద్రానికి ఇండెంట్​ పెట్టలేదు. వాస్తవానికి యాసంగి వడ్ల సేకరణకు 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 కోట్ల పాత సంచులను మాత్రమే సేకరించగలిగారు. ఇవి కూడా ఇంకా సెంటర్లకు చేరకపోవడంతో కాంటాలు ఆగిపోతున్నాయి. ఇక రాష్ట్రానికి 8 కోట్ల గన్నీ బ్యాగులు కావాలని జ్యూట్​ కమిషన్ ​ద్వారా ఇటీవల కేంద్రాన్ని కోరగా.. 4.45 కోట్ల గన్నీ బ్యాగులు పంపేందుకు అంగీకరించింది. మరోవైపు రైతులకు రెండు, మూడేండ్లుగా ప్రభుత్వం సబ్సిడీ టార్పాలిన్లు సరఫరా చేయలేదు. దీంతో రెండ్రోజులుగా చెడగొట్టు వానలు పడుతుండటంతో సెంటర్లకు తెచ్చిన వడ్లను కాపాడుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఐకేపీ సెంటర్లలో గతంలో ఇచ్చిన టార్పాలిన్లు చినిగిపోయాయని, వాటితోనే నెట్టుకొస్తున్నమని సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. చాలా సెంటర్లలో గతంలో వాడిన తేమ కొలిచే పరికరాలు సక్కగా పని చేయట్లేదు. కొత్త మెషిన్ల కోసం ఇండెంట్‌‌ పెట్టినా ఇంకా రాలేదు. అకాలవర్షాలతో వాతావరణం మారి ఎక్కువ మాయిశ్చర్‌‌ వస్తుందని, మెషీన్లు లేకపోతే ఇబ్బందవుతుందని సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. కొనుగోళ్లు మొదలై 8 రోజులు గడుస్తున్నా ఐకేపీ సెంటర్లకు మిల్లులను కేటాయించకపోవడం మరో సమస్యగా  మారింది. నూక శాతం తేలే వరకు ధాన్యం దించుకోమని మిల్లర్లు చెప్తున్నారు. దీంతో శుక్రవారం మంత్రి గంగుల కమలాకర్​ మిల్లర్లతో మీటింగ్‌‌ పెట్టి ధాన్యం అన్​లోడ్​ చేసుకునేందుకు ఒప్పించారు.

కాంటా పెడ్తలేరు

నేను వరి కోసి 200 బస్తాల  వడ్లు తీసుకొచ్చి సెంటర్ల పోసి అయిదు రోజులైతున్నది. సెంటర్  ఓపెన్​ చేసి రెండు రోజులైనా కాంటా పెడ్తలేరు. ఎందుకు కాంటా పెడ్తలేరని అడిగితే.. సెంటర్​కు మిల్లు కేటాయించలేదని అంటున్నరు. ఎప్పుడు కాంటా పెడ్తరో తెలుస్తలేదు. వాన పడితే వడ్లన్నీ నానిపోతయని బుగులైతున్నది.
- ఎర్ర శ్రీశైలం, బచ్చన్నపేట, జనగామ జిల్లా

కండ్ల ముందే తడిసింది

మహబూబ్​నగర్​ జిల్లా దేవరక్రద మండలంలో 30 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 12 సెంటర్లే ఏర్పాటు చేశారు. దీంతో శుక్రవారం వివిధ గ్రామాల రైతులు దేవరకద్ర మార్కెట్​లో వ్యాపారులకు అమ్మేందుకు వడ్లు తెచ్చారు. సాయంత్రం అక్కడ కాంటా పెడుతుండగా వాన పడి 3,809 క్వింటాళ్ల వడ్లు తడిసిపోయాయి. బస్తాల కిందికి నీళ్లు దిగగా, కుప్పలు నీటిలో తేలియాడాయి. దీన్ని చూసి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. 

పక్క ఊర్లలోనూ అమ్ముకోరాదట.. 

తమ ఊరిలో ఐకేపీ సెంటర్​ ఓపెన్ చేయకపోవడంతో పక్క ఊర్లలోని సెంటర్​లో అమ్ముకుందామనుకుంటే వీలుకావడం లేదని రైతులు అంటున్నారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి సెంటర్‌‌ నిర్వాహకులకు ఇచ్చే ట్యాబ్‌‌లలో ఆ సెంటర్ పరిధిలోని గ్రామంలో ఉన్న సర్వే నంబర్ల ప్రకారం రైతుల వివరాలు నమోదై ఉంటున్నాయి. రైతులు ఇచ్చే ఆధార్‌‌, ఫోన్​ నంబర్ల ప్రకారమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో రైతులు తమ పక్క గ్రామంలోని సెంటర్​లో వడ్లు అమ్ముకునే పరిస్థితి లేదు. దీంతో తమ ఊరిలో సెంటర్​ ఎప్పుడు తెరుస్తారోనని ఎదురుచూడక తప్పడం లేదని రైతులు అంటున్నారు. పక్క గ్రామాల్లోనే కాదు, పక్క జిల్లాల్లోని మార్కెట్లలోనూ ధాన్యం అమ్ముకునే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వడ్లు వస్తున్నాయన్న కారణంతో ఎక్కడి ట్రాక్టర్లను, లారీలను అక్కడే నిలిపేస్తున్నారు. ఉదాహరణకు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌‌ మండలం పరిధిలోని గ్రామాలు పక్కనున్న తిరుమలగిరి మార్కెట్‌‌లో వడ్లు అమ్ముకోవాలన్న అమ్ముకునే పరిస్థితి లేదు. 

ఎట్లనో ఏమో..!

నాగారంలో ఐకేపీ కొనుగోలు సెంటర్​ ఏర్పాటు చేస్తమని ఆఫీసర్లు చెప్తే నాతో పాటు మస్తుమంది రైతులు వడ్లు తీసుకొచ్చిన్రు. అసలు సెంటర్​ ఓపెన్​ చేస్తరో లేదో ఆఫీసర్లు చెప్తలేరు. అటుమో వానలు పడుతున్నయ్‌​. కనీసం పర్దాలు కూడా లేవు. ఎట్లనో ఏమో.. పరేషాన్​ అయితున్నది. 
- పోరెడ్డి రాజి రెడ్డి,  నాగారం,  హనుమకొండ జిల్లా

కుప్పల కాడ కాపలా ఉంటన్నం

మా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ నెల 14న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిండు. కానీ.. ఇప్పటికీ కాంట మాత్రం పెడ్తలేరు. వానొస్తదేమోనని భయం భయంగా వడ్ల కుప్పల కాడ్నే  కాపల ఉంటు న్నం. వెంటనే  కాంటా పెట్టాలె. సెంటర్​కు నేను వడ్లు తెచ్చి వారమైతున్నది. 
- జాలి శ్రీనివాస్ రెడ్డి,  రైతు గన్నేరువరం 

మొగులైతే చాలు రైతులు బుగులు పడుతున్నరు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎక్కడ తడిసిపోతుందోనని పరేషాన్​ అయితున్నరు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తమని సీఎం కేసీఆర్​ చెప్పి పదిరోజులైతున్నా.. ఇప్పటివరకు 15 శాతం కేంద్రాలు కూడా ఓపెన్​ చేయలేదు. ఓపెన్​ చేసిన చోట్ల కూడా కాంటాలు పెడ్తలేరు. సెంటర్లకు వడ్లను తెచ్చి, కుప్పలుగా పోసుకొని కొనుగోళ్ల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నరు. చెడగొట్టు వానల నుంచి వడ్లను కాపాడుకునేందుకు అరిగోస పడుతున్నరు. మరో మూడు రోజులు వానలు ఉండటంతో కలవరపడుతున్నరు.