
ముంబై: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ జిల్లాలోని ఉమ్రేడ్ ఎంఐడీసీలోని అల్యూమినియం ఫాయిల్ తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. కార్మికులు, స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఫైరింజన్ల సహయంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాగ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నట్లు పోలీసులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా..? లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
ఈ ఘటనపై నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పోద్దార్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్రేడ్ ఎంఐడీసీలోని అల్యూమినియం కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిదని.. తమ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం 8 మంది చెందారని.. మరికొందరు గాయపడ్డారన్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.