ఎంబీబీఎస్ సీట్లపై యూజీసీ పిడుగు

ఎంబీబీఎస్ సీట్లపై యూజీసీ పిడుగు
  • మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు డీమ్డ్‌‌ హోదా ఇచ్చిన యూజీసీ
  • లైన్‌‌లో అపోలో సహా మరో రెండు కాలేజీలు డీమ్డ్‌‌ వర్సిటీల్లో సీట్లన్నీ మేనేజ్‌‌మెంట్ కోటా కిందనే భర్తీ 
  • తగ్గనున్న కన్వీనర్ కోటా.. రిజర్వేషన్లు, స్థానిక కోటాకు మంగళం
  • సొంతంగానే పరీక్షలు నిర్వహణ, ఫీజులు నిర్ణయించుకునే అధికారం
  • మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటున్న డాక్టర్లు
  • కేంద్ర సర్కార్, యూజీసీ తీరును తప్పుబడుతున్న కాళోజీ వర్సిటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెరుగుతున్నప్పటికీ కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య మాత్రం తగ్గుతోంది. కేంద్ర ప్రభుత్వం డీమ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రైవేట్​ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడమే ఇందుకు కారణం. గతేడాది అనురాగ్ యూనివర్సిటీకి అనుబంధంగా నీలిమా మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వగా, ఈసారి మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు డీమ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ హోదాను యూజీసీ మంజూరు చేసింది. అపోలో సహా మరో రెండు మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ హోదా కోసం యూజీసీకి దరఖాస్తు చేసుకున్నాయి. ప్రైవేట్, డీమ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వ యజమాయిషీ ఏమీ ఉండడం లేదు. ఆయా కాలేజీల్లోని సీట్ల భర్తీలో స్థానిక కోటా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు కావడం లేదు. కన్వీనర్ కోటా అనేదే లేకుండా మొత్తం సీట్లన్నీ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటాలోనే భర్తీ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారు. కోర్సుల ఫీజులు నిర్ణయించుకునే అధికారాన్ని కూడా యాజమాన్యాలకే కట్టబెడుతున్నారు. 

Also Read:-ఒక్కరోజే లక్ష మంది..బడా గణేశుడి దర్శనానికి బారులు

స్థానికతతో సంబంధం లేకుండా, దేశంలోని ఏ రాష్ట్ర విద్యార్థులకైనా, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ స్టూడెంట్లకైనా సీట్లు ఇచ్చుకునే వెసులుబాటును కల్పించారు. ఆయా కాలేజీల్లో పరీక్షల నిర్వాహణ, ప్రశ్నా పత్రాల మూల్యాంకనం కూడా సొంతంగానే చేసుకునేలా అవకాశం కల్పించారు. ఇలా పూర్తి అధికారాలను యాజమాన్యాలకే కట్టబెట్టడం వల్ల రాష్ట్ర విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కన్వీనర్ కోటా సీట్లు తగ్గిపోతుండడంతో మెరిట్ ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటాలో జాయిన్ అవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం, యూజీసీ అవలంబిస్తున్న విధానంపై కాళోజీ హెల్త్ వర్సిటీ ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ వద్ద అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదే పద్ధతి కొనసాగితే స్థానిక విద్యార్థులకు నష్టం జరగడంతోపాటు, మెడికల్ ఎడ్యుకేషన్ నాసిరకంగా తయారవుతుందని హెచ్చరించింది.

పేద విద్యార్థులకు నష్టం

ప్రస్తుతం కన్వీనర్ కోటా సీట్లను మెరిట్ విద్యార్థులకు కేటాయించి, ఆ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష కంటే తక్కువే ఖర్చు అవుతున్నది. దీంతో మెరిట్ ర్యాంక్ సాధించిన పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎంబీబీఎస్ చదవగలుగుతున్నారు. కానీ, ఇప్పుడు కేంద్రం ఇస్తున్న అనుమతుల వల్ల మెరిట్ ర్యాంకులున్న విద్యార్థులు కూడా ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదే కొనసాగితే మిగిలిన ప్రైవేటు కాలేజీలు కూడా డీమ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోదా తెచ్చుకుని, కన్వీనర్ కోటా లేకుండా చేసే ప్రమాదం ఉంది.

ఎక్కువ మార్కులు వేసుకుంటారు 

ప్రైవేట్​ మెడికల్ కాలేజీల్లోని ఫీజులను ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిర్ణయిస్తుండగా, డీమ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీల్లో వాటి యాజమాన్యాలే తమ ఫీజును నిర్ణయించుకుంటున్నాయి. ఎంబీబీఎస్ సీట్లకు ఉన్న డిమాండ్ వల్ల ఈ యూనివర్సిటీల్లో అడ్డగోలు దోపిడీ జరిగే ప్రమాదం ఉంది. ఆయా వర్సిటీల యాజమాన్యాలు నిర్ణయించిన ప్రకారం అధిక ఫీజులు కట్టగలిగిన వాళ్లకే సీట్లు వస్తాయి. నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెరిట్ ర్యాంకులు సాధించలేని, ధనిక వర్గాలకు చెందిన పిల్లలే అలాంటి కాలేజీల్లో సీట్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. డీమ్డ్​ యూనివర్సిటీలు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఉండవు. వాళ్ల కాలేజీల్లో చదువుతున్న మెడికోలకు వాళ్లే‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్స్ నిర్వహించుకుంటారు. ‘ఇలాంటి పరీక్షల వ్యవస్థ కారణంగా అక్కడ చదువుతున్న వారికి ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది. కాలేజీ పాస్ పర్సంటేజ్ తక్కువగా ఉంటే స్టూడెంట్లు జాయిన్ అవ్వరు కాబట్టి, దాదాపు అందరినీ మంచి మార్కులతో పాస్ చేయడానికే ప్రయత్నిస్తారు. థియరీ, ప్రాక్టికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ మార్కులు వేస్తారు. ఫలితంగా మెడికల్ ఎడ్యుకేషన్ నాసిరకంగా తయారై స్కిల్ లేని డాక్టర్లు తయారవుతారు’ అని మెడికల్ ప్రొఫెసర్లు విమర్శిస్తున్నారు. ఇలా దొడ్డిదారిలో ఎక్కువ మార్కులు పొందిన డాక్టర్లకే భవిష్యత్తులో ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ పోస్టులు దక్కే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే  మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. స్కిల్ లేని ఇలాంటి డాక్టర్ల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

కన్వీనర్ కోటాకు ముప్పు

మన రాష్ట్రంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఉండే ప్రైవేట్​ మెడికల్ కాలేజీల్లో 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, 35 శాతం సీట్లను బీ కేటగిరీలో, 15 శాతం సీట్లను సీ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. ఈ లెక్కన నీలిమా మెడికల్ కాలేజీలోని 150 సీట్లలో 75 సీట్లు కన్వీనర్ కోటాలోకి రావాలి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో 400 ఎంబీబీఎస్ సీట్లలో, 200 సీట్లు కన్వీనర్ కోటాలోకి రావాలి. కానీ, కేంద్రం ఆధీనంలోని యూజీసీ వాటికి ప్రైవేటు, డీమ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ హోదా ఇవ్వడంతో మొత్తం సీట్లు మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోటాలోకే వెళ్లిపోయాయి. ఒక్కో సీటు ఫీజు ఏడాదికి రూ.17 లక్షలకుపైనే ఉంది. అంతేకాదు, కన్వీనర్ కోటాలోని మొత్తం సీట్లను, బీ కేటగిరీలోని 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలన్న నిబంధన కూడా ప్రైవేటు, డీమ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలకు వర్తించదు.