విజయ నిర్మల మనవడు శరణ్ కుమార్ (నరేష్ కజిన్ కొడుకు) హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ కింగ్’. శశిధర్ చావలి దర్శకత్వంలో బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. నిష్కల, ఉర్వీ సింగ్, మురళీశర్మ, తనికెళ్ల భరణి, సునీల్, వెన్నెల కిషోర్, మిర్చి కిరణ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. నిన్న ఈ మూవీ టీజర్‌ను సీనియర్ దర్శకులు సాగర్‌తో కలిసి సూర్యకిరణ్ లాంచ్ చేశారు. కృష్ణ గారి కుటుంబంతో తమకెంతో అనుబంధం ఉందని చెప్పిన వీరు మూవీ టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు.
టీజర్ చాలా బాగుందంటూ కృష్ణ, జయసుధ వీడియో బైట్ ద్వారా విషెస్ చెప్పారు. శరణ్ మాట్లాడుతూ ‘ఆల్రెడీ విడుదల చేసిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌తో పాటు సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’ అన్నాడు. శశిధర్ మాట్లాడుతూ ‘సినిమా పట్ల విజన్ ఉన్న ప్రొడ్యూసర్ దొరకడం నా అదృష్టం. శరణ్ బాగా నటించాడు. తండ్రి పాత్రలో తన రియల్ ఫాదర్ రాజ్ కుమార్ బాగా పర్‌ఫార్మ్ చేశారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చెప్పాడు.
‘కృష్ణ గారి కుటుంబం నుంచి వస్తున్న ఎనిమిదో హీరో శరణ్. మంచి కథతో పరిచయమవుతున్నాడు’ అన్నారు నిర్మాత బి.ఎన్.రావు. నటులు రోషన్, ఐ డ్రీమ్స్ అంజలి, డీవోపీ తన్వీర్ తదితరులు పాల్గొన్నారు.