ఏక్ భారత్.. శ్రేష్ఠ్​ భారత్​తో టూరిజం పెరుగుతది

రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 మనదేశాన్ని రాష్ట్రాల యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అభివర్ణించింది. యూనియన్ అంటే నాశనం చేయడానికి ఆస్కారం లేనిది అని అర్థం. యూనియన్ అనేది మతాలు, సంస్కృతులు, తెగలు, భాషలు, వంటకాల విభిన్న కలయిక. భిన్నమైన, బహుభాషా, బహుళ సంస్కృతులతో కలగలిసిన భారతదేశం వంటి దేశం మరేదీ లేదు. ఇంకా సంప్రదాయాలు, సంస్కృతులు, విలువల వంటి పురాతన హద్దులకు మనదేశం కట్టుబడి ఉంది. దేశంలోని వైవిధ్యాన్ని కాపాడటానికి మన పూర్వీకులు చేసిన అపారమైన త్యాగాలు ఊహకు అందనివి. 565 సంస్థానాలను భారత యూనియన్​లో విలీనం చేసే బృహత్తర కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ కలలను సాకారం చేయడం ఎంతైనా న్యాయం. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ లక్ష్యం ఇదే. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో టూరిజం మరింత పెరుగుతుంది. ఈ దిశగా ప్రధాని మోడీ చూపిన దారిలో మనమందరం ముందుకు నడుద్దాం.

భారతీయులమైన మనం మాతృభూమిని ఎల్లప్పుడూ నాగరిక దేశంగా చూశాం..చూస్తున్నాం. మనదేశంలో నాగరికతా సరిహద్దులు అనేవి సంస్కృతి, నైతికత, ఏకీకృత ఆధ్యాత్మిక ప్రాబల్యం వంటి వాటి ద్వారా నిర్ణయించబడతాయి. ఫలితంగా జాతీయవాదంపై మన భావన భౌగోళిక సరిహద్దులకు పరిమితం కాలేదు. మన సనాతన ధర్మం కూడా మొత్తం ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తుంది. అదే వసుదైక కుటుంబం. మరోవైపు, యూరోప్, ఇతర పశ్చిమ దేశాలు.. చట్టాలు, భౌగోళిక సరిహద్దులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాయి. ఇదే వాటికి, మనదేశానికి మధ్య ఉన్న ప్రధానమైన వ్యత్యాసం. భారతదేశ ప్రాదేశిక సరిహద్దులు, నాగరికతా సరిహద్దులు సాధ్యమైనంత దగ్గరగా ఉండేలా చూసుకోవడానికి
సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ అసమానమైన సహకారం అందించారు.
2015లో మొదలైన ఏక్ భారత్.. శ్రేష్ఠ్​ భారత్​
సర్దార్ వల్లభ్​భాయ్​ పటేల్ 140వ జయంతి సందర్భంగా 2015  అక్టోబర్ 31న ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్​ భారత్’ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించడం  సరైనదే. అదే ఏడాది సర్దార్ పటేల్​ జయంతికి ముందు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, “సర్దార్ పటేల్ మనకు ఏక్ భారత్ ఇచ్చారు, ఇప్పుడు మనమంతా సమిష్టిగా శ్రేష్ఠ్​ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తయారు చేయాలి. అది 125 కోట్ల మంది భారతీయుల ఏకైక కర్తవ్యం” అని అన్నారు. 2016--–-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. “మంచి పాలన కోసం మనం భిన్నత్వంలో దేశ ఐక్యతను ఉపయోగించుకోవాలి. పరస్పర అవగాహనను బలోపేతం చేయడానికి, నిర్మాణాత్మక పద్ధతిలో వివిధ రాష్ట్రాలు, జిల్లాల మధ్య సన్నిహిత సంబంధాన్ని కల్పించాలి” అని ప్రతిపాదించారు.
పర్యాటక ప్రదేశాలను సందర్శించాలి
వివిధ రాష్ట్రాల్లోని విభిన్న వ్యక్తుల మధ్య ఒక లెర్నింగ్​ ఎకో సిస్టమ్​ను సృష్టించాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్రం నుంచి రాష్ట్రానికి అనుసంధానం ఏర్పాటు చేయడం ద్వారా ఒకరి నుంచి మరొకరు ఉత్తమ పద్ధతులను నేర్చుకుని  ప్రయోజనం పొందుతారు. తోటి భారతీయుల మధ్య ఏక్ భారత్ శ్రేష్ఠ్​ భారత్ వంటి కార్యక్రమాలను మెరుగుపర్చడం వల్ల విభిన్న సంస్కృతులను తెలుసుకోవడానికి వారిలో ఉత్సుకత ఏర్పడుతుంది. ఇది టూరిజం, పర్యాటకం నుంచి లాభపడే వర్గాలకు సానుకూలంగా మారుతుంది. 2022 నాటికి దేశంలోని కనీసం 15 పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్రధాని మోడీ కొన్నేండ్లుగా తోటి భారతీయులను ప్రోత్సహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధికి ఇది ఒక స్వయంచాలకంగా పని చేస్తుంది. అదే సమయంలో దేశంలోని అందమైన గమ్యస్థానాలను అన్వేషించడంలో సహాయపడుతుందని ప్రధాని మోడీ భావించారు.
టూరిజం మెరుగుపడుతుంది
సహజ సౌందర్యం, గొప్ప సాంస్కృతిక వారసత్వం అనేవి భారతదేశం అందించే మొదటి అనుభవం. ప్రధాని మోడీ విజన్, నాయకత్వం పర్యాటక శాఖ, ఏక్ భారత్ శ్రేష్ఠ్​ భారత్, ‘‘దేఖో అప్నా దేశ్’’ కార్యక్రమాల మధ్య లోతైన బంధానికి మార్గం చూపింది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్​ వేయించుకున్న వారి సంఖ్య మరింత పెరుగుతుండడంతో, పర్యాటక రంగం 2022 జనవరి నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయగలదు. ‘‘ఇన్​క్రెడిబుల్​ ఇండియా’’ సహజ బలం, ఏక్​ భారత్ శ్రేష్ఠ్​ భారత్ వేసిన పునాదిని మరింత పటిష్టం చేస్తుంది. ఇది రాబోయే రోజుల్లో మరింత 
మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఏక్​ భారత్​.. శ్రేష్ఠ్​ భారత్​ను సక్సెస్​ చేయడానికి మనందరం ప్రధాని మోడీ చూపిన బాటలో ముందుకెళ్దాం.


ప్రజలను అనుసంధానించేందుకే..
భాష, వాణిజ్యం, సంస్కృతి, పర్యాటక రంగాలలో మార్పిడి ద్వారా ప్రజలను కలిపే వార్షిక కార్యక్రమంగా ఏక్ భారత్.. శ్రేష్ఠ్​ భారత్ రాష్ట్రాలు, జిల్లాలను అనుసంధానిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే రాష్ట్రాలు, జిల్లాలతో పరస్పర ఒప్పందం ద్వారా దీనిని ముందుకు తీసుకెళతాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య నిర్మాణాత్మక ఒప్పందాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ కార్యక్రమం దేశంలో ఐక్యతను పెంపొందిస్తుంది. ఈ కార్యక్రమంతో దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం విభిన్న సంస్కృతుల వైవిధ్యాలను పంచుకోవడం ద్వారా జాతీయ గుర్తింపు అనే మిశ్రమ అనుభూతిని పొందుతాయి. వారు ఒక సంవత్సరం పాటు ఒకరితో ఒకరు జత కలిసి, భాష, సాహిత్యం, వంటకాలు, పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, టూరిజం మొదలైన రంగాలలో ఒకరితో ఒకరు మమేకం అవుతారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్​ భారత్ అనేది విభిన్న సాంస్కృతిక యూనిట్లు, విభిన్న భౌగోళికాలను ఏకం చేసే ఒక భావోద్వేగం. ఇది జాతి నిర్మాణ స్ఫూర్తికి, అందరికీ ప్రయోజనం చేకూర్చడానికి చాలా అవసరం.                        - జి.కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి