మహా పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. లాస్ట్ మినిట్‎లో ఏక్ నాథ్ షిండే యూ టర్న్

మహా పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. లాస్ట్ మినిట్‎లో ఏక్ నాథ్ షిండే యూ టర్న్

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు నిమిషనిమిషానికి నరాలు తెగే ఉత్కంఠ రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించి వారం రోజులు గడిచిన సీఎం అభ్యర్థి ఎంపికపై సందిగ్ధం నెలకొంది. ఈ సస్పెన్స్‎కు ఎట్టకేలకు 2024, డిసెంబర్ 4న  మహాయుతి కూటమి తెరదించింది. మహారాష్ట్ర తదుపరి సీఎంగా బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఫైనల్ చేశారు. మహాతియుతి కూటమి నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి నెక్ట్స్ సీఎం ఫడ్నవీస్‎ను ఎంపిక చేశారు. దీంతో కూటమి నేతలు గవర్నర్‎ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమం అనంతరం మహాయుతి కూటమి నేతలు మీడియా  సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలోనే మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే కూటమి నేతలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. షిండే మాట్లాడుతూ.. ‘‘మహారాష్ట్ర సీఎం పదవికి ఫడ్నవీస్ పేరును నేనే సిఫారసు చేశా. గతంలో సీఎం అభ్యర్థిగా నా పేరును ఫడ్నవీస్ ప్రతిపాదించారు. మహాయుతి కూటమిలో ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు.. మహారాష్ట్ర అభివృద్ధి కోసం మేమంతా కలిసి పని చేస్తాం’’ అని అన్నారు. ‘‘కేబినెట్ లో మీ రోల్ ఏంటీ..? డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటున్నారా..? లేక మీ కుమారుడికి ఇస్తున్నారా..?’’ అని జర్నలిస్టులు ఏక్ నాథ్ షిండేను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ ‘‘డిప్యూటీ సీఎం పదవిపై ప్రస్తుతానికి మేం నిర్ణయం తీసుకోలేదు. దీనిపై సాయంత్రం లోగా తమ నిర్ణయం వెల్లడిస్తాం’ అని తెలిపారు. 

చర్చలు కంప్లీట్ అయ్యి.. సీఎం అభ్యర్థి పేరును అఫిషియల్‎గా అనౌన్స్ చేశాక చివరి నిమిషంలో షిండే యూ టర్న్ తీసుకోవడంతో కాబోయే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఖంగుతిన్నారు. వెంటనే తేరుకుని డిప్యూటీ సీఎం పోస్ట్‎కు ఓకే చెప్పాలని ప్రెస్ మీట్‎లోనే ఫడ్నవీస్, అజిత్ పవార్ షిండేను కోరారు. వీరి రిక్వెస్ట్‎ను సున్నితంగా తిరస్కరించిన షిండే.. నీలాగా పూటకో మాట మాట్లాడనంటూ అజిత్ పవార్‎కు చమత్కారంగా కౌంటర్ ఇచ్చారు. 

మరి కొన్ని గంటల్లో సీఎం ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో లాస్ట్ మినిట్‎లో షిండే ఊహించని షాక్ ఇవ్వడంతో మహాయుతి కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. సీఎం పదవిపై షిండే ఆశ పెట్టుకోగా.. ఎక్కువ సీట్లు వచ్చిన బీజేపీకే ముఖ్యమంత్రి పదవి దక్కింది. దీంతో షిండే అలకబూని తమకు డిప్యూటీ సీఎం పదవి కూడా వద్దంటున్నట్లు తెలుస్తోంది. తను కాకుండా తన కుమారుడు శ్రీకాంత్ షిండేకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలని ఏక్ నాథ్ షిండే భావిస్తోన్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో షిండే బాంబ్ పేల్చడంతో  ఇవాళ సాయంత్రం వెలువరించే శివసేన చీఫ్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.