ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. సీఎం పదవి వ్యవహారం కొలిక్కి వచ్చిన.. డిప్యూటీ సీఎం, మంత్రుల పోర్ట్ ఫోలియోల పంచాయతీ తేలకపోవడంతో మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎంపిక కాగా, డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఒకే చెప్పాడు. అయితే, మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన అధ్యక్షడు ఏక్ నాథ్ షిండే సీఎం పదవి కోసం పట్టుబట్టగా అది బీజేపీ దక్కింది.
కనీసం హోం శాఖ అయిన ఇవ్వాలని షిండే కోరగా బీజేపీ అందుకు నో చెప్పింది. సీఎం దగ్గరే హోం శాఖ పగ్గాలు ఉంటయని బీజేపీ తేల్చి చెప్పింది. దీంతో షిండే అలకబూనారు. షిండే అసంతృప్తిగా ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి చర్చలు జరిపి షిండేను శాంతింపజేశారు. దీంతో 2024, డిసెంబర్ 4న మహాయుతి కూటమి సీఎం అభ్యర్థిగా అధికారికంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎన్నుకున్నారు. సీఎంగా ఫడ్నవీస్ ఎంపికకు సహకరించిన షిండే.. తాను మాత్రం డిప్యూటీ సీఎం పదవి తీసుకోనని మీడియా సాక్షిగా చెప్పి లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్ ఇచ్చారు.
షిండే అనూహ్య నిర్ణయంతో మరోసారి ముహాయుతి కూటమిలో లుకలుకలు బహిర్గతమయ్యాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన కాబోయే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ షిండే ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ప్రభుత్వంలో గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని షిండేకు నచ్చజెప్పారు. ఫడ్నవీస్ సంప్రదింపులతో మొత్తబడ్డ షిండే చివరకు డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు ఒకే చెప్పాడు. అయితే, డిప్యూటీ సీఎం పోస్ట్ షిండే తీసుకుంటారా లేక ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండేకి కట్టబెడతారా అనేది సస్పెన్స్‌గా మారింది.