అగ్రస్థానానికి ఏకలవ్య బాథమ్

అగ్రస్థానానికి ఏకలవ్య బాథమ్

హైదరాబాద్‌‌: హైదరాబాద్ హుస్సేన్‌‌ సాగర్ వేదికగా 15వ మాన్‌‌సూన్ రెగట్టా పోటీలు పోటాపోటీగా సాగుతున్నాయి. నాలుగో రోజు, గురువారం అన్ని విభాగాల్లో రెండేసి రౌండ్ల రేసులు నిర్వహించారు.  ఐఎల్‌‌సీఏ 4 బాలుర విభాగంలో  మధ్యప్రదేశ్‌‌కు చెందిన ఏకలవ్య బాతం కొన్ని అద్భుతమైన ఫినిషింగ్‌‌లతో ఫ్లీట్‌‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. టీఎన్‌‌సీ మైసూర్‌‌కు చెందిన కృష్ణ దివాకర్‌‌ను 3వ స్థానానికి,మధ్యప్రదేశ్‌‌కు చెందిన అక్షత్ దోహ్రేను రెండో స్థానానికి నెట్టేశాడు.

మరోవైపు అండర్ 16 ఆప్టిమిస్ట్ ఫ్లీట్‌‌ విభాగంలో తెలంగాణ కుర్రాడు గోవర్ధన్ పల్లార తన అగ్రస్థానాన్ని కొనసాగించాడు. 8, 9వ రౌండ్ రేసుల్లో 5, 6వ స్థానాల్లో నిలిచిన గోవర్ధన్ స్వర్ణ పతకం దిశగా ముందుకెళ్తున్నాడు. అయితే ఎస్‌‌హెచ్‌‌ బాబు ట్రోఫీని కైవసం చేసుకోవడానికి మిగిలిన రెండు రేసుల్లో అతను నిలకడ చూపాల్సి ఉంది.

తెలంగాణకే చెందిన దీక్షిత 9వ రేసులో 14వ స్థానం నుంచి దూసుకొచ్చి విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓవరాల్‌‌గా రెండో స్థానానికి చేరుకొని గోవర్ధన్‌‌కు గట్టి పోటీ ఇస్తోంది. అండర్ 18 అంతర్జాతీయ 420 మిక్స్‌‌డ్ డబుల్స్‌‌ లో తెలంగాణ జోడీలు వైష్ణవి వీరవంశం‌‌‌‌– శ్రవణ్ కత్రావత్, తనుజా కామేశ్వర్– గణేష్ పీర్కట్ల తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు.