వికారాబాద్: అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని సినీ నటుడు అలీకి నోటీసులిచ్చారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో సినీ నటుడు అలీకి ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ను అనుమతులు లేకుండా నిర్మించారని, అంతేకాకుండా ఫామ్ హౌస్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని గ్రామ పంచాయతీ తేల్చింది. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని గ్రామ సెక్రటరీ శోభారాణి అలీకి నోటీసులు జారీ చేశారు.
ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో అలీ కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. వ్యవసాయ కూలీల సాయంతో అలీ ఈ వ్యవసాయ క్షేత్రంలో పంటలు, పండ్ల తోటలు సాగు చేశారు. ఈ అగ్రికల్చర్ ల్యాండ్లోనే ఫామ్ హౌస్ కట్టుకుని అడపాదడపా అక్కడికి వెళ్లి సేద తీరాలని అలీ భావించారు. అనుకున్నట్టుగానే అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్పై, ఆ ఫామ్ హౌస్లో చేపట్టిన నిర్మాణాలపై ఆరోపణలు వచ్చాయి.
గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇష్టానుసారం అలీ తన ఫామ్ హౌస్లో నిర్మాణాలు చేపట్టారనేది ప్రధాన ఆరోపణ. ఈ నిర్మాణాలపై అలీ వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులను ఫామ్ హౌస్ చూసుకుంటున్న వ్యక్తికి అందజేశారు. ఈ నోటీసులపై అలీ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
టాలీవుడ్లో కొందరు సినీ ప్రముఖులకు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌస్లు ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ గ్యాప్ లో కుటుంబంతో కలిసి ఆ ఫామ్ హౌస్ల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో సినీ ప్రముఖులు సేద తీరుతుంటారు. ఇంకొందరు పార్టీలు కూడా చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు.