- 11 సీట్లకు 9 స్థానాలు కైవసం
- ఎంవీఏ కూటమికి 2 సీట్లు
ముంబై: మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎస్సీపీల మహాయుతి కూటమి సత్తా చాటింది. 11 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 9 సీట్లను మహాయుతి కూటమి కైవసం చేసుకుంది. బీజేపీకి 5 సీట్లు రాగా, ఏక్ నాథ్ షిండేకు చెందిన శివసేన వర్గానికి 2 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి 2 సీట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థులు పంకజా ముండే, పరిణయ్ ఫూకే, అమిత్ గోర్ఖే, యోగేశ్ తిలేకర్, సద్భావ్ ఖోట్ విజయం సాధించారు.
అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి రాజేష్ విటేకర్, శివాజీరావ్ గర్జే గెలుపొందారు. ఏక్ నాథ్ షిండే శివసే నుంచి భావనా గౌలి విజయం సాధించారు. ఇక మహావికాస్ అఘాడీ కూటమికి రెండు సీట్లు వచ్చాయి. శివసేన (యూబీటీ) అభ్యర్థి మిలింద్ నార్వేకర్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రద్య్నా శాతవ్ గెలుపొందారు. మొత్తం 12 సీట్లకు ఎన్నికలు నిర్వహించగా 11 స్థానాల్లో కౌంటింగ్ ముగిసింది. మిగిలిన సీటుకు కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నది. మండలిలో 11 మంది సభ్యుల పదవీకాలం ఈ నెల 27తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించారు.