మోదీ, అమిత్ షా చెప్పినోళ్లే సీఎం.. ఇందులో నాదేం లేదు : షిండే నిర్వేద వ్యాఖ్యలు

మోదీ, అమిత్ షా చెప్పినోళ్లే సీఎం.. ఇందులో నాదేం లేదు : షిండే నిర్వేద వ్యాఖ్యలు

మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు.. ఈ ప్రశ్న ప్రస్తుతం ఉన్న ఆపధ్దర్మ సీఎం షిండేను అడిగితే.. ఆయన చెప్పిన సమాధానం సంచలనంగా మారింది. బీజేపీ, శివసేన షిండే, అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన మూడు పార్టీలు.. మహాయుతి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. గెలుపులో ఈ మూడు పార్టీల పాత్ర ఉంది.. ఈ క్రమంలోనే సీఎం ఎవరనే ప్రశ్న తలెత్తింది. దీనికి ఏక్ నాథ్ షిండే సమాధానం ఇలా ఉంది..

ప్రధాని మోదీ, అమిత్ షా ఎవరి పేరు చెబితే వాళ్లే సీఎం అవుతారు.. వాళ్ల నిర్ణయమే ఫైనల్ అని షిండే కుండబద్ధలు కొట్టారు. సీఎం రేసులో షిండే లేరా అంటే మాత్రం ఆయన సమాధానం దాటవేశారు. బీజేపీ నిర్ణయమే ఫైనల్.. వాళ్లు చెప్పింది వింటానని షిండే స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్రకు కాబోయే సీఎం బీజేపీకి చెందిన మాజీ సీఎం ఫడ్నవీస్ అనే ప్రచారం మరింత జోరుగా సాగుతుంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఏక్నాథ్ షిండే ఆశలు వదిలేసుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక బుధవారం ఆయన తొలిసారి ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా షిండే నిర్వేదంతో మాట్లాడారు. తనకు తాను ముఖ్యమంత్రినని ఎప్పుడూ భావించలేదని, ఒక సామాన్య కార్తకర్తలానే ఎన్నికల్లో విజయం కోసం కష్టపడ్డానని ఆయన చెప్పుకొచ్చారు.

Also Read : పార్లమెంట్‎ను కుదిపేసిన అదానీ లంచం లొల్లి

మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే నిర్ణయాన్ని ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి వదిలేశానని, ఆయన నిర్ణయమే శిరోధార్యమని షిండే స్పష్టం చేశారు. మోదీ, అమిత్ షా ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. తాను ఇందుకు ఏమాత్రం చింతించడం లేదని ఆయన చెప్పారు. మహాయుతిలో చీలిక తీసుకురావడానికి తాను ఎంత మాత్రం సిద్ధంగా లేనని షిండే స్పష్టం చేశారు.

షిండే చేసిన ఈ వ్యాఖ్యలు తాను ముఖ్యమంత్రి పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పకనే చెబుతున్నాయి. ఫడ్నవీస్కు ఢిల్లీ నుంచి కబురు రావడంతో ఆయన హస్తినకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. షిండే, అజిత్ పవార్ కూడా గురువారం ఉదయానికి హస్తినకు చేరుకుంటారు. ఈ ముగ్గురినీ పక్కన పెట్టుకునే మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయంపై ఎన్డీయే గురువారం నాడు కీలక ప్రకటన చేయనుందని తెలిసింది.