ఏక్​నాథ్ షిండే vs ఉద్ధవ్ ఠాక్రే

ఏక్​నాథ్ షిండే vs ఉద్ధవ్ ఠాక్రే

భారతదేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. అదేవిధంగా దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం మహారాష్ట్రనే అని చెప్పవచ్చు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలను పరిగణనలోకి తీసుకుంటే.. ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు శరద్ పవార్, సుశీల్ కుమార్ షిండే, నారాయణ్ రాణే, అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే క్రియాశీలక రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌‌‌‌నాథ్ షిండే  ఇప్పుడు కీలకమైన మహా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. కాగా, శరద్ పవార్ 1978లో ముఖ్యమంత్రి అయ్యారు.

అశోక్ చవాన్ మాజీ ముఖ్యమంత్రి  ఎస్.బి. చవాన్ కుమారుడు.. పృథ్వీరాజ్ చవాన్ తల్లిదండ్రులు ఇద్దరూ కేంద్ర మంత్రులు. దేవేందర్ ఫడ్నవీస్  తండ్రి ఎమ్మెల్యే. మరో కీలక నాయకుడు సుశీల్ కుమార్ షిండేకు 40 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ కెరీర్ ఉంది. ఆయన కుమార్తె ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. నారాయణ్ రాణే  ఎంపీగా కొనసాగుతుండగా ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే దిగ్గజ శివసేన నాయకుడు బాల్ ఠాక్రే కుమారుడు. ప్రస్తుతం ఉద్ధవ్​ ఠాక్రే శివసేన (ఎంబీటీ) చీఫ్​గా ఉన్నారు. 

ఆటోడ్రైవర్​గా ఏక్‌‌‌‌నాథ్ షిండే ప్రస్థానం..

మహారాష్ట్ర ప్రస్తుత  ముఖ్యమంత్రి  ఏక్‌‌‌‌నాథ్ షిండే  ముంబైలో  ఆటో రిక్షా డ్రైవర్‌‌‌‌గా  జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే బీజేపీ కూటమితో పొత్తు ఏక్‌‌‌‌నాథ్ షిండే రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్  2024 చివరిలో వస్తాయి.  2024 జూన్​లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ  కూటమి మహారాష్ట్రలో ఘోరంగా పరాజయం పాలైంది.  48 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా బీజేపీ కూటమి 17 మంది లోక్​సభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. మహారాష్ట్రలో  ఇండియా కూటమి ప్రజల మద్దతును సాధించడంలో విజయం సాధించి అత్యధికంగా 31 ఎంపీ స్థానాలను గెలుపొందింది. లోక్​సభ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే మహారాష్ట్రలో ఇండియా కూటమి సులువుగా విజయం సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  అయితే,  రాజకీయాలను ఎప్పుడూ మనం కచ్చితంగా ఊహించలేం. 

ఆధిపత్య వర్గాల హవా

ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌‌‌‌నాథ్ షిండే  మరోసారి  సీఎం పదవిని  చేపడతారని  గత రెండు నెలల్లో నిర్వహించిన ప్రతి సర్వేలో తేలింది.  రాజకీయ వర్గాలకు ఇది అత్యంత ఊహించని పరిణామం. మహారాష్ట్ర రాజకీయాల్లో సహకార చక్కెర ఫ్యాక్టరీ  కంట్రోలర్లు,  విద్యా సంస్థల గ్రూపులు,  రియల్ ఎస్టేట్,  పలు వ్యాపార కుటుంబాలు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.   నాయకులు నిలదొక్కుకోవడం చాలా కష్టమైన విషయం.  మరాఠా యోధుడు, అత్యంత సీనియర్​ నాయకుడైన శరద్ పవార్ కూడా కేవలం 6 జిల్లాల్లో మాత్రమే ప్రభావం చూపుతున్నారు.  మొత్తం  మహా రాష్ట్ర  ఓటర్లను  పవార్​  ప్రభావితం చేయలేకపోతున్నారు. 

బీజేపీ కూటమిలో ఏక్​నాథ్​ షిండే కీలకం

ఉద్ధవ్ ఠాక్రే చాలా సమస్యాత్మక భాగస్వామి అని కాంగ్రెస్, శరద్ పవార్‌‌‌‌లకు కూడా తెలుసు. కానీ, ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో ఇప్పుడు వారు ఉద్ధవ్ ఠాక్రేను  ఏమీ చేయలేరు. ఎందుకంటే ఉద్ధవ్​ వారికి రాజకీయ హాని కలిగించవచ్చు. ఈ నేపథ్యంలో తమ కూటమిలోని మూడు ప్రధాన పార్టీలలో ఏ పార్టీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంటుందో ఆ పార్టీ అధినేతకే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఇండియా అలయన్స్ పేర్కొంది. కాబట్టి,  కాంగ్రెస్​తోపాటు, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే కలిసి బీజేపీ కూటమిపై పోరాడుతున్నారు. అయితే, ఎవరికివారు తమ పార్టీనే అత్యధిక ఎమ్మెల్యేలను గెలుచుకునేలా చూసుకోవడానికి తమలో తాము వారు నిశ్శబ్దంగా పోరాడుతున్నారనేది వాస్తవం. బీజేపీ కూటమిలో ముఖ్యమంత్రి ఏక్‌‌‌‌నాథ్ షిండేకు ప్రత్యర్థులు ఎవరూ లేరు. లోక్​సభ ఎన్నికల్లో ఏక్​నాథ్​షిండే పార్టీ బాగా రాణించగలిగింది. బీజేపీ, మరొక భాగస్వామి అజిత్ పవార్ పార్టీ కూడా ఆ స్థాయిలో రాణించలేకపోయాయి.  కాగా,  గత రెండు సంవత్సరాల్లో  సీఎం ఏకనాథ్ షిండే అపారంగా ఎదిగారనడంలో సందేహం లేదు. 

షిండే, ఉద్ధవ్ మధ్య వ్యత్యాసం ఏంటంటే..

శరద్ పవార్ పార్టీ, కాంగ్రెస్‌‌‌‌ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఉద్ధవ్ ఠాక్రే నవంబర్ 2019లో  ముఖ్యమంత్రి అయ్యారు. కానీ,  అకస్మాత్తుగా ఆయన పార్టీకి చెందిన 57 మంది శివసేన ఎమ్మెల్యేలలో 41 మంది ఎమ్మెల్యేలు  జూన్, 2022లో ఉద్ధవ్​ను  విడిచిపెట్టారు.  ఎమ్మెల్యేల ప్రధాన ఫిర్యాదు ఏమిటంటే ఉద్ధవ్ ఠాక్రే రెండు  సంవత్సరాలలో ఎన్నడూ తమను కలవలేదు. తన కోటరీ ఎమ్మెల్యేలను అవమానించడమే కాకుండా వారిపట్ల దారుణంగా ప్రవర్తించారు. ఏకనాథ్ షిండే మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఎమ్మెల్యేలతో సహా అందరికీ షిండే పూర్తిగా అందుబాటులో ఉన్నారు. అతను తక్కువగా మాట్లాడతారు కానీ ఎక్కువగా పని చేస్తారు. ఈ విషయంలో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌‌‌‌తో  ఏక్‌‌‌‌నాథ్ షిండేకు మధ్య పోలిక ఉందని చెప్పొచ్చు.

ఏక్​నాథ్ షిండే తండ్రి  బతుకుదెరువు  కోసం ముంబైకి వచ్చారు. ఏక్​నాథ్​ షిండే మొదటి ఉద్యోగం ఆటోడ్రైవర్. ఆయన వ్యక్తిత్వం కారణంగా శివసేనలో  నాయకుడిగా వేగంగా ఎదిగారు.  ఉద్ధవ్ ఠాక్రే తన నోటిలో బంగారు చెంచాతో జన్మించాడు. అంతేకాదు మహారాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో ప్రభావం చూపిన అతిపెద్ద నాయకుడు బాల్ ఠాక్రే  కొడుకు. ఏక్​నాథ్​ షిండే గత30 నెలల నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, ఆయన సీఎం పదవిలో ఉన్నా ఎప్పుడూ వివాదాస్పదంగా మాట్లాడలేదు. చెడుగా ప్రవర్తించలేదు. మహారాష్ట్ర  ప్రజల గౌరవాన్ని సంపాదించారు. 

మహారాష్ట్ర ఎన్నికలను అంచనావేయడం కష్టం

మహారాష్ట్ర ఎన్నికల్లో మోదీ కీలకంగా వ్యవహరించడం లేదు. బీజేపీ కూటమికి ప్రధాన వ్యక్తిగా ముఖ్యమంత్రి ఏక్‌‌‌‌నాథ్ షిండే వ్యవహరిస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే  మహారాష్ట్రవాసుల భావోద్వేగాలతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే,  ఉద్ధవ్ ఠాక్రే తన తండ్రి బాల్ ఠాక్రే సిద్ధాంతాలను పూర్తిగా విస్మరించడం వల్లనే తాను శివసేనను విడిచిపెట్టానని ఏక్​నాథ్ షిండే చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇక  ఓటర్లే ఏకనాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.  మహారాష్ట్రలో ఏక్‌‌‌‌నాథ్ షిండే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్‌‌‌‌లకు పెద్ద కష్టమే. బీజేపీకి ఏక్​నాథ్​ షిండేను అనుసరించడం తప్ప మరో మార్గం లేదు.  కాగా,  ఆటోడ్రైవర్‌‌‌‌గా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి శరద్‌‌‌‌పవార్‌‌‌‌ వంటి రాజకీయ దిగ్గజ  నాయకులందరినీ ఓడిస్తాడో  లేదో చూద్దాం.

మహారాష్ట్రలో ఎలక్షన్​ సీన్​ ఎలా ఉందంటే..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలకం కాదు. ఎందుకంటే..  జూన్ 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో  మోదీపై పోరాడేందుకు అనేక శక్తులు ఏకతాటిపైకి చేరాయి. మరోవైపు ఈ ఎన్నికలు కేవలం రాష్ట్ర ఎన్నికలు.  అసెంబ్లీ ఎన్నికల పోరును పూర్తి స్థానిక పోరుగానే పరిగణించాలి. ఏక్​నాథ్ షిండే సేన వర్సెస్​ ఠాక్రే సేనల మధ్యనే మహా అసెంబ్లీ ఎన్నికల యుద్ధం జరగనుంది.  తమ కూటమిలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి  ఏక్​నాథ్ షిండే అని బీజేపీ ఇప్పటికే అంగీకరించింది. మరోవైపు ఇండియా కూటమిలో, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరూ అనేది ప్రకటించనప్పటికీ ఉద్ధవ్ ఠాక్రే స్వయంగా తనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తున్నారు. త్వరలో జరగబోయే మహా అసెంబ్లీ ఎన్నికలు మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఏక్‌‌‌‌నాథ్ షిండేను మఖ్యమంత్రి పదవి నుంచి దించేయగలరా లేదా అనేది నిర్ణయించనున్నాయి. కాగా, కాంగ్రెస్ కూటమిలో చేరడం ద్వారా ఉద్ధవ్ ఠాక్రే తన తండ్రి బాల్ ఠాక్రే  ఆచరించిన హిందూత్వ భావజాలాన్ని విడిచిపెట్టారు. ఇది ఓ కీలక పరిణామం.

డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ అనలిస్ట్