- రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని జనం కోరుకుంటున్నరు
- హిమాచల్, కర్నాటక లాంటి పరిస్థితే తెలంగాణలోనూ ఉన్నది
- కాంగ్రెస్ సహా దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని కామెంట్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్, కేటీఆర్‌లా తానేమీ జోస్యం చెప్పనని.. ఎవరు ఏక్నాథ్షిండేలవుతారన్నది త్వరలోనే తెలుస్తుందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ చెప్పారు. ఎవరు ఏకు అయితరో, ఎవరు మేకు అయితరో అనేది కాంగ్రెస్, బీఆర్ఎస్ కు లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలుస్తుందన్నారు. ‘‘రాష్ట్రంలో డబుల్ఇంజన్సర్కార్రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్లు కోరుకున్నట్టే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. గ్యారంటీలను అమలు చేయకుంటే హిమాచల్‌ప్రదేశ్, కర్నాటకలో ప్రజలు ఎలా తిరగబడుతున్నారో చూస్తున్నాం. అందుకు తెలంగాణ కూడా అతీతమేమీ కాదు” అని కామెంట్ చేశారు.
బుధవారం బీజేపీ స్టేట్ఆఫీసులో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు. అవినీతి, కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని ఆయన అన్నారు. ‘‘గడీలను బద్దలుకొడతామన్న వాళ్లే ఇప్పుడు గడీల్లో పోయి ఉంటున్నారు. మోదీని ఎదుర్కొనేందుకు గడీల పాలన, రాచరిక వ్యవస్థలో ఉండాలని గడీల్లో తలదాచుకుంటున్నారు” అని విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం జైల్లో ఉందని, అన్ని ప్రొసీజర్ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. మోదీకి కుటుంబం లేదని అవహేళన చేస్తున్నాయి. కానీ దేశమంతా మోదీకి అండగా ఉంది. మోదీకి సొంతిల్లు లేదు..కానీ ఆయన దేశంలోని 4 కోట్ల మందికి ఇండ్లు కట్టిచ్చారు” అని అన్నారు.
పాకిస్తాన్ పై ఎందుకంత ప్రేమ?
కాంగ్రెస్‌తో పాటు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ నిజంగా జాతీయ పార్టీనో కాదో తేల్చుకోవాలన్నారు. ‘‘రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని సోనియా చూస్తున్నారు. కొడుకునో, బిడ్డనో సీఎం చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. ఇవన్నీ ఫ్యామిలీ ఫస్ట్పార్టీలు. కానీ మోదీ మాత్రం నేషన్ ఫస్ట్ నినాదంతో ముందుకెళ్తున్నారు. కుటుంబ పాలనకు మోదీ పూర్తిగా వ్యతిరేకం” అని అన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకంగా ఇండియా కూటమి వ్యవహారం ఉన్నదని మండిపడ్డారు. మోదీపై అక్కసుతోనే రాముడిని, దేశాన్ని ద్వేషిస్తున్నారని ఫైర్ అయ్యారు. జైశ్రీరామ్నినాదాలకు వ్యతిరేకమంటూ హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం..
రాష్ట్రంలో కాంగ్రెస్ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లక్ష్మణ్విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలుచేయలేక చేతులెత్తేసిందని ఫైర్ అయ్యారు. ‘‘గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నారు. అది దాటితే మొత్తం బిల్లు కట్టుమంటున్నారు. 90 లక్షల మందికి గ్యాస్కనెక్షన్లుంటే, కేవలం 40 లక్షల మందికే రూ.500కే సిలిండర్ ఇస్తామంటున్నారు. రూ.4 వేల పింఛన్ఇస్తామని ఇప్పటికీ ఇవ్వడం లేదు. రైతు భరోసా, రైతు రుణమాఫీ ఊసే లేదు” అని మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్మధ్య సంధి కుదిర్చేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తున్నది. ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుంది” అని అన్నారు. బీజేపీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మండలానికి ఇద్దరు చొప్పున సోషల్‌మీడియా వారియర్లను నియమిస్తామని చెప్పారు.