![లింగమంతులస్వామి జాతరకు భారీ బందోబస్తు](https://static.v6velugu.com/uploads/2025/02/elaborate-security-arrangements-for-peddagattu-lingamathulaswamy-fair_nrVFu07g6U.jpg)
- 2 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు
- 68 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా
- 50 మంది సిబ్బందితో షీటీం బృందాలు
- నేటి అర్ధరాత్రి నుంచి జాతీయ రహదారి 65పై వాహనాల దారి మళ్లింపు
- జాతరకు 60 ప్రత్యేక బస్సులు
సూర్యాపేట, వెలుగు : లక్షలాది మంది భక్తులు తరలిరానున్న పెద్దగట్టు లింగమతులస్వామి జాతరకు పోలీస్ శాఖ సమాయత్తమైంది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తోంది. రేపటి నుంచి ఐదు రోజులపాటు జాతర జరగనుంది. ఇందుకోసం 2 వేల మంది పోలీస్ సిబ్బంది, 500 మంది వాలంటీర్లను నియమించారు. 68 సీసీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా వాహనాల దారి మళ్లింపు, పార్కింగ్ స్థలాలతో సిద్ధం చేసిన రూట్ మ్యాప్ ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సోమవారం విడుదల చేశారు.
వాహనాల మళ్లింపు..
హైదరాబాద్ –- విజయవాడ జాతీయ రహదారి 65పై శనివారం అర్ధరాత్రి నుంచి వాహనాల దారి మళ్లింపు కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి వద్ద దారి మళ్లించి నల్గొండ వైపుగా మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ మీదుగా తరలిస్తారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు, కోదాడ వద్ద మళ్లించి హుజూర్నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా పంపిస్తారు.- హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 365 మీదుగా మళ్లించనున్నారు.
-కోదాడ వెళ్లే వాహనాలను కోదాడ, మునగాల, గుంపుల మీదుగా ఎస్సారెస్పీ కెనాల్ నుంచి బీబీగూడెం నుంచి సూర్యాపేటకు రానున్నాయి. సూర్యాపేట నుంచి కోదాడ వెళ్లే వాహనాలు కుడకుడ, ఐలాపురం, ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాఘవపురం స్టేజి నుంచి నామవరం గ్రామం మీదుగా జాతీయ రహదారి 65పై గుంజలూరు స్టేజి వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపునకు పంపనున్నారు.
2 వేల మందితో భద్రత..
జాతరలో ఎవరికీ ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గుట్టపైన, కింద ఐదు కిలోమీటర్ల మేర అడుగడుగునా నిఘా పెట్టారు. 2 వేల మంది పోలీసులతో ఇద్దరు ఏఎస్పీలు, 10 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 148 మంది ఎస్సైలు, 400 మంది ఏఎస్సైలు, 200 మంది మహిళా సిబ్బందితోపాటు స్పెషల్ పార్టీలు, డాగ్ స్కాడ్స్ బృందాలు విధుల్లో పాల్గొంటారు. వీరితోపాటు అదనంగా మాఫ్టీ సిబ్బంది, సీసీఎస్ సిబ్బంది, టెక్నికల్ టీం సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, పోలీసు కళాబృందాలు భద్రతా చర్యలు చేపడుతాయి.
500 మంది వాలంటీర్స్ తో పటిష్టమైన బందోబస్తు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. జాతర పరిసరాల్లో పోలీసు కంట్రోల్ రూమ్, హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాలు, బారికేడ్లు, క్యూలైన్స్, సీసీ కెమెరాల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు ఎస్పీ సమీక్షించనున్నారు. జాతరలో 68 సీసీ కెమెరాలతోపాటు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తారు.
పెద్దగట్టు జాతరకు 60 ప్రత్యేక బస్సులు..
తెలంగాణలో రెండేండ్లకు ఒకసారి జరిగే రెండో అతిపెద్ద జాతరైన దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ కె.జానిరెడ్డి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. లింగమంతుల స్వామి జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు రానున్నారు. భక్తుల సౌకర్యార్థం జాతరకు సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేశామని తెలిపారు. సూర్యాపేట నుంచి పెద్దగట్టు జాతరకు బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.20 అని తెలిపారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
పెద్దగట్టు జాతరకు భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. ప్రతిఒక్కరికీ రక్షణ కల్పిస్తూ స్వామివారి దర్శనం కల్పిస్తాం. పోలీసుల సూచనలను ప్రజలు పాటించాలి. దొంగతనాల నివారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. రద్దీ ఎక్కువగా ఉంటుంది.. కావున భక్తులు తమ విలువైన వస్తువులు వెంట తెచ్చుకోవద్దు. అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉన్న పోలీసులు, పోలీస్ కంట్రోల్ రూంను సంప్రదించాలి. సన్ ప్రీత్ సింగ్, ఎస్పీ, సూర్యాపేట