ఎలగందల్ ఖిల్లాకు మహర్దశ : మినిస్టర్ గంగుల కమలాకర్
రూ.90 కోట్లతో రోడ్డు పనులకు భూమి పూజ
కరీంనగర్ టౌన్, వెలుగు: ఎంతో చరిత్ర కలిగిన పాత ఎలగందల్ ఖిల్లాకు మహర్దశ పట్టనుందని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రూ.90 కోట్లతో నిర్మించే ఎలగందల్ నుంచి సిరిసిల్లకు వెళ్లే మెయిన్ రోడ్, బ్రిడ్జి పనులకు శనివారం ఎలగందల్ గ్రామంలో మినిస్టర్భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టుకుందన్నారు. పాత రోడ్డు నిర్మాణంతో ఎలగందల్ ప్రజల చిరకాల వాంఛ తీరుతుందని, 6 నెలల్లో క్వాలిటీతో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు కరీంనగర్ లోని మీసేవ ఆఫీస్ లో రూ.28.66లక్షల విలువైన 78చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
భరోసాతో మహిళలకు పూర్తి భద్రత..
కరీంనగర్ కమిషనరేట్ లోని కొత్తపల్లిలో రూ.1.7కోట్ల వ్యయంతో నిర్మించనున్న భరోసా కేంద్రానికి శనివారం మినిస్టర్గంగుల శంకుస్థాపన చేశారు. మహిళలు, పిల్లలపై వేధింపులు, హింసాత్మక సంఘటనలు జరిగిన సందర్భంలో భరోసా కేంద్రం రక్షణ కల్పిస్తుందన్నారు. స్టేట్ ఉమెన్ సేఫ్టీ విభాగం, షీటీం, వివిధ ప్రాంతాలకు చెందిన పోలీస్ స్టేషన్ల అధికారుల సమన్వయంతో భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ సత్యనారాయణ తెలిపారు.
బీజేపీ వదిలిన బాణాలే షర్మిల, కేఏ పాల్..
షర్మిల, కేఏపాల్ బీజేపీ వదిలిన బాణాలని, పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారని మంత్రి గంగుల ఆరోపించారు. కలెక్టరేట్ లో 92 మంది లబ్ధిదారులకు రూ.92లక్షల విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. సమైక్యవాదుల నుంచి తెలంగాణను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, ఎంపీపీ లక్ష్మయ్య, గ్రంథాలయ చైర్మన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై ఉద్యోగులకు అవగాహన ఉండాలి
పెన్షనర్స్ డే లో కలెక్టర్కర్ణన్
కరీంనగర్ టౌన్,వెలుగు: ఉద్యోగ విరమణ పొందిన వారందరికి మెయింటనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్ చట్టంపై అవగాహన ఉండాలని కలెక్టర్ కర్ణన్ అన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ గార్డెన్స్ లో నిర్వహించిన జాతీయ పెన్షనర్స్ డే సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం పెన్షనర్ల ఉద్యమనేత డీఎస్ నాకారా చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, టీఎన్ జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
సుల్తానాబాద్: మండల ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం అఖిల భారత పెన్షనర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు ఎండి. మునీరొద్దీన్, పిట్టల వెంకటయ్య, దొడ్ల లక్ష్మయ్య, గరిగే లక్ష్మీబాయి, అల్లం సత్యనారాయణ, వి. వి. సత్యనారాయణ, పోచమల్లు, రాజ మల్లమ్మ, ఏపీ పద్మావతి, మధురకవి, వీర లక్ష్మణ్, కనుకయ్య, జడ్పీ హైస్కూల్ హెచ్ఎం శారదను సత్కరించారు.
జమ్మికుంట: ఇల్లంతకుంట, జమ్మికుంట మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కేంద్రంలో శనివారం పెన్షనర్స్ డే ఈ సందర్భంగా పలువురు పెన్షనర్లను సన్మానించారు. సమావేశంలో మండల శాఖ అధ్యక్షులు మోహన్ రావు, మండల శాఖ గౌరవ అధ్యక్షులు రామనాథం, ప్రధాన కార్యదర్శి విఠల్ రావు, కోశాధికారి శ్యాంసుందర్ పాల్గొన్నారు.
కోరుట్ల: కోరుట్లలో పెన్షనర్స్ సమస్యల పరిష్కారంతో పాటు పెన్షనర్స్ బిల్డింగ్ నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. శనివారం కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో పెన్షనర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పట్టణ శివారులోని ఎస్టీఓ, తహసీల్దార్ ఆఫీసులను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ సమీపంలోకి మార్చుతామని హామీ ఇచ్చారు. అనంతరం సీనియర్ పెన్షనర్స్ ను సన్మానించి, రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, ఎస్టీఓ లావణ్య, మున్సిపల్ కమిషనర్ అయాజ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల రూరల్: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన పెన్షనర్స్ డే వేడుకల్లో ఆయన మాట్లాడారు. పెన్షనర్స్ భవనం లోని ఆడిటోరియం నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు గంగరాజం, అసోసియేట్ ప్రెసిడెంట్ సత్య నారాయణ, కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు.
రాజన్న ఆలయంలో టెండర్లు
వేములవాడ, వెలుగు: వేములవాడ లక్ష్మీ నరసింహ ఆలయ గుట్టపై పలు రకాల విక్రయాలకు రెండేండ్ల కోసం శనివారం ఆధికారులు టెండర్లు వేశారు. గుట్టపై కొబ్బరి కాయలు, పూజ సామగ్రి విక్రయించుకునేందుకు భిక్షపతి రూ.37లక్షల 27 వేలకు, ప్రమిదలు, ఒత్తులు, ఆయిల్ విక్రయించేందుకు మహేందర్రూ.16 లక్షల 66 వేల 666కు, పాలు, నూనె పాత్రల అమ్మకానికి రూ.10 లక్షల 116, ఫొటోల లీజు హక్కు లకు రూ.15 లక్షల 516 లకు సిద్ధార్థ దక్కించుకున్నాడు. క్యాంటిన్ నిర్వహణకు రూ.8 లక్షల 11 వేలకు శ్రీకాంత్, కొబ్బరికాయల సేకరణకు రూ.9 లక్షల 55 వేలకు, పప్పు, బెల్లం, బొమ్మల విక్రయానికి రూ.6 లక్షల 75 వేలకు మనీష్ ఎంటర్ ప్రైజెస్సిబ్బంది దక్కించుకున్నట్లు ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ తెలిపారు.
23న సీపీఐ బహిరంగ సభ : జిల్లా కార్యదర్శి వేణు
వీర్నపల్లి, వెలుగు : మండల కేంద్రంలో డిసెంబర్23న పీపీఐ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్విగ్రహం వద్ద ఆయన మాట్లాడారు. మండల కేంద్రంలోని వెంకట్రాయిని చెరువులో భుములు మునిగిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. బహిరంగ సభకు జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజయ్య, కార్యవర్గ సభ్యులు రవి, లక్ష్మణ్, ప్రభాకర్ ఉన్నారు.
జెండా గద్దెను కూల్చారని బీఎస్పీ ధర్నా
మానకొండూర్, తిమ్మాపూర్, వెలుగు: మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఉన్న బీఎస్పీ జెండా గద్దెను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడంతో ఆ పార్టీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జాతీయ రహదారిపై ధర్నా చేశారు. సమాచారం తెలుసుకున్న ఆ పార్టీ స్టేట్ చీఫ్ ప్రవీణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని లీడర్లతో మాట్లాడారు. తమ పార్టీ జెండా గద్దెలను కూల్చి పాదయాత్రకు అడ్డొస్తే తగిన బుద్ధి చెబుతామని అన్నారు. అనంతరం నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్సై తిరుపతికి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ, రాష్ట్ర మహిళా కన్వీనర్ శిరీష, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మా సమస్యలు పట్టించుకోండి సారూ..
అడిషనల్ కలెక్టర్కు శాత్రాజ్ పల్లి గ్రామస్తుల వేడుకోలు
ముత్తారం,వెలుగు : తమ సమస్యలు పరిష్కరించాలని ముత్తారం మండలం శాత్రాజ్ పల్లి గ్రామాస్తులు శనివారం అడిషనల్ కలెక్టర్ ను వేడుకున్నారు. మానేరు అవతలి ఒడ్డున శాత్రాజ్ పల్లి గ్రామం ఉండడంతో ఎవరూ తమ సమస్యలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి రవాణా సౌకర్యం, మురికి కాలువలు లేవని, డబుల్ బెడ్రూం, మరుగుదొడ్లు, మిషన్ భగీరథ పథకాలకు కూడా తామకు అందడంలేదని వాపోయారు. వర్షా కాలంలో వాగు నుంచి వచ్చే మురికి నీరు తాగి అనారోగ్యంపాలు అవుతున్నామని పేర్కొన్నారు. రేషన్ బియ్యం కోసం మానేరు దాటి పోవాల్సి వస్తుందని, సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని అడిషనల్కలెక్టర్ను కోరారు. a