తండ్రి మృతదేహానికి పెద్ద కూతురు అంత్యక్రియలు

పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లాలో తండ్రి మృతదేహానికి పెద్ద కూతురు అంత్యక్రియలు నిర్వహించింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెనుబల్లి మండల కేంద్రానికి చెందిన మిద్దె రాములు(70)కు ముగ్గురు కూతుళ్లు. అందరికీ పెండ్లిళ్లు చేశాడు. కొన్నేళ్ల కిందట భార్య చనిపోగా, అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

చూసేవారు ఎవరూ లేకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది రెండు రోజుల కింద పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు హాస్పిటల్​కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయాడు. గురువారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా పెద్ద కూతురు గుడిమెట్ల చెన్నమ్మ కొడుకై తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టింది.