వృద్ధ దంపతులపై కుక్కల దాడి .. భార్య పరిస్థితి విషమం

వృద్ధ దంపతులపై కుక్కల దాడి ..  భార్య పరిస్థితి విషమం

జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ ​జిల్లా జమ్మికుంట మండలంలోని నాగారంలో వృద్ధ  దంపతులకు వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇందులో భార్య పరిస్థితి విషమంగా ఉంది. గ్రామానికి చెందిన రామ్ కనకమ్మ, రామ్ బోషయ్య భార్యాభర్తలు. కొంతకాలంగా కనకమ్మ అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. బుధవారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రపోగా మూడు వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి దిగాయి. కనకమ్మ ఎడమ కాలు, వేళ్లతో పాటు చేతిని చీల్చి తీవ్రంగా గాయపరిచాయి. బోషయ్య భుజంపై, గొంతు, వెన్ను భాగంలో గాయాలయ్యాయి. వారి అరుపులతో లేచిన చుట్టుపక్కల వారు ఇద్దరిని హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. మూడు రోజుల కింద జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో కూడా వీధి కుక్కలు దాడి చేయడంతో 21 మంది గాయపడ్డారు.  

ఎనిమిది మందిని కరిచిన పిచ్చి కుక్క 

భిక్కనూరు: కామారెడ్డి జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. జంగంపల్లి, అంతంపల్లి గ్రామంలో రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని కరిచిన పిచ్చికుక్క భిక్కనూరు టోల్​ప్లాజాలో డ్యూటీ చేసి బయటకు వస్తున్న నర్సగల్ల సురేశ్​పై కూడా దాడి చేసింది. అక్కడి సిబ్బంది కుక్కను తరమగా రామేశ్వరపల్లికి చేరుకుంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న నాగర్తి రాధమ్మ, సందుగారి లలిత, పైతరి సుశీలపై దాడి చేసింది.  గ్రామంలోకి వచ్చి గీత కార్మికులైన నాగరాజ్​గౌడ్​, వినోద్​గౌడ్​లను కరిచింది. అందరూ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.