
- కొడుకులు పట్టించుకోవడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వృద్ధ దంపతులు
మెదక్, వెలుగు : కొడుకులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లు అందరూ ఉన్నా తాము అనాథలుగా బతుకుతున్నామని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు తీసుకున్న కొడుకులు కనీసం అన్నం కూడా పెట్టడం లేదని వాపోయారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన దేసి కొండయ్య, శివలక్ష్మి దంపతులు సోమవారం మెదక్ కలెక్టరేట్ వచ్చి ప్రజావాణిలో తమ గోడు వెల్లబోసుకున్నారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం... కొండయ్య, శివలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు సత్యనారాయణ గ్రామంలోనే పౌల్ట్రీ ఫారం నడుపుతుండగా, చిన్న కొడుకు కాశీనాథం పటాన్‌చెరు మండలం పటేల్‌గూడలో బిజినెస్ చేస్తున్నాడు. దంపతులకు ఉన్న ఆరు ఎకరాల పొలాన్ని ఇద్దరు కొడుకులకు పంచి ఇచ్చారు. అయితే ఆరు నెలలుగా కొడుకులు, కోడళ్లు పట్టించుకోకపోవడంతో సోమవారం మెదక్ వచ్చి కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
తమకు అనారోగ్యంగా ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లడం లేదని, కనీసం అన్నం కూడా పెట్టకపోవడంతో తామే వంట చేసుకొని రోజులు వెల్లదీస్తున్నామని కలెక్టర్ ముందు కన్నీటి పర్యంతమయ్యారు. రోజురోజుకు వయసు మీద పడుతుండడంతో ఇబ్బందులు పెరుగుతున్నాయన్నారు. తమకు భోజన వసతి కల్పించడంతో పాటు బాగోగులు చూసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్ ఈ విషయంపై ఎంక్వైరీ చేసి దంపతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తూప్రాన్ ఆర్డీవోను
ఆదేశించారు.