
‘‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం వున్నవాడు’’.. ఈ మాటలను పచ్చి నిజాలని మరోసారి రుజువైంది. బెంగళూరులో వెలుగుచూసిన ఒక అమానవీయ ఘటన ఇందుకు అద్దం పట్టింది. అత్తమామలను ఇంట్లో నుంచి కర్కశంగా బయటకు గెంటేసిన ఓ వివాహిత శాడిజం ఈ ఘటన.
పదేళ్లుగా అత్తమామలకు నరకం చూపిస్తున్న ఒక ప్రభుత్వ వైద్యురాలి పైశాచికం ఇది. 80 ఏళ్ల వయసున్న ఆమె మావయ్య హార్ట్ పేషెంట్. అయినా సరే.. ఆ కోడలికి కనీసం జాలి లేదు. ఈ అమానుష ఘటనలో మరో అమానవీయ కోణం ఏంటంటే.. ఆ కోడలితో పాటు ఆమె కొడుకు, కూతురు కూడా తాత, నానమ్మను తిడుతూ.. కొడుతూ ఆ వృద్ధులపై ప్రతాపం చూపించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు విక్టోరియా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రియదర్శిని అనే వివాహిత డాక్టర్గా పనిచేస్తోంది. జె.నరసింహయ్య అనే పెద్దాయన కొడుకుతో ప్రియదర్శినికి 2007లో వివాహమైంది. పెళ్లయిన కొన్నేళ్లు భార్యాభర్తలిద్దరూ సఖ్యతతోనే ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ ఇద్దరు పిల్లలు పుట్టిన కొంతకాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలొచ్చాయి. పిల్లలు ఇద్దరూ పెరిగి పెద్దవాళ్లయ్యారు.
ప్రియదర్శిని, ఆమె భర్త విడిపోవాలని ఇటీవల విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే.. ప్రియదర్శిని తన కొడుకు, కూతురుతో కలిసి మార్చి 10న నరసింహయ్య ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఉన్న 80 ఏళ్ల నరసింహయ్యను, అతని భార్యను ప్రియదర్శిని, ఆమె ఇద్దరు పిల్లలు బయటకు ఈడ్చుకొచ్చారు. ప్రియదర్శిని అయితే తన అత్త మంగళసూత్రం పట్టుకుని, జుట్టు పట్టుకుని ఈడ్చేసింది. ప్రియదర్శిని కూతురు తన నానమ్మపై దాడి చేసింది. ప్రియదర్శిని, ఆమె కొడుకు, కూతురు నానా రచ్చ చేసి నరసింహయ్యపై, అతని భార్యపై దాడి చేసినంత పనిచేశారు.
It is deeply disturbing to see elderly parents suffering abuse at the hands of their daughters-in-law. One such horrifying case involves Dr. Priyadarshini N, a doctor at Victoria Government Hospital, who harassed her in-laws for over a decade. Her mistreatment forced them to… pic.twitter.com/FPh2IpmHq9
— Karnataka Portfolio (@karnatakaportf) March 13, 2025
ప్రియదర్శిని తన అత్తమామలను తిడుతూ, కొడుతూ ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసింది. వాస్తవానికి అది నరసింహయ్య సొంత ఇల్లు. ఆ ఇంట్లో నుంచి నరసింహయ్యను, అతని భార్యను బయటకు ఈడ్చేసి అద్దె ఇంట్లో ఉండాలని తిడుతూ ప్రియదర్శిని హంగామా చేసింది. ఈ ఘటనను అక్కడున్న వాళ్లలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రియదర్శినిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు.
ప్రియదర్శినిపై నరసింహయ్య అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రియదర్శినిపై కేసు నమోదు చేశారు. వయసులో పెద్ద వాళ్లని కూడా చూడకుండా అత్తమామలతో ఇంత కర్కశంగా వ్యవహరించిన ప్రియదర్శినిని, ఆమె కొడుకు, కూతురును కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.