- ఇంటి ముందు వృద్ధ దంపతులు బైఠాయింపు
- జగిత్యాల జిల్లా కోరుట్ల టౌన్ లో ఘటన
కోరుట్ల,వెలుగు: కొడుకు పట్టించుకోకపోవడంతో పాటు ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. వృద్ధ దంపతులు తెలిపిన ప్రకారం.. కోరుట్ల ఆనంద్‌నగర్‌కు చెందిన గంగాధర సుబ్బయ్య, లక్ష్మి దంపతులకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు. కాగా.. కొన్నేండ్లుగా తల్లిదండ్రులను కొడుకు చూడడంలేదు. దీంతో కూతురు ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల బుచ్చయ్య అనారోగ్యం పాలవడంతో వైద్యానికి అప్పులు చేశారు.
డబ్బులు లేకపోవడంతో కొడుకు వద్దకు వెళ్లారు. కుల సంఘం పాలు డబ్బులు అయినా ఇవ్వాలని వేడుకున్నారు. అతడు పట్టించుకోకపోవడంతో చేసేదిలేక కుల సంఘ పెద్దలను ఆశ్రయించినా ఫలితంలేదు. దీంతో ఆర్డీవో ఆఫీస్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆర్డీవో జివాకర్ రెడ్డి వృద్ధ దంపతుల కొడుకు లింగ మూర్తిని పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. తల్లిదండ్రులను చూసుకోవాలని ఖర్చులకు నెలకు రూ.3 వేల ఇవ్వాలని ఆదేశించినా పట్టించుకోవడంలేదు. దీంతో చేసేదేమీ లేక వృద్ధ తల్లిదండ్రులు కొడుకు ఇంటి ముందు మంగళవారం బైఠాయించి తమను చేరదీసి ఆదుకోవాలని కోరారు.