
- హనుమకొండ జిల్లా గట్ల నర్సింగాపూర్ లో ఘటన
భీమదేవరపల్లి, వెలుగు : తన వాటా భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని మనస్తాపం చెందిన వృద్ధ రైతు ఆత్మహత్యయత్నం చేసిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రాచర్ల కొమురయ్య, బక్కయ్య, మీనయ్య అన్నదమ్ములు. వీరు వారసత్వంగా వచ్చిన భూమిని పంచుకున్నారు. కాగా ఇద్దరు వెంటనే పట్టా చేయించుకోగా బక్కయ్య ఆర్థిక పరిస్థితి బాగాలేక చేయించుకోలేదు. దీంతో బక్కయ్య అన్న కొడుకు మాజీ సర్పంచ్ రాచర్ల సారయ్య తన పలుకుబడితో ఎకరం 6 గుంటల భూమిని అక్రమంగా తన పేరిట పట్టా చేయించుకున్నాడు.
తిరిగి తన పేరిట పట్టా చేయించమని కోరుతూ ఖర్చుల నిమిత్తం బక్కయ్య కొంత డబ్బు ఇచ్చినా పట్టించుకోవడంలేదు. సోమవారం ఉదయం సారయ్య ఇంటికి వెళ్లి బక్కయ్యను అతని భార్య పద్మ బూతులు తిట్టడంతో మనస్తాపం చెందాడు. అక్కడే బక్కయ్య తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బక్కయ్యను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.