అనుమానాస్పద స్థితిలో.. మంచిర్యాల జిల్లాలో వృద్ధుడి హత్య

అనుమానాస్పద స్థితిలో.. మంచిర్యాల జిల్లాలో వృద్ధుడి హత్య

బెల్లంపల్లి రూరల్, వెలుగు:  వృద్ధుడు దారుణ హత్యకు గురైన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. వేమనపల్లి మండలం కల్మలపేటకు చెందిన బద్ది లచ్చయ్య(64) మొదటి భార్య చనిపోగా.. లక్ష్మి అనే మహిళను రెండో పెళ్లి చేసుకోగా.. వీరికి నలుగురు కొడుకులు ఉన్నారు. తండ్రి ఇంట్లోనే చిన్నకొడుకు తిరుపతి, సమీపంలో మరో ఇద్దరు నారాయణ, పోచన్న, మంచిర్యాలలో మరో కొడుకు రాములు నివసిస్తున్నారు. లచ్చయ్య పొలం కౌలుకు చేయడంతో పాటు  గుడుంబా అమ్ముతుంటాడు. 

శనివారం అర్ధరాత్రి ఉరుములు, చిరుజల్లులతో గాలి దుమారం వస్తుండగా.. ఆ సమయంలో లచ్చయ్య తన ఎక్స్ఎల్​బైక్​పై బయటకు వెళ్లాడు. వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యంపై కవర్లు కప్పేందుకు తండ్రి వెళ్లాడని తిరుపతి భావించాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఇంట్లో లచ్చయ్య మంచంపై నుంచి కిందపడి రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. కోడలు సమ్మక్క వెంటనే కుటుంబసభ్యులకు తెలిపింది. ఎడ్లబండికి ఉండే గడుగొయ్య ఘటనా స్థలిలో కనిపించగా.. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేసి ఉంటారని అనుమానించారు. 

పెద్ద కొడుకు నారాయణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన స్థలాన్ని జైపూర్​ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్​ సీఐ సుధాకర్, ఎస్ఐ శ్యాంపటేల్​ పరిశీలించారు. క్లూస్, డాగ్​స్వ్యాడ్​ టీమ్ లో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతుడి ఫోన్ కాల్​డేటా వివరాలు సేకరించి కుటుంబ సభ్యులా ? బయటి వ్యక్తులు హత్య చేశారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు నీల్వాయి ఎస్ఐ శ్యాంపటేల్ ​తెలిపారు.