- సర్కారుకు వరంగల్ వృద్ధుడు రామస్వామి మొర
- ధరణిలో పొరపాటున రామస్వామి పేరుతో రూ.4 కోట్ల విలువజేసే భూమి
- ఇదే అదనుగా తమకు పట్టా చేయాలని పలువురు రియల్టర్ల బెదిరింపులు
- సెటిల్‍మెంట్ పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్న పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు
- సర్కారుకు తప్ప వేరెవరికీ ఇవ్వనని రెండేండ్లుగా పోరాటం
- కబ్జాదారుల నుంచి రక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు
వరంగల్, వెలుగు : ధరణిలో జరిగిన పొరపాటు ఆ వృద్ధుడి పాలిట శాపమైంది. వరంగల్ రింగ్ రోడ్డు పక్కన రూ.4 కోట్లు విలువ చేసే 33 గుంటల భూమి 78 ఏండ్ల శ్రీభద్రి రామస్వామి అనే వృద్ధుడి పేరిట తప్పుగా నమోదైంది. దీనికి కొత్త పాస్‌బుక్ కూడా వచ్చింది. దీంతో రికార్డుల్లో తన పేరు తొలగించి, సర్కారు పేరు ఎక్కించాలని తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. ఈ లోగా విషయం తెలిసి పలువురు కబ్జాదారులు, రియల్టర్లు రంగంలోకి దిగి, ఆ భూమిని తమకు పట్టా చేయాలని బెదిరిస్తున్నారు. భూమిపై కన్నేసిన కొందరు రియల్టర్లయితే.. పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్ల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని రామస్వామి ఆరోపిస్తున్నాడు. భూమి పాస్ బుక్ తీసుకొని, తాము చెప్పిన చోట సంతకాలు చేయాలని బెదిరిస్తున్నారని వాపోతున్నాడు. తనది కాని భూమిని ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాలి తప్ప, తాను ఎవ్వరికీ భయపడి సంతకాలు పెట్టే ప్రసక్తే లేదని రామస్వామి తెగేసి చెబుతున్నాడు. రక్షణ కోసం ఇంటిముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని.. వయసు సహకరించకున్నా అనుకున్న పని పూర్తి చేయడానికి ఇంకా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.
రింగ్ రోడ్ పక్కనే.. రూ.4 కోట్ల విలువైన భూమి
గ్రేటర్ వరంగల్ సిటీలోని కేయూసీ ప్రాంతానికి చెందిన శ్రీభద్రి రామస్వామి 1995లో ప్రస్తుత వరంగల్ ఇన్నర్ రింగ్‍రోడ్‍కు దగ్గర్లోని.. పెగడపల్లి గ్రామ పంచాయతీ పరిధి రెడ్డిపురం ప్రాంతంలో ఎకరం భూమి కొన్నాడు. 399/ఏ సర్వే నంబర్‍లో ఉన్న ఆ భూమిని అవసరాల కోసం పదేండ్ల క్రితం అమ్మేశాడు. కానీ ధరణిలో పొరపాటున 399/బీ సర్వే నంబర్‍లో 33 గుంటల భూమి రామస్వామి పేరుతో నమోదైంది. ఈ భూమి మోకా మీద కనిపిస్తున్నా వీళ్లు వారసులు అని చెప్పలేని పరిస్థితిలో రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు. టెక్నికల్‌గా ఆ భూమి రామస్వామిదే అని చెప్తున్నారు. రెండేండ్ల క్రితం ఈ భూమి పక్క నుంచే వరంగల్ ఇన్నర్ రింగ్‍రోడ్ ప్రారంభమైంది. హైదరాబాద్, కరీంనగర్ మీదుగా ములుగు, మేడారం, భూపాలపల్లి వైపు వాహనాలన్నీ ఈ మార్గంలోనే వెళుతున్నాయి. జగిత్యాల– విజయవాడ నేషనల్ హైవే దీనికే కనెక్ట్ అవుతోంది. దీంతో ఇక్కడి భూముల ధరలు ప్రస్తుతం ఒక్కో గుంటకు రూ.12 లక్షలకుపైగా పలుకుతున్నాయి. ఈ లెక్కన 33 గుంటలకు రూ.4 కోట్లకుపైగా విలువ ఉంది. ఇదే రామస్వామికి ప్రాణసంకటంలా మారింది.
రియల్టర్ల బెదిరింపులు.. ఆఫీసర్ల పైరవీలు..
తన పేరుతో వచ్చిన పాస్‌బుక్, అందులో ఉన్న భూమి తనది కాదని, ఆ పాస్ బుక్ క్యాన్సిల్ చేసి భూమిని వెనక్కి తీసుకోవాలని రామస్వామి తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ రెండేండ్లుగా తిరుగుతున్నాడు. ప్రతి సోమవారం కలెక్టరేట్‍లో నిర్వహించే గ్రీవెన్స్ లో అధికారులను కలిసి వినతిపత్రాలు ఇస్తున్నాడు. కానీ, ధరణి పోర్టల్‍లో పట్టాదారు పేరు మార్చే అధికారం తమకు లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. కాగా, రామస్వామి పేరుతో కోట్లు విలువ చేసే భూమి ఉండడం, వాటిని ఆయన తిరస్కరిస్తున్న విషయం కొందరు ఆఫీసర్ల ద్వారా తెలుసుకున్న కొంతమంది భూకబ్జాదారులు, రియల్టర్లు రంగంలోకి దిగారు. తామే భూయజమానులమంటూ రెండేండ్లుగా ఎవరికివారు రామస్వామి ఇంటికి వచ్చి సంతకాలు పెట్టాలని బెదిరిస్తున్నారు. కొందరైతే సంతకం పెట్టకపోతే పెట్రోల్ పోసుకుని చస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
ఇంకొందరు పోలీసులు, అధికారులతో పైరవీలు చేయిస్తున్నారు. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న కేయూ పీఎస్ సీఐ.. ఒకరికి ఫేవర్‍గా పాస్ బుక్ ఇప్పించాలని ఒత్తిడి చేశాడని రామస్వామి ఆరోపిస్తున్నాడు. ఇంకొందరు రెవెన్యూ ఆఫీసర్లు కూడా తాము చెప్పినవారికి రిజిస్ట్రేషన్ చేస్తే భూమి విలువలో సగం ఇప్పిస్తామని ప్రెజర్ చేశారనివాపోతున్నాడు. ఇదిలా ఉంటే..కేయూ పీఎస్‌కు కొత్తగా వచ్చిన మరో సీఐ తనను ఇటీవలే స్టేషన్‌కు పిలిపించి, పాత సీఐ చెప్పిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తి పేరుతో సంతకాలు చేయాలని బెదిరించాడని ఆరోపించాడు. తాను సర్కారుకు తప్ప ఎవరికీ భూమి ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్న రామస్వామి ఆత్మరక్షణ కోసం ఇంటిముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. భూమిని వెనక్కి తీసుకొని తన తండ్రిని కాపాడాలని రామస్వామి కొడుకు వేణు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు.
ధరణి పోర్టల్‍లో తప్పుగా నమోదైంది టార్చర్ అనుభవిస్తున్నా
ధరణి పోర్టల్‍లో నా పేరుతో తప్పుగా నమోదైన భూమి నాకొద్దు. ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాలని రెండేండ్లుగా తిరుగుతున్న. ఆఫీసర్లు మాత్రం డిలీట్ ఆప్షన్ లేదని, ఏమీ చేయలేమని అంటున్నరు. ఒకరేమో కోట్లాది రూపాయల భూములు కలిసొస్తే వదులుకోకు అంటున్నరు. ఇంకొందరు అవిమావే సంతకం పెట్టాలని బెదిరిస్తున్నరు. తాము చెప్పినోళ్ల పేరిట చేయాలని రెవెన్యూ ఆఫీసర్లు ఒత్తిడి చేస్తున్నరు. రెండేండ్ల కింద ఓ పోలీస్ ఆఫీసర్ తాను చెప్పిన వ్యక్తికి భూమి పట్టా చేయమని బెదిరించిండు. ఇప్పుడు మరో ఆఫీసర్ అతనికి కాకుండా మరో వ్యక్తి పేరుతో సంతకం పెట్టుమంటుండు. నేను మాత్రం అలా ఎవ్వరికి చేయను. ప్రభుత్వం నా పేరుతో ఇచ్చిన భూములను ప్రభుత్వమే వెనక్కు తీసుకోవాలే. రెండేండ్లుగా టార్చర్ అనుభవిస్తున్నా. అధికారులు ఏదో ఒకటి త్వరగా తేల్చాలే! - బాధితుడు రామస్వామి