వృద్ధాప్య పెన్షన్ల పంపిణీలో జాప్యం

నల్లగొండ జిల్లాలో వృద్ధుల బాధలు వర్ణణాతీతంగా మారాయి.పెన్షన్ల కోసం పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం అందించే పెన్షన్లు సకాలంలో అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదేంటని అడిగితే అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో పోస్టాఫీసుల ముందు గంటల కొద్దీ బారులు తీరుతున్నారు. ఆరోగ్య సమస్యలను లెక్కచేయకుండా పెన్షన్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా స్పృహతప్పి పడిపోయినా ఆస్పత్రికి తీసుకెళ్లే వారు కరువు అయ్యారని వాపోతున్నారు. 

తాజాగా మిర్యాలగూడ పోస్ట్ ఆఫీస్ దగ్గర వృద్ధులు ఆందోళన నిర్వహించారు. వృద్ధాప్య  పెన్షన్లు సరైన సమయంలో పంపిణీ చేయడం లేదంటూ ధర్నాకు దిగారు. దీంతో పోస్ట్ ఆఫీస్ దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతినెలా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఇబ్బందిపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు అనే కనికరం కూడా చూపించడం లేదని వాపోతున్నారు.  ప్రతి నెలా ఒకటో తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్లు..ఈ నెల 22వ తారీఖు వచ్చినా సగం మందికి కూడా పంపిణీ చేయలేదని చెబుతున్నారు. పెన్షన్లు ఇంటికి తెచ్చి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.