- చివరి దశలో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు, బిడ్డలు
- సాక లేమంటూ వదిలేస్తున్న వైనం
- చట్టంపై అవగాహన లేక రోడ్డున పడుతున్న వృద్ధులు
- జిల్లాలో పెరుగుతున్న ఘటనలు
జగిత్యాల, వెలుగు: కడుపున పుట్టిన పిల్లలే వృద్ధాప్యంలో కన్నవారిని వదిలించుకుంటున్నారు. జీవితాంతం పిల్లల కోసం కష్టపడిన తల్లిదండ్రులు ముసలితనంలో వారి కొడుకులు, బిడ్డలకు భారమవుతున్నారు. సంపాదించిన ఆస్తినంతా లాక్కొని కన్నవారిని గెంటేసిన వారు కొందరైతే.. సాకలేమంటూ మరికొందరు.. పీడ వదిలించుకోవాలని ఇంకొందరు తల్లిదండ్రులను ఇంటి నుంచి తరిమేస్తున్నారు.
మరికొందరైతే కన్నవారనే కనికరం లేకుండా ఇతర ప్రాంతాల్లో ఒంటరిగా వదిలేసి కసాయితనం చూపిస్తున్నారు. దీంతో సరిపడా తిండిలేక.. చేతిలో చిల్లిగవ్వ లేక.. అనారోగ్య సమస్యలతో వృద్ధులు తల్లడిల్లుతున్నారు. చట్టాలున్నా అవగాహనలేక.. ఎక్కడికెళ్లాలో.. ఎవరినీ కలవాలో తెలియక... న్యాయం దొరక్క ఉసూరుమంటున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో వరుసగా జరిగిన సంఘటనలు మానవత్వానికి మాయని మచ్చగా మిగిల్చాయి.
ఆస్తి కోసం దాడులు... గెంటివేతలు
- ఆస్తి కోసం కన్నవారిపై దాడులకు దిగుతున్నారు. కొందరు పిల్లలు. అలా ఆస్తులు లాక్కొని వృద్ధాప్యంలో వారి బాగోగులు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఇటీవల జగిత్యాలకు చెందిన ఓ వృద్ధురాలిని పించన్ కోసం ఆమె చిన్న కొడుకు దాడి చేశాడు. కాలికి గాయమై నడవలేని స్థితిలో ఉండడంతో ఆమెను శ్మశానంలో వదిలివెళ్లాడు. దీంతో నలుగురు కొడుకులు ఉన్నా ఆ అవ్వ అనాథలా బతుకీడుస్తోంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సఖీ కేంద్ర నిర్వాహకులు స్పందించి ఆశ్రయం కల్పించారు. సుమారు 10 రోజులపాటు చలిలో తీవ్ర దుర్వాసన మధ్య ఆ ముసలావిడ కాలం వెళ్లదీయడం స్థానికులను కలచివేసింది.
- కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన లలితమ్మకు ఇద్దరు కొడుకులు. పదిహేనేళ్లుగా ఎవరూ పట్టించకోకపోవడంతో పించన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తోంది. 15 రోజుల కింద ఇంట్లో నిద్రిస్తున్న టైమ్ లో ఆమెపై ఫ్యాన్ పడడంతో నడుముకు దెబ్బ తగిలి లేవలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. చుట్టుపక్కల వారు తిండి పెడుతుండడంతో కాలం వెళ్లదీస్తోంది. అధికారులు తనను ఆదుకోవాలని ఆ వృద్ధురాలు వేడుకుంటోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 66 ఫిర్యాదులు అందగా.. ఇందులో 56 ఫిర్యాదులకు సంబంధించిన వృద్ధుల సమస్యలు పరిష్కారమయ్యాయి.
న్యాయం పొందారిలా..
- జగిత్యాల మండలం వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామానికి చెందిన అత్తె మల్లయ్య–రాజవ్వ వృద్ధ దంపతుల ఫిర్యాదుపై ట్రిబ్యునల్ కోర్టు స్పందించింది. వారి కొడుకు వెంకటయ్య తల్లిదండ్రుల నుంచి గిఫ్ట్ డీడ్ ద్వారా పొందిన ఎకరం భూమిని తిరిగి అతడి తండ్రి పేరిట తిరిగి పట్టా చేయించింది. తల్లిదండ్రుల పోషణ ఖర్చుల కింద ప్రతినెలా రూ.6 వేలు ఇవ్వాలని, వైద్య ఖర్చులు భరించాలని ట్రిబ్యునల్ అధికారి తీర్పునిచ్చారు.
- రాయికల్ మండలం తాట్లవాయికి చెందిన దడిగొప్పుల రాములు, నర్సవ్వను కొడుకు తిరుపతి పట్టించుకోకపోవడంతో ప్రతి నెలా రూ.6 వేలు చొప్పున జీవితాంతం చెల్లించాలని, పోషణ బాధ్యతలు చూసుకోవాలని ఆర్డీవో తీర్పునిచ్చారు.
- రాయికల్ మండలం అల్లీపూర్ కు చెందిన ఓరుగంటి మల్లవ్వకు ముగ్గురు కుమారులు. వీరిలో ఓ కొడుకు చనిపోవడంతో కోడలికి నోటీసు ఇచ్చారు. మల్లవ్వకు ప్రతినెలా రూ.10 వేల చొప్పున వేర్వేరుగా చెల్లించాలని, వైద్య ఖర్చులు జీవితాంతం ఇవ్వాలని ఆర్డీవో తీర్పు చెప్పారు.
అదరించకపోతే జైలుకే..
ఆల్‌సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేసిన సర్వేలో వృద్ధులను వేధింపులకు గురిచేస్తున్న వారిలో కొడుకులు 60 శాతం, కోడళ్లు 26 శాతం, కూతుళ్లు 14 శాతం ఉన్నారు. వృద్ధ తల్లిదండ్రులు నిరాదరణకు గురైతే వెంటనే ట్రిబ్యునల్‌లో కేసులు వేయిస్తున్నాం. వారి పిల్లలకు కౌన్సెలింగ్ సైతం చేస్తున్నాం. జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వృద్ధ తల్లిదండ్రులను ఆదరించకపోతే జైలు తప్పదు. హరి అశోక్ కుమార్, ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
చట్టం ఏం చెబుతోందంటే..
కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు దాటినవారికి అండగా నిలిచేందుకు ‘తల్లిదండ్రులు, వృద్ధుల శ్రేయస్సు, సంరక్షణ చట్టం–2007’ తీసుకొచ్చింది. 2011లో దీన్ని మరింత పటిష్టం చేశారు. కన్నవారిని, వయస్సు మీద పడిన కుటుంబ సభ్యులను ఎవరైనా వదిలించుకోవాలని చూసినా, పోషణ, ఆరోగ్య, సంరక్షణ బాధ్యతల్ని మరిచినా చట్ట ప్రకారం శిక్షార్హులే. కన్న పిల్లలే కాకుండా దత్తత సంతానం, సవతి పిల్లలు, మనువలు, మనువరాళ్లు, కోడళ్లు, అల్లుళ్లపైనా సంరక్షణ బాధ్యత ఉంటుంది.
ALSO READ | మెదక్ జిల్లాలో సర్కార్ బడుల్లో గ్రౌండ్ బేస్ లెర్నింగ్
పట్టించుకోకుంటే వారిపైనా కేసు తీవ్రతను బట్టి ఆర్నెల్ల వరకు జైలు శిక్ష, రూ.పది వేల జరిమానా విధించే అవకాశం ఉంది. పంపకాలు జరిపిన వారసత్వ ఆస్తుల్ని( గిఫ్ట్ డీడ్, రిజిస్ట్రేషన్) సైతం తిరిగి సదరు వృద్ధులకే ఇచ్చేలా చట్టంలో పొందుపరిచారు. వారసులు ఉద్యోగులైతే వారి వేతనాల్లోంచి జీతాన్ని కట్ చేసి తల్లిదండ్రులకు ఇచ్చే వీలుంది. బాధితులెవరైనా ఉంటే నేరుగా ఆర్డీవోలను కలిసి న్యాయం పొందొచ్చు. లేదా పోలీసులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారుల సాయాన్ని స్వీకరించే వీలుంది.