- యాదాద్రి, సూర్యాపేట కలెక్టర్లు పమేలా సత్పతి, పాటిల్ హేమంత్ కేశవ్
యాదాద్రి/సూర్యాపేట, వెలుగు: వయోవృద్ధుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి, సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదేశించారు. శనివారం ఆయా కలెక్టరేట్లలో నిర్వహించిన మీటింగ్‌లో వారు మాట్లాడారు. ఆదివారం నుంచి ఆరు రోజుల పాటు ఐసీడీఎస్ ప్రాజెక్టులు, వృద్ధాశ్రమాల్లో ఆటల పోటీలు నిర్వహించాలని, ఆరోగ్యం, పరిశుభ్రత, సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ నెల 30న ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రాల్లో వృద్ధులతో ర్యాలీ నిర్వహించాలని చెప్పారు. అనంతరం వారోత్సవాలను పాంప్లెంట్లను ఆవిష్కరించి, వృద్ధుల సంరక్షణకు కట్టుబడతామని ప్రతిజ్ఞ చేయించారు. వృద్ధులు అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నంబర్ 14567ను వినియోగించుకోవాలని సూచించారు. భువనగిరిలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కేవీ.కృష్ణవేణి, డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, సూపరింటెండెంట్ శశికళ, సీఐ సైదయ్య, తిరుపతిరెడ్డి, సూర్యాపేటలో వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి పద్మ, సూపరింటెండెంట్ హుస్సేన, ఎఫ్‌ఆర్‌వో వినోద్‌కుమార్, జిల్లా కోఆర్డినేటర్ పి.సంపత్, వయోవృద్ధుల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎన్. రామచంద్రరెడ్డి, జి. విద్యాసాగర్ పాల్గొన్నారు.
యాదాద్రి కలెక్టర్‌ను కలిసిన రమేశ్‌బాబు
మోటారు సైకిల్‌పై పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న 72 ఏండ్ల తాతినేని రమేశ్‌బాబు శనివారం యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతిని కలిశారు. 700 రోజుల్లో 1.50 లక్షల కిలోమీటర్లు తిరిగి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాలన్న లక్ష్యంతో పర్యటిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రమేశ్‌బాబును కలెక్టర్ సత్కరించారు.
బెస్ట్ అవైలబుల్ కింద స్టూడెంట్స్ ఎంపిక
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో అదనపు సీట్ల కోసం స్టూడెంట్లను ఎంపిక చేసినట్లు సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ చెప్పారు. శనివారం కలెక్టరేట్‌లో లక్కీ డ్రా తీశారు. ఫస్ట్ క్లాస్‌లో 100 మంది, 5వ తరగతిలో 170 స్టూడెంట్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ దయానందరాణి, డీఈవో అశోక్ ఉన్నారు.
బీజేపీలో చేరికలు
మునుగోడు, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని కచలాపురం ఉప సర్పంచ్ కంచర్ల రవీందర్‌రెడ్డితో పాటు, నలుగురు వార్డు నెంబర్లు శనివారం బీజేపీలో చేరారు. హైదరాబాద్‌లో రాజగోపాల్‌రెడ్డిని కలిసిన వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. మునుగోడులో బీజేపీని గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో నాయకులు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, పందుల శ్రీను, శంకర్‌రెడ్డి, నరేశ్ పాల్గొన్నారు.
చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన పలువురు శనివారం జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో గట్టు సుధాకర్, గట్టు పెద్ద వెంకటేశం, ప్రశాంత్, కార్తీక్, ముత్తయ్య, లచ్చయ్య, నవీన్ ఉన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ఉప్పు భద్రయ్య, దూడల భిక్షం పాల్గొన్నారు.
పట్టణ అభివృద్ధికి కృషి
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృ-షి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చెప్పారు. నల్గొండలోని 36 వ వార్డులో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. పట్టణాన్ని అన్ని హంగులతో అధునాతనంగా రూపుదిద్దేందుకు సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్ బండారు ప్రసాద్, బొజ్జ నాగరాజు, గుర్రం ధనలక్ష్మి, వెంకన్న, దాసరి సాయి, కంకణాల నాగిరెడ్డి పాల్గొన్నారు.
అర్హులందరికీ ఆసరా పెన్షన్లు
కోదాడ, వెలుగు : అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం పెన్షన్ కార్డులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అర్హులందరికీ పింఛన్ కార్డులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కిశోర్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బుర్ర సుధారాణి, ఎంపీపీ చింతా కవిత పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ హయాంలోనే మునుగోడు అభివృద్ధి
చండూరు/నకిరేకల్, వెలుగు: తనను గెలిపించిన ప్రజలను మోసం చేసిన రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ చెప్పారు. నల్గొండ జిల్లా మర్రిగూడలో శనివారం జరిగిన టీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకే మునుగోడు నియోజకవర్గంలో సాగు, తాగునీరు వచ్చిందని, రోడ్లు అభివృద్ధి చెందాయన్నారు. రాజగోపాల్‌రెడ్డి మూడున్నరేండ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ మెండుమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి నకిరేకల్‌లోని సాయిబాబ ఆలయంలో ఫౌంటెయిన్‌ను ప్రారంభించారు.
‘రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు’
తుంగతుర్తి, వెలుగు: మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు విమర్శించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ వల్ల రైతుల మధ్య గెట్ల పంచాయతీలు జరుగుతున్నాయన్నారు. విద్య, వైద్య రంగాలను గాలికొదిలేసిన ప్రభుత్వం మద్యం ఆదాయం పెంచుకోవడంలో బిజీగా అయిందన్నారు. మునుగోడులో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో ప్రభుత్వ భూములను అమ్ముతున్నారన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య, నాయకులు సాయిబాబా, మహేందర్, రవి పాల్గొన్నారు.
‘గిరిజనులకు టీఆర్‌ఎస్ చేసిందేమీ లేదు’
నేరేడుచర్ల, వెలుగు: టీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనులకు చేసిందేమీ లేదని బీజేపీ గిరిజన మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు బిక్కునాథ్ నాయక్ విమర్శించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశాంలో ఆయన మాట్లాడారు. ప్రజలను మభ్యపెడుతూ మునుగోడులో గట్టెక్కాలని చూస్తో్ందన్నారు. గిరిజన తండాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని, కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
గిరిజనులు, మైనార్టీలకు రాష్ట్రపతి పదవులు ఇచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రం దేశ వ్యాప్తంగా 600 ఏకలవ్య స్కూల్స్‌ను స్టార్ట్ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వెబ్‌సైట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నికల టైంలో దళితబంధు ప్రవేశపెట్టారని, ఇప్పుడు మునుగోడు ఎన్నికల కోసమే గిరిజన బంధు అంటున్నారని ఎద్దేవా చేశారు.
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు ధరావత్ బాల్‌సన్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ కన్వీనర్ బాల వెంకటేశ్వర్లు, నేరేడుచర్ల, పాలకవీడు మండల, పట్టణ అధ్యక్షులు పార్తనబోయిన విజయకుమార్ యాదవ్, సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి, గుండ్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి, గుండెబోయిన వీరబాబు పాల్గొన్నారు.
దళితబంధును పక్కాగా అమలు చేయాలి
నల్గొండ అర్బన్, వెలుగు : దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నల్గొండ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. వివిధ శాఖల ఆఫీసర్లతో శనివారం కలెక్టరేట్‌లో మీటింగ్ నిర్వహించి దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్‌పై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎంపికైన 517 మంది లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో కాళిందిని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశం, ఆఫీసర్లు గోపీరాం, రాజ్‌కుమార్, రాజేందర్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, సంగీతలక్ష్మి, సుచరిత, కోటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
చౌటుప్పల్, వెలుగు : ఎరువుల గోడౌన్ శంకుస్థాపనలో బీజేపీ డైరెక్టర్ల పట్ల మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచితంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శనివారం చౌటుప్పల్‌లో మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడులో టీఆర్‌ఎస్ ఓడిపోతుందన్న భయంతోనే మంత్రి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి పబ్లిక్ మీటింగ్‌లో బూతులు మాట్లాడడం హేయమని అన్నారు. మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సప్పిడి లింగారెడ్డి, బండారు మహేందర్‌రెడ్డి, ఏసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మల్లేశం, జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, రిక్కల సుధాకర్‌రెడ్డి, దూర్క కృష్ణ పాల్గొన్నారు.
షాదీఖానా అభివృద్ధికి కృషి
నార్కట్‌పల్లి, వెలుగు : షాదీఖానా అభివృద్ధికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో షాదీఖానా అభివృద్ధి పనులకు శనివారం నల్గొండ జడ్పీచైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి, ఎంపీటీసీలు ముత్తయ్య, యాదయ్య, కోఆప్షన్ మెంబర్ ఎండి.వాజిద్ పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా
మిర్యాలగూడ, వెలుగు : పేదల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఉట్లపల్లి, తక్కెళ్లపాడు, జేత్యాతండా, దొండవారిగూడెం, తడకమళ్ల గ్రామాల్లో ఎస్‌డీఎఫ్ ఫండ్స్ ద్వారా నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎంపీపీ నూకల సరళహనుమంతరెడ్డితో కలిసి ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులకు ఇన్‌టైంలో, క్వాలిటీతో పూర్తి చేయాలని సూచించారు. జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, పీఆర్ డీఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి పాల్గొన్నారు.
ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగడరం ఖాయమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య ధీమా వ్యక్తం చేశారు. అయిలయ్య పీసీసీ మెంబర్‌గా ఎన్నిక కావడంతో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం యాదగిరిగుట్టలో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీసీ మెంబర్‌గా ఎన్నిక కావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉండేలా కార్యకర్తలు పట్టుదలగా పనిచేయాలని సూచించారు. సీనియర్లను సమన్వయం చేసుకుంటూ పార్టీని పటిష్టం చేయాలని చెప్పారు. యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎనగండ్ల సుధాకర్, మోతీరాంతండా సర్పంచ్ బానోతు బిచ్చునాయక్, నాయకులు మంగ కిరణ్, సాలేర్ ఉపేందర్, కళ్లెం సాయికుమార్ గౌడ్, శివశంకర్, కర్రె అజయ్, దయ్యాల శ్రీశైలం పాల్గొన్నారు.