పిడుగు పడి వృద్ధురాలు మృతి.. నలుగురికి గాయాలు

  • ఒకరి పరిస్థితి విషమం
  • హుజూర్ నగర్ శివారులో ఘటన

హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ శివారులో పిడుగుపడడంతో ఓ వృద్ధురాలు చనిపోగా, మరో నలుగురు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..పట్టణంలోని మల్లన్ననగర్ కాలనీకి చెందిన కొందరు మహిళలు పశువులను మేపడానికి ముత్యాల బ్రాంచ్ కెనాల్ సమీపంలోని పొలాల వద్దకు వెళ్లారు. సాయంత్రం ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పశువులను మేపుతున్న వారంతా పొలం గట్టున  ఉన్న వేప చెట్టు కిందికి పరిగెత్తారు.

అదే టైంలో చెట్టు సమీపంలో పిడుగు పడడంతో జక్కుల లక్ష్మి (52) అక్కడికక్కడే చనిపోయింది. ఈమెతో పాటు ఉన్న జక్కుల కవిత, జక్కుల లింగమ్మ, జక్కుల సత్యవతి, తండు స్వరూప గాయపడి స్పృహ కోల్పోయారు. కొంతసేపటి తర్వాత స్వరూప తేరుకొని సహాయం కోసం కేకలు వేయడంతో సమీపంలోని రైతులు వచ్చి 108లో ఏరియా దవాఖానకు తరలించారు. జక్కుల కవిత పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం తరలించారు. చెట్టుకు సమీపంలో ఉన్న ఒక గొర్రె కూడా చనిపోయింది.