ముంబైలో డిజిటల్ అరెస్ట్ అని భయపెట్టి .. వృద్ధురాలి నుంచి 20 కోట్లు కొట్టేశారు

ముంబైలో డిజిటల్ అరెస్ట్ అని భయపెట్టి .. వృద్ధురాలి నుంచి 20 కోట్లు కొట్టేశారు
  • ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

ముంబై: డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి ఓ వృద్ధురాలి(86) నుంచి సైబర్ నేరగాళ్లు కేవలం రెండు నెలల్లో  రూ. 20 కోట్లు కొట్టేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని దక్షిణ ముంబైలో జరిగింది. నిరుడు డిసెంబర్‌‌ 26న సైబర్​ వలకు చిక్కిన బాధితురాలు..ఈ ఏడాది మార్చి 3 వరకు పలు దఫాల్లో డబ్బును ట్రాన్స్ ఫర్ చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. సైబర్‌‌ కేటుగాళ్లు సీబీఐ అధికారుల పేరిట వృద్ధురాలికి ఫోన్‌‌ చేశారు. ఆమె ఆధార్‌‌ కార్డు దుర్వినియోగమైందని, దాని సాయంతో బ్యాంకు ఖాతా తెరిచి మనీలాండరింగ్ సహా పలు చట్టవ్యతిరేక లావాదేవీలు నిర్వహించినందుకు కేసు నమోదుచేసి, విచారణ జరుపుతున్నామని బెదిరించారు. తమకు సహకరించకపోతే కుటుంబాన్ని కూడా కేసులో చేర్చుతామని వృద్ధురాలిని భయపెట్టారు. 

ఈ కేసు దర్యాప్తు ముగిసేదాకా తన గదిలోనే ఉండాలని.. "డిజిటల్ అరెస్ట్" చేస్తున్నామని చెప్పారు. ప్రతి 3 గంటలకు ఒకసారి ఫోన్ చేసి ఆమె లోకేషన్ తనిఖీ చేశారు. దాంతో బాధితురాలు తనకు ఫోన్ చేసింది సీబీఐ అధికారులేనని నమ్మేసింది. ఎంత డబ్బు ఉందో నిర్ధారించుకోవడానికి సైబర్ నేరగాళ్లు వృద్ధురాలిని బెదిరించి బ్యాంక్ అకౌంట్ వివరాలను తీసుకున్నారు. కేసు నుంచి పేరును తొలగిస్తామని, కోర్టు ఫీజులని ఇలా వివిధ కారణాలతో  రెండు నెలల వ్యవధిలో సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి రూ.20.26 కోట్లు తమ అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు.

 కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని తెలిపారు. వృద్ధురాలి ప్రవర్తనపై ఆమె ఇంట్లోని పనిమనిషికి సందేహం వచ్చింది. వెంటనే విషయాన్ని వృద్ధురాలి కూతురికి తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు..రూ.77 లక్షలను ఫ్రీజ్ చేశారు. నిందితులు షాయన్ జమిల్ షేక్ (20),  రజిక్ అజాన్ బట్ (20),  హృతిక్ శేఖర్ ఠాకూర్ (25)లను అరెస్ట్ చేశారు.