తెలంగాణలో దసరా రోజున పాలపిట్టను, జమ్మిచెట్టును దర్శించుకోవాలని పెద్దలు చెబుతారు. తెలుగు ప్రజలు బతుకమ్మతో తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో, నృత్యాలతో గడిపి చివరి రోజున దసరా పండుగ ఘనంగా జరుపుకుంటారు. ముందు నవరాత్రుల దగ్గర దుర్గామాత దేవి పూజ ఉంటుంది. ఇక దసరా రోజున సాయంత్రం తప్పకుండా అందరూ ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలు పాలపిట్టను చూడడానికి ఇంటి నుంచి బయలుదేరుతారు. మన తెలంగాణ పండుగల్లో కొన్ని వస్తువులు, పనులు ప్రత్యేకంగా ఉంటాయి. దసరా రోజున సాయంత్రం ఒకో ఊరిలో ఒకరకంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసిన గుమ్మ డికాయతో, సొరకాయతో , గొర్రెలతో పూజ చేసిన తర్వాతనే జమ్మిచెట్టు దగ్గర ఊరు ఊరంతా వెళ్ళి జమ్మి ఆకులను బంగారంగా భావించి పెద్దల చేతిలో పెట్టి చిన్నా, పెద్దా తేడా లేకుండా ఒకరిని ఒకరు అప్యాయంగా పలకరించి ఆశీర్వాదాలు తీసుకుంటారు.
జమ్మిచెట్టు ప్రత్యేకత
జమ్మిచెట్టు భారతీయులకు కొత్తేమి కాదు. భారత ఉప ఖండంలో ఈ వృక్షం ఉద్భవించిందని మనం పురాణాల్లో, వేదాలలో వినే ఉంటాం. జమ్మిచెట్టు ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వర త్వరగా పెరుగుతుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా చాలా తక్కువ కాలంలో పెరుగుతుంది. అందుకే దాదాపు ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదులుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం వరకు తెలుగు ప్రజలకు జమ్మిచెట్టు గురించి బాగా తెలుసు. పట్నం వాసులకు జమ్మిచెట్టు గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, రైతులకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జమ్మి చెట్టు అంటే ప్రాణం. చెట్టులోని ప్రతి భాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలకు వాడుతారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చినా, మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు నమ్ముతారు. అందుకే వినాయక చవితి పండుగ నాడు పూజించే పక విశంతి పత్రాలతో శమీ పత్రాన్ని కూడా చేర్చుతారు.
జమ్మిచెట్టు రూపంలో అపరాజిత దేవి
ఏడాది పాటు అజ్ఞాతవాసానికి బయలుదేరి పాండవులు విజయదశమి ( దసరా ) రోజున ఆయుధాలను జమ్మిచెట్టుపైన దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమి నాడు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజిత దేవిని పూజించే తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా పాండవులకు ఆ దేవి ఆశీస్సులు ఉండబట్టే వారు యుద్ధంలో గెలిచారని వారు బలంగా నమ్ముతారు. పాండవులకే కాదు రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనది అని చెపుతారు. జమ్మిచెట్టు కి మన పురాణాల్లోనూ జీవితాల్లో ఇంతటి సంబంధం ఉండబట్టే దసరా నాడు జమ్మిచెట్టుకి ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తారు. శమీ వృక్షానికి ప్రదక్షణలు చేస్తుంటారు. పూజలు ముగిసిన తర్వాత జమ్మి ఆకులను తుంచుకొని వాటిని బంగారంలాగా భద్రంగా ఇండ్లకు తీసుకెళ్తారు. జమ్మి ఆకులను తమ పెద్దల చేతుల్లోకి పెట్టి ఆప్యాయంగా ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మిచెట్టు వేద కాలం నుంచి పరమ పూజమైన వృక్షం. జమ్మి ఆకులను పూజించి జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకుంటారు . తెలంగాణ రాష్ట్ర అధికారిక వృక్షం కూడా జమ్మిచెట్టు.
పాలపిట్టను చూస్తే శుభం
విజయదశమి రోజున పాలపిట్ట చూడాలని ప్రజల నియమం. సంస్కృతి, సంప్రదాయం. పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు నుంచి తీసుకొని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా వారికి పాలపిట్ట కనిపించిందని అప్పటి నుంచి వారికి సకల విజయాలు సిద్ధించాయని ఒక అపారమైన నమ్మకం. అందుకే దసరా నాడు చక్కగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ మొదలైంది. దసరా రోజున పాలపిట్టను చూడడం తెలంగాణ ప్రజల అనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ పర్వదినం రోజున ఊరు శివారులోనూ, రహదారుల ఇరువైపులా, చెట్లపైన, విద్యుత్ తీగలపైన, గడ్డి వాములపైన, పొదలపైన, పంట పొలాల్లోని తప్పకుండా సాయంకాలం పాలపిట్ట దర్శనమిస్తాయి.
పాలపిట్ట జీవితకాలం సుమారు 17 నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. చెట్ల తొర్రల్ని గూళ్లుగా మలుచుకొని మూడు నుంచి ఐదు గుడ్ల వరకు పెడతాయి. గుడ్లను పోదగడంలో ఆడ పక్షి, మగ పక్షి రెండు బాధ్యత వహిస్తాయి. దసరా రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని ప్రజల నమ్మకం. ప్రజలు చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుందని ప్రజలు నమ్ముతారు. పశుపక్ష్యాదులను దైవ స్వరూపాలుగా భావించి పూజించడం భారతీయ సంప్రదాయం. పాలపిట్ట దేవీ స్వరూపమని నమ్మకం. అందువల్లే తెలంగాణ ప్రజలు దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను తప్పకుండా చూడాల్సిందే అని అంటారు. ఇప్పటి తరంలో చాలామందికి విజయదశమి విశిష్టత గురించి తెలియకపోవచ్చు. తెలంగాణలో దసరా పండగ ప్రత్యేకత గురించి కొత్త తరం తెలుసుకోవాలి.
- లకావత్ చిరంజీవి నాయక్
వరంగల్