కామారెడ్డిపై నో క్లారిటీ.. గంప గోవర్ధన్​ వర్గీయుల్లో టెన్షన్​

  • బీఆర్ఎస్​ అభ్యర్థిపై స్పష్టత ఇవ్వని పెద్దలు

కామారెడ్డి, వెలుగు: ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్​ఎల్లారెడ్డి అభ్యర్థి జాజాల సురేందర్​పోటీపై క్లారిటీ ఇవ్వగా, కామారెడ్డిలో ఎవరు బరిలో నిలుస్తారనే విషయంపై స్పష్టతనివ్వలేదు.  కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్​ పోటీ చేస్తారనే ప్రచారంతో పాటు, పోటీ చేయాలని తానే స్వయంగా కోరినట్లు కొన్ని రోజుల క్రితం గంప గోవర్ధన్​ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడారు.  ఈ నేపథ్యంలో మూడు రోజుల కింద కేటీఆర్​ జిల్లా పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కామారెడ్డి నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై క్లారిటీ ఇస్తారని అంతా భావించారు.  కానీ కేటీఆర్ ​మాత్రం ఎక్కడా పొలిటకల్​ అంశాలకు తావివ్వకుండా, కేవలం ఫండ్స్​ కేటాయింపు గురించి మాత్రమే మాట్లాడారు.  

దీంతో సిట్టింగ్​ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ వర్గీయుల్లో టెన్షన్​ మొదలైంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ​ప్రెసిడెంట్ ​కేటీఆర్​ఎక్కడ మీటింగ్​లకు వెళ్లినా అక్కడి సిట్టింగ్​ఎమ్మెల్యేలకు పోటీపై స్పష్టతనిస్తున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే రెట్టింపుతో గెలిపించాలని కోరుతున్నారు. ఎల్లారెడ్డి బహిరంగసభలోనూ సురేందర్​ను 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరిన కేటీఆర్​ కామారెడ్డిలో పోటీ అంశాన్ని ప్రస్తావించకపోవడం చర్చాంశనీయమైంది..

మిగతా చోట్ల క్లారిటీ..

జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3 చోట్ల బీఆర్ఎస్​అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది మార్చి 1న బాన్సువాడ  నియోజకవర్గానికి వచ్చిన సీఎం కేసీఆర్, తిమ్మాపూర్​ వెంకటేశ్వరస్వామి టెంపుల్​వద్ద మీటింగ్​లో తాను సభలో ఉన్నన్ని రోజుల్లో శీనన్న కూడా ఉంటారంటూ క్లారిటీ ఇచ్చారు. మార్చి 15న జుక్కల్​ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్​ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే హన్మంత్​షిండేను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జిల్లాలోని 3 నియోజకవర్గాలపై అభ్యర్థుల విషయంలో పార్టీ అధినేతలు స్పష్టతనిచ్చి, కామారెడ్డిని మాత్రం డైలామాలో ఉంచారు.

పోటీకి పలువురి ఇంట్రెస్ట్..​

కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ ​తరఫున పోటికి సిట్టింగ్​ఎమ్మెల్యే గంప గోవర్ధన్​తో పాటు మరికొందరు ఆసక్తి  చూపుతున్నారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్, స్టేట్ ​ఉర్దూ అకాడమీ చైర్మన్​ ముజీబోద్దీన్, సీనియర్​లీడర్, మున్సిపల్ ​చైర్​పర్సన్ ​జాహ్నవి తండ్రి నిట్టు వేణుగోపాల్​రావు,   మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగ్​రావులు పోటీకి ఆసక్తిగా ఉన్నారు. కేటీఆర్ ద్వారా టికెట్​కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్​ పోటీ చేసే ఆలోచన చేస్తున్నారనేది ప్రచారంలో ఉంది.  ఇక్కడ పార్టీ పరిస్థితిపై కేసీఆర్ ప్రత్యేక సర్వే చేయించారు. కేసీఆర్​ను తానే  ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరినట్లు సిట్టింగ్ ​ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ ​నేత షబ్బీర్ ​అలీ, గంప గోవర్ధన్ ​మధ్య మాటల యుద్ధం సాగింది. మొత్తం మీద కామారెడ్డి బీఆర్ఎస్​ అభ్యర్థిపై సందిగ్ధత నెలకొంది.