వడ్ల కొనుగోళ్లలో రాజీ లేదు : మంత్రి ఉత్తమ్ కుమార్ ​రెడ్డి

వడ్ల కొనుగోళ్లలో రాజీ లేదు : మంత్రి ఉత్తమ్ కుమార్ ​రెడ్డి
  • ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలోపర్యటించాలి: మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి
  • సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: ఈ సీజన్​లో రికార్డ్ స్థాయిలో పంట దిగుబడి వస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లలో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి కోరారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మంగళవారం మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి మంత్రి తుమ్మలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటు లోక్​సభ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వడ్ల కొనుగోళ్లు పకడ్బందీగా జరిగేలా చూడాలని కోరారు.

 కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే కొనుగోళ్లు జరుగుతున్నాయని, తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 7,572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  కొనుగోలు సమయంలో తాలు, తరుగు తీసే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకృతి విపత్తులు, ఇతర అవాంతరాలు వస్తే అధిగమించేందుకు అధికారులనూ సన్నద్ధం చేయాలని ప్రిన్సిపల్​ సెక్రటరీ డీయస్ చౌహాన్ ను ఆదేశించారు. 

రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి తోడ్పాటునందించాలని కోరారు. మిల్లింగ్ ఇండస్ట్రీకి ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. తెలంగాణ బియ్యానికి బీహార్, పశ్చిమ బెంగాల్ లో డిమాండ్ ఉందన్నారు. సీఎంఆర్​ కు మిల్లింగ్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సన్నాలకు 10 నుండి 50 రూపాయలకు, దొడ్డు రకానికి 10 నుండి 40 రూపాయలకు పెంచామన్నారు. నిబంధనల మేరకే బ్యాంక్ గ్యారెంటీ పెట్టామని మంత్రి స్పష్టం చేశారు. సివిల్ సప్లయ్స్ డిపార్ట్​మెంట్ 10 నెలల వ్యవధిలోనే రూ.11,537.40 కోట్ల అప్పు భారాన్ని తగ్గించినట్టు వెల్లడించారు.