మిల్వాకీ: అమెరికా అధ్యక్షుడిగా తనను మళ్లీ గెలిపిస్తే దేశాన్ని అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విధానాల వల్ల దేశానికి ఆర్థిక విపత్తు వచ్చిందని, తాను అధ్యక్షుడినైతే ఆ విపత్తును అంతం చేస్తానని చెప్పారు. శుక్రవారం రాత్రి స్వింగ్ స్టేట్స్ లో కీలకమైన మిషిగన్ లోని డెట్రాయిట్, విస్కాన్సిన్ స్టేట్ లోని మిల్వాకీ కౌంటీలో జరిగిన ర్యాలీల్లో ట్రంప్ మాట్లాడారు.
‘‘కమలా హారిస్ ఎకనామిక్ ఎజెండా ఫెయిల్ కావడం వల్ల ప్రైవేట్ సెక్టార్ లో ఇటీవలే 30 వేల ఉద్యోగాలు పోయాయి. కొంతకాలంలోనే మాన్యుఫాక్చరింగ్ రంగంలో 50 వేల ఉద్యోగాలను మీరు పోగొట్టుకున్నారు. కమల విధానాలు దేశాన్ని నాశనం చేసేలా ఉన్నాయి. వాటి వల్ల మీరు మునిగిపోతున్నారు” అని ఓటర్లను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
‘‘కమల రాడికల్ లెఫ్ట్ మార్క్సిస్ట్. ఆమె మన ఎకానమీని నాశనం చేశారు. మీ గన్స్ స్వాధీనం చేసుకుంటానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. అన్నింటికీ మించి ఆమె అబద్ధాలకోరు. తాను మెక్ డొనాల్డ్స్ లో పని చేశానని చెప్పుకుంటారు.. కానీ ఆమె ఎప్పుడూ అక్కడ పని చేయలేదు” అని అన్నారు.
‘‘ఈ ఎన్నికల్లో మనం కమలా హారిస్‌ను ఓడించి, అమెరికాను రక్షించబోతున్నాం. నేను గెలిస్తే మీపై పన్నులు తగ్గిస్తా. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తా. జీతాలు పెంచుతా. ధరలు తగ్గిస్తా. వేలాది ఫ్యాక్టరీలను తిరిగి అమెరికాకు రప్పిస్తా” అని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా చూస్తా..
తాను గెలిస్తే ఉక్రెయిన్‌లో యుద్ధం ముగిసేలా చూస్తానని ట్రంప్ అన్నారు. తాను ప్రెసిడెంట్గా ఉండి ఉంటే.. అసలు ఆ యుద్ధమే మొదలయ్యేది కాదన్నారు. అలాగే మిడిల్ ఈస్ట్ లోనూ సంఘర్షణలను తాను ఆపుతానని చెప్పారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. అసలు అక్కడ అక్టోబర్ 7న దాడి (ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి) జరిగేదే కాదన్నారు. తనను గెలిపిస్తే.. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా చూస్తానన్నారు.
నేరస్తులపై ఉక్కుపాదం మోపుతానని, పోలీసులకు పూర్తి సపోర్ట్ చేసి ప్రజలకు గట్టి భద్రత కల్పిస్తానన్నారు. అమెరికా మిలిటరీ వ్యవస్థను పటిష్టం చేస్తానని, దేశమంతటా మిసైల్ డిఫెన్స్ సిస్టంను ఏర్పాటు చేస్తానన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా, అవకాశాలతో, ఆశతో జీవించాలన్న కలలను సాకారం చేస్తానని హామీ ఇచ్చారు.
ఒకేసారి.. ఇటు ట్రంప్.. అటు కమల ప్రచారం
స్వింగ్ స్టేట్స్ లో కీలకమైన విస్కాన్సిన్ స్టేట్‌లోని మిల్వాకీ కౌంటీలో ఇటు ట్రంప్, అటు కమల శుక్రవారం రాత్రి ఒకేసారి ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. డెమోక్రాట్లకు పట్టు ఉన్న మిల్వాకీ సిటీలోని డౌన్ టౌన్ ఏరియాలో ట్రంప్ ర్యాలీ చేపట్టగా.. రిపబ్లికన్ల ప్రాబల్యం ఉన్న సిటీ శివారు ప్రాంతాల్లో కమల ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 9 కిలోమీటర్ల దూరంలోనే.. ఒకే సమయంలో వీరిద్దరూ ర్యాలీలు చేపట్టడంతో మిల్వాకీ అంతటా సందడి నెలకొంది.
విస్కాన్సిన్ లో 10 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. 2020 ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపారు. గత ఆరు ఎన్నికల్లో నాలుగు సార్లు ఇక్కడి ఓటర్లు కేవలం 23 వేల ఓట్ల తేడాతోనే అటూ, ఇటూ మొగ్గారు. స్వింగ్ స్టేట్స్ లో అవతలి ఓటర్లను ఇటువైపు తిప్పుకోవడం, సొంత ఓటర్లు ఓటేసేలా చేసుకోవడంపైనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయని భావిస్తారు. అందుకే.. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరిన తరుణంలో ఇద్దరు అభ్యర్థులూ స్వింగ్ స్టేట్స్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు.