నర్సాపూర్​లో అభ్యర్థులకు అసమ్మతి టెన్షన్!

నర్సాపూర్​లో అభ్యర్థులకు అసమ్మతి టెన్షన్!
  • మూడు పార్టీల క్యాండిడేట్లదీ ఇదే పరిస్థితి
  • మద్దతు కూడగట్టే పనిలో నేతలు 
  • రంగంలోకి పార్టీల పెద్దలు 

మెదక్/నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. 3 ప్రధాన పార్టీల క్యాండిడేట్లు డిసైడ్ అయినప్పటికీ అసమ్మతి సెగ తగ్గడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ టికెట్లు ఆశించి భంగపడ్డ లీడర్లంతా రగిలిపోతున్నారు. ముఖ్య నాయకుల సహకారం లేకుంటే రిజల్ట్ తారుమారయ్యే పరిస్థితి ఉందని క్యాండిడేట్లు టెన్షన్ ​పడుతున్నారు. ఏదో ఒక రకంగా అసంతృప్త లీడర్లను బుజ్జగించి దారిలోకి తెచ్చుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వాకిటి సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి ఆవుల రాజిరెడ్డి, బీజేపీ నుంచి ఎర్రగొళ్ల మురళీయాదవ్ ఫస్ట్​టైమ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. 

సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని సునీతకు టికెట్

ఉమ్మడి ఏపీలో1999, 2004, 2009 ఎన్నికల్లో సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. వైఎస్సార్, రోశయ్య, కిరణ్​కుమార్ రెడ్డి కేబినెట్​లో మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి.. బీఆర్ఎస్ ​అభ్యర్థి చిలుముల మదన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్ ను వీడిన ఆమె తర్వాత బీఆర్ఎస్​లో చేరారు. అయితే బీఆర్ఎస్ ​హైకమాండ్ ఈసారి సిట్టింగ్​ఎమ్మెల్యే మదన్​రెడ్డిని కాదని సునీతకు టికెట్​ఇచ్చింది. టికెట్ దక్కకపోవడంపై మదన్​రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా పార్టీ చీఫ్​కేసీఆర్ సముదాయించారు. లోక్​సభ ఎన్నికల్లో మెదక్​ఎంపీ సీటు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 

ఆ వర్గం సహకరించకుంటే ఇబ్బందే..

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన సునీత.. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి వర్గం సహకరిస్తే, ఆమె గెలుపు మరింత ఈజీ అవుతుంది. సునీత వారి మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల ఇళ్లకు స్వయంగా వెళ్లి కలుస్తున్నారు. జిల్లా మంత్రి హరీశ్​రావు రెగ్యులర్​గా మదన్ రెడ్డి వర్గంతో మాట్లాడుతున్నారు. పార్టీలో, పదవుల్లో తగిన ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఇటీవల నర్సాపూర్​లో నియోజకవర్గ స్థాయి మీటింగ్ నిర్వహించి వర్గపోరు, విభేదాలు పక్కనపెట్టి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని హరీశ్ ​చెప్పారు.

ఆవుల రాజిరెడ్డికి ఇంటిపోరు

నర్సాపూర్​ కాంగ్రెస్ టికెట్​ను పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్​కుమార్, ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, సీనియర్​లీడర్​ సోమన్నగారి రవీందర్​రెడ్డి ఆశించారు. వీరిలో అనిల్​ కుమార్​కు లేదంటే ఇటీవల బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి వచ్చిన చిలుముల సుహాసిని రెడ్డికి కేటా యించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే పార్టీ హైకమాండ్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆవుల రాజిరెడ్డికి టికెట్ ఇచ్చింది. హైకమాండ్​ నిర్ణయాన్ని అనిల్ కుమార్, ఆంజనేయులుగౌడ్, రవీందర్​రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ ​చేస్తున్నారు. లేదంటే రెబల్స్​గా పోటీకి దిగు తామని అల్టిమేటం ఇచ్చారు. వారి అనుచరులు మూడు రోజుల కింద హైదరాబాద్​లోని గాంధీభవన్​వద్ద ఒంటిపై పెట్రోల్​పోసుకుని నిరసన తెలిపారు. 

బీజేపీలో  సస్పెన్స్

బీజేపీ టికెట్ దక్కించుకున్న ఎర్రగొళ్ల మురళీ యాదవ్ ప్రస్తుతం నర్సాపూర్ మున్సిపల్​చైర్మన్​గా పని చేస్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన​ భార్య రాజమణి ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్​గా పని చేశారు. బీఆర్ఎస్​లో బీసీలకు ప్రాధాన్యం లేదని, బీసీ నేతలను ఎదగనివ్వడం లేదని మురళీ యాదవ్​ పార్టీ చీఫ్ ​కేసీఆర్​పై విరుచుకుపడడంతో ఆయనను సస్పెండ్ చేశారు. దీంతో ఏడాది కింద మురళీ బీజేపీలో చేరారు. నర్సాపూర్ ​బీజేపీ టికెట్​ కోసం ఆరుగురు అప్లై చేసుకోగా హైకమాండ్ ​మురళీ యాదవ్​కు టికెట్ ఇచ్చింది.

టికెట్​ఆశించి భంగపడిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపీ, అసెంబ్లీ కన్వీనర్, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్​ వాల్దాస్​మల్లేశ్​గౌడ్, రాష్ట్ర నాయకుడు రఘువీరా రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం కృషి చేసిన తమను కాదని, కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం నర్సాపూర్​లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి అసంతృప్త నేతలెవరూ రాలేదు. వాళ్లంతా ఏ నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్ గా మారింది.