ఉమ్మడి నల్గొండ జిల్లాలో .. పల్లెల్లో పంచాయతీ సందడి

  • సెప్టెంబర్ లో ఎన్నికలు ఉంటాయన్న నేపథ్యంలో తాజా, మాజీ సర్పంచు​ల్లో రేకెత్తిన ఆశలు 
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1740 గ్రామ పంచాయతీలు 
  • పాత రిజర్వేషన్లే  ఉంటాయని క్లారిటీ ఇచ్చిన సర్కారు 
  • దీంతో రెండో దఫా పోటీకి సై అంటున్న మాజీలు

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని 1740 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. సెప్టెంబర్​లోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండడంతో  పాత, కొత్త లీడర్లలో ఆశలు రేకెత్తాయి. మాజీ కాంగ్రెస్ సర్పంచులు, గత ఎన్నికల్లో ఓడిన సర్పంచ్ అభ్యర్థులు, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన మాజీ సర్పంచు​లు మళ్లీ పోటీకీ సిద్ధమవుతున్నారు. 

ఇప్పుడున్న రిజర్వేషన్లే కొనసాగుతాయని ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పింది. కొత్త రిజర్వేషన్లు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని అధికారులు చెప్పడంతో పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే వారంలో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రకటించనుంది. ఈ జాబితా రాగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉండొచ్చని జిల్లా పంచాయతీ ఆఫీసర్లు చెబుతున్నారు. 

ఆశావహులు రెట్టింపు..

20‌‌‌‌19 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జిల్లాలో బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడింది. ఒకే ఒక్క ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తప్ప ఆ పార్టీకి ఎవరూ దిక్కులేకుండా పోయారు. ఇద్దరు మంత్రులు, 9 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, మండలి చైర్మన్​తో సహా ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ నాయకత్వం బలంగా ఉంది. అదే స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లోకి వలసలు పెరగడంతో సంస్థాగతంగా ఆ పార్టీ నాయకత్వం మరింత బలపడింది. 

ప్రస్తుతం గ్రామాల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి క్యాండిడెట్లను సైతం వెత్కుకోవాల్సిన పరిస్థితి ఉండగా, కాంగ్రెస్ లో ఆశావహులు పోటీపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ సర్పంచులకు ధీటుగా గత ఎన్నికల్లో ఆస్తులు అమ్మి, లక్షలు ఖర్చు పెట్టిన సర్పంచ్ క్యాండిడెట్లు మరో ఛాన్స్ కోసం పట్టుబడుతున్నారు. ఇదంతా ఒక ఎంతైతే 2019 నాటి ఎన్నికల ఒప్పందాలను ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. నాటి ఎన్నికల్లో ఓడిపోయిన వారితో సహా పార్టీ మారొచ్చిన వాళ్లు, కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న మాజీ సర్పంచు​లు సైతం మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. 

లోకల్​బాడీ ఎన్నికలతో లింక్​..

సర్పంచ్ ఎన్నికలయ్యాకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ఈ నెలాఖరుతో పూర్తవుతుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ఇటీవలే ముగిసినందున వాటికి ఇంకాస్తా టైం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో పోటీని తగ్గించడానికి, అభ్యర్థులను గెలిపించడానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎమ్మెల్యేలకు అస్త్రంగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజార్టీ తీసుకొచ్చిన లీడర్లకే స్థానిక పదవుల్లో ప్రియార్టీ ఇస్తామని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దీంతోనే అన్ని చోట్ల స్థానిక నాయకత్వం గట్టిగా పనిచేసింది. నల్గొండ జిల్లాలో జడ్పీ చైర్మన్ పదవి ఆశిస్తున్న తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, కనగల్ మాజీ జడ్పీటీసీ శ్రీనుగౌడ్ లాంటి లీడర్లు అనేక మంది పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. ఈ తరహా లీడర్లకు పంచాయతీ ఎన్నికలు టెస్ట్ సిరీస్​గా మారనున్నాయి. 

రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు..

ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత రూ.లక్ష పూర్తికాగా, ఈ నెలాఖరు వరకు లక్షన్నర రుణాలు మాఫీ కానున్నాయి. ఆగస్టు 15 నాటికి రెండు లక్షలు రుణమాఫీ కూడా పూర్తవుతుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో రైతులు రుణమాఫీ కింద లబ్ధి పొందారు. దీంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల ఆప్లికేషన్స్ జాతర కూడా ఆగస్టులోనే మొదలు పెట్టొచ్చని అధికార వర్గాలు అంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ప్రభుత్వ పథకాల కార్యాచరణ కూడా మొదలైతే స్థానిక పోరులో కాంగ్రెస్ కు తిరుగుండదని ఆపార్టీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.