
మెదక్, వెలుగు : ఎన్నికల ప్రచారం చివరి రోజైన మంగళవారం మెదక్ పట్టణంలో కాంగ్రెస్ రోడ్‌షో అట్టహాసంగా కొనసాగింది. నియోజకవర్గ పరిధిలోని మెదక్, హవేలి ఘనపూర్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట మండలాల నుంచి వందలాది మంది ట్రాక్టర్లు, ఆటోలు, డీసీఎంలు, లారీల్లో తరలివచ్చారు. ఎల్లారెడ్డి క్రాస్ రోడ్డు నుంచి పట్టణంలోని మెయిన్ రోడ్డు మీదుగా మంబోజిపల్లి చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది.
రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు మాట్లాడుతూ.. మార్పు రావాలి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అనే నినాదానికి, సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుపొంది రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పదేండ్లు పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గాన్ని ఇరవై ఏండ్లు వెనుక్కు నెట్టిందని విమర్శించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో సురేందర్ గౌడ్, జీవన్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, హఫీస్, మహేందర్‌రెడ్డి, రాజేశ్, అశ్విన్‌రావు, లింగం, శేఖర్పాల్గొన్నారు.