- పార్టీలో జాయినింగ్‌కు, ప్రచారానికి రూ.300
- బలం చూపించేందుకు అభ్యర్థుల తండ్లాట
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊపందుకున్న ఎన్నికల ప్రచారం
ఆదిలాబాద్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పూర్తి స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ప్రకటించిన స్థానాల్లో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. తమ బలం చూపించుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. జనాలకు డబ్బులిచ్చి పార్టీలో చేర్చుకుంటూ, ప్రచారంలో తమ వెంట తిప్పుకుంటున్నారు.
ప్రచారం, చేరికలతో బిజీబిజీ
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారానికి వెళ్లే సమయంలో తమ వెంట జనం ఉండేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రధాన లీడర్లను ఉదయం ఇంటికి పిలిపించుకుంటున్న అభ్యర్థులు.. అక్కడే టిఫిన్ పెట్టించి ప్రచారం రథంపై ఎక్కించేస్తున్నారు. కొంత మంది అభ్యర్థులు కూలీలకు రోజుకు రూ.300 ఇచ్చి మరీ ప్రచారానికి తిప్పుకుంటున్నారు. గతంలోనూ ప్రచారానికి ఇలా డబ్బులు ఇచ్చి తమ వెంట తీసుకెళ్లేవారు. కానీ ఈసారి పార్టీ కండువా కప్పుకుంటే కూడా డబ్బులు ఇస్తున్నారు. ఓ వైపు ప్రచారం చేస్తూనే పార్టీలో చేరికల పేరుతో గ్రామాలను నుంచి ఆయా పార్టీల కార్యకర్తలను తీసుకొచ్చి తమ పార్టీ కండువాలు కప్పుతున్నారు. సాధారణ కార్యకర్తలు చేరితే అందరికి తలో రూ.300 ఇస్తున్నారు.
గ్రామాల్లోని నేతలు, మాజీలు చేరితే వారి స్థాయిని బట్టి డబ్బులు ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. ఇలా పార్టీలో చేరికల కోసమే కొందరు ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. ఇక భారీ బహిరంగ సభలకు జనాలను తరలించేందుకు ఒక్కొక్కరికి రూ. 500 ఇవ్వాల్సిందే. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోథ్, ఇతర నియోజకవర్గాల్లోనూ ఆయా పార్టీల అభ్యర్థులు పార్టీలో చేరికలకే ఎక్కవ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో 500 మంది చేరుతున్నారంటూ ఆయా పార్టీలు ముందే ప్రచారం చేసుకుంటున్నాయి.
ప్రజలు తమవైపే ఉన్నారంటూ..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ ఏడు, కాంగ్రెస్ మూడు నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. దుర్గా నవరాత్రులు, దసరా పండుగ ముగియడంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ప్రచారం, పార్టీలో చేరికల్లోనే మునిగితేలుతున్నారు. ఇలా నేతలు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటూ ప్రజలంతా తమ వైపే ఉన్నారనే ప్రచారం చేసుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఆయా పార్టీల ప్రచార రథాలను పట్టణాలు, పల్లెల్లో పొద్దుపోయే వరకు తిప్పుతున్నారు.
మేనిఫెస్టో, పథకాలను ప్రస్తావిస్తూ..
అభ్యర్థులు కొత్త హామీల జోలికి పోకుండా పార్టీ మేనిఫెస్టో, సంక్షేమ పథకాలపైనే ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రస్తావించకుండా జాగ్రత్త పడుతున్నారు. పెన్ గంగాపై నిర్మిస్తున్న కోర్టా చనాకా ప్రాజెక్టు, నేరడిగొండ వద్ద కుప్టి ప్రాజెక్టు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అయినప్పటికీ ఆ ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో బీఆర్ఎస్ లీడర్లు వాటి ఊసెత్తడం లేదు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం వీటితో పాటు డబుల్ బెడ్రూంలు, స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పార్టీల మెనిఫెస్టోను ప్రచారం చేస్తున్నాయి. ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతుండగా.. ఒక్క అవకాశం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ బీజేపీకి ప్రచారం చేసుకుంటోంది.
ALSO READ : ప్రవీణ్‌రెడ్డి వర్సెస్ పొన్నం..హుస్నాబాద్ ఎవరికి?