కర్నాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం

కర్నాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం
  • రేపే 224 నియోజకవర్గాలకు పోలింగ్
  • బీజేపీ, కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్
  • కింగ్ మేకర్ కావాలనుకుంటున్న జేడీ(ఎస్)
  • బజరంగ్​దళ్​పై బ్యాన్​ కామెంట్లతో ఇరకాటంలో కాంగ్రెస్​
  • అభివృద్ధి మంత్రంతో ముందుకు బీజేపీ
  • బీజేపీ, కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్
  • కింగ్ మేకర్ కావాలని జేడీ(ఎస్) ఆశ
  • బజరంగ్ ​దళ్ అంశంతో ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్
  • అభివృద్ధి మంత్రంతో దూకుడుగా బీజేపీ

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)తో పాటు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ బహిరంగ సభలు, రోడ్​షోలు నిర్వహించాయి. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు దొరికిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. సవాళ్లకు ప్రతిసవాళ్లు విసురుకుంటూ విమర్శలకు దిగారు. క్యాంపెయిన్ టైం ముగియడంతో ఇండ్లల్లో కూర్చొని ప్రచార శైలిపై తమ అనుచరులతో చర్చించుకుంటున్నారు.

బజరంగ్ ​దళ్​పై కాంగ్రెస్ యూటర్న్

క్యాంపెయిన్ చివరి రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధమే కొనసాగింది. అప్పటిదాకా తాము చేసిన అభివృద్ధిపైనే ప్రచారం చేసిన బీజేపీ.. బజరంగ్​ దళ్​ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో క్యాంపెయిన్ స్టైల్ మార్చేసింది. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా అగ్గిరాజేసింది. దీంతో కర్నాటక సంస్కృతి, సంప్రదాయాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. జై శ్రీరామ్ అంటేనే జైల్లో పెట్టాలనుకునే వాళ్లకి.. జై బజరంగ్​బలి నినాదం కూడా నచ్చడం లేదంటూ కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించింది. బజరంగ్​దళ్ ను బ్యాన్​ చేస్తామన్న కాంగ్రెస్ ప్రకటన ఆ పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. చివరికి ఆ పార్టీ సీనియర్ లీడర్ చిదంబరంతో ‘మేం అలా అనలేదు’ అని ప్రకటించే పరిస్థితికి తీసుకొచ్చింది. బజరంగ్​దళ్ బ్యాన్ అంశం కాంగ్రెస్​కు మైనస్ అయితే, బీజేపీకి పాజిటివ్ అయ్యింది.

ప్రచారంలో హేమాహేమీలు

అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే.. ఎలాగైనా బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ చూస్తున్నది. ఎవరు ఎలా పోయినా.. కింగ్ మేకర్ కావాలని జేడీ(ఎస్) భావిస్తున్నది. అధికారం చేజిక్కించుకుని సౌతిండియాలో పార్టీని మరింత విస్తృతపర్చాలనే లక్ష్యంతో స్టార్ క్యాంపెయినర్ ప్రధాని మోడీ కర్నాటక ప్రచారంలో చాలా యాక్టివ్​గా పాల్గొన్నారు. కర్నాటక ఎన్నికల విజయాన్ని దక్షిణ భారతానికి గేట్ వేగా బీజేపీ భావిస్తున్నది. జేపీ నడ్డా, అమిత్​షా, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, బొమ్మై, యడియూరప్పతో పాటు కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే ప్రజల్లో ఉత్సాహం నింపారు. జేడీ(ఎస్) తరఫున హెచ్​డీ దేవేగౌడ, కుమార స్వామి తమకు మంచి పట్టున్న సెగ్మెంట్స్​లో గట్టిగా ప్రచారం చేశారు.

మోడీ వర్సెస్ ఖర్గే

క్యాంపెయిన్​లో అన్ని పార్టీల లీడర్లు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. మీది 40% కమీషన్ ప్రభుత్వమంటూ బీజేపీని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.. మీది 80% కమీషన్ సర్కార్ అంటూ కాంగ్రెస్​పై బీజేపీ ప్రతివిమర్శలు చేసింది. సీఎం బసవరాజ్ బొమ్మై పనితీరుపై కాంగ్రెస్ అసహనం వ్యక్తంచేసింది. అవినీతి ప్రభుత్వం అంటూ పదేపదే విమర్శలు చేసింది. అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేశారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేశారు. విదేశాల్లో ఇండియా పరువు తీశారని విమర్శలు గుప్పించారు. బజరంగ్​దళ్ బ్యాన్​పై కూడా ప్రచారం చేశారు. ఓటేస్తున్నప్పుడు ప్రతీ బీజేపీ లీడర్, కార్యకర్త జై బజరంగ బలి అనాలని పిలుపునిచ్చారు. మోడీని ఖర్గే విష సర్పం అంటే.. దానికి ప్రధాని గట్టి కౌంటరే ఇచ్చారు. ఆ సర్పమే అందరూ పూజించే శివుడి మెడలో ఉంటుందని చురకలంటించారు.

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ హామీ

ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, అదే రిజర్వేషన్లను లింగాయత్‌‌లకు, వొక్కలిగల కు పంచుతున్నట్లు ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కర్నాటకలో ఇటీవలి మూడున్నరేళ్ల బీజేపీ పాలన అవినీతిమయమైందని కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే సోనియా వివాదాస్పద కామెంట్లు చేసిన‌‌ట్లు బీజేపీ ఆరోపించింది. మరోవైపు, జేడీఎస్ తమకు పట్టున్న ప్రాంతాల్లో సైలెంట్‌‌గా ప్రచారం చేసుకుంటూ వెళ్లింది.