- భువనగిరిలో రంగంలోకి ఎమ్మెల్యే పైళ్ల భార్య, కూతురు
- టికెట్ కన్ఫామ్ కాకున్నా కుంభం కూతురి ప్రచారం..
- గూడూరు తరఫున జనంలోకి వెళ్తున్న ఆయన సోదరుడు
- ఆలేరులో అన్నీతానై వ్యవహరిస్తున్న సునీత భర్త మహేందర్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. క్యాండిడేట్లు, లీడర్లు, కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగుతున్నారు. టికెట్లు కన్ఫామ్ కాని చోట ఆశావహులు కూడా కుటుంబంతో సహా ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్నారు. క్యాండిడేట్లు ఎన్నికల ఖర్చు, ఇతర అంశాలను సైతం కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులకే అప్పగిస్తున్నారు. ప్రతీ లెక్క కరెక్ట్‌గా ఉండేందుకే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రచారంలో ఎమ్మెల్యే పైళ్ల సతీమణి, కూతురు
కుంభం అనిల్‌కుమార్ రెడ్డి బీఆర్ఎస్లో చేరగానే సులువుగా గెలుస్తానని భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి భావించారు. కానీ, కుంభం తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో పాటు అభ్యర్థిని తానేనని చెబుతుండడంతో పైళ్ల ప్రచారంలో జోరుగా పెంచారు. వలిగొండ, భూదాన్ పోచంపల్లి, బీబీనగర్, భువనగిరిలో రెగ్యులర్‌గా పర్యటిస్తున్నారు.
ఆయన భార్య వనిత, కూతురు మాన్విత సైతం ప్రచారం చేస్తున్నారు. వనతి పైళ్లతో కలిసి ప్రచారం నిర్వహిస్తూనే ఒంటరిగానూ గ్రామాల్లో తిరుగుతున్నారు. మాన్విత మాత్రం సొంతంగానే ఇంటింటి ప్రచారం చేస్తూ నాన్నకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. గడిచిన తొమ్మిదేండ్లుగా అభివృద్ధి చేశామంటూ సంబంధిత కరపత్రాలు పంచుతున్నారు.
ప్రతిపక్షాలకు అభ్యర్థులు ఖరారు కాకున్నా...
భవనగిరిలో కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్లు కన్ఫామ్ కాకున్నా టికెట్ ఆశిస్తున్న నేతలు జనాల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ తరపున మాజీ డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్‌కుమార్ రెడ్డితో పాటు ఆయన కూతురు కీర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండు నెలల పాటు సీఎం కేసీఆర్‌ను పొగిడిన కుంభం ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే, బీఆర్ఎస్అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. కీర్తి ప్రచారాన్ని పర్యవేక్షించడం, ఫైనాన్స్ వ్యవహారాలు చూడడంతో పాటు పార్టీలో కుంభంకు వ్యతిరేకంగా ఉన్న వారితో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.
గూడూరు సోదరుడు సైతం..
భువనగిరిలో బీజేపీ అభ్యర్థి ఫైనల్ కాకపోయినా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. గూడురు ప్రచార కార్యక్రమాలను ఆయన సోదరుడు నరోత్తం రెడ్డి చూస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అనేక అంశాల్లో పేదల పక్షాన నిలబడ్డ తన అన్న నారాయణ రెడ్డికి ఓటు వేయాలని కోరుతున్నారు.
పావులు కదుపుతున్న మహేందర్ రెడ్డి
ఆలేరు ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన గొంగిడి సునీత.. హ్యాట్రిక్ కొట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కూడా బీఆర్‌ఎస్‌లోనే ఉండడంతో ఆయనను కలుపుకొని ప్రచారం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఇక్కడ బీసీ అభ్యర్థి బీర్ల అయిలయ్యకు టికెట్ ఇవ్వడంతో తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
ఇందులో భాగంగా ఎమ్మెల్యే సునీత భర్త డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నీతానై పావులు కదుపుతున్నారు. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలను చేర్చుకోవడంతో పాటు యూత్, రైతుబంధు సమితి, ఇతర విభాగాల్లోని లీడర్స్‌తో చర్చలు జరుపుతున్నారు. గెలుపు కోసంప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు.