- బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు
- బలమున్నా అభ్యర్థిని డిక్లేర్చేయని అధికార కాంగ్రెస్
ఖమ్మం, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా, ఖమ్మం సెగ్మెంట్ పరిధిలో మాత్రం ఎన్నికల ప్రచారం ముందుకు సాగడం లేదు. ఈ ఎలక్షన్లలో ఒక్కో పార్టీ పరిస్థితి ఒక్కోలా ఉంది. ఎట్టకేలకు అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ, ఉమ్మడి జిల్లాలో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చేరికలు, ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంపై ఫోకస్ పెట్టింది. అధికార కాంగ్రెస్ ఇంకా క్యాండిడేట్‌ను కన్ఫామ్ చేయడం లేదు.
12 మంది ఆ పార్టీ టికెట్‌కు అప్లయ్ చేసుకోగా, మరికొందరు సైతం ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు సిట్టింగ్ఎంపీ నామ నాగేశ్వరరావును బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా డిక్లేర్ చేసినా ఆ పార్టీలో నిస్తేజం వీడడం లేదు. ఈ 4న క్యాండిడేట్‌గా డిక్లేర్ అయిన రోజే ఖమ్మంలో ముఖ్య కార్యకర్తల మీటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీస్లేవు.
కాంగ్రెస్‌లో ఛాన్స్ దక్కేదెవరికో..
కాంగ్రెస్‌కు కంచుకోట అయిన ఖమ్మం ఎంపీ సెగ్మెంట్‌ను దక్కించుకునేందుకు చాలా మంది నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగంధర్, వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ తో పాటు మరికొందరు రేసులో ఉన్నారు. వీళ్లందరూ ఎవరికి వారే తమకే ఛాన్స్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు.దీంతో అభ్యర్థి ఎంపిక ఫైనల్ కావడం లేదు. బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చే ఆలోచనలో కూడా పార్టీ హైకమాండ్ ఉందన్న ప్రచారమూ జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయమై క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
ఓటు బ్యాంక్‌పై ఫోకస్..
ఇతర ప్రధాన పార్టీలతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో అత్యంత బలహీనంగా ఉన్న బీజేపీ మాత్రం పార్లమెంట్ ఎన్నికలపై ఎక్కువ నమ్మకమే పెట్టుకుంది. ఎంపీ నామ నాగేశ్వరరావును పార్టీలోకి రప్పించి, అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు ఛాన్స్ ఇస్తారనే ఊహాగానాలు వినిపించినా, కొత్త అభ్యర్థి తాండ్ర వినోద్ రావు తెరమీదకు వచ్చారు. తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు ఉండగా, ఏపీలో ప్రస్తుతం టీడీపీ కూడా కూటమిలో భాగస్వామిగా ఉంది. ఖమ్మంలో కొంత బలమున్న టీడీపీ కేడర్‌ను కూడా ఓన్ చేసుకునేందుకు తాండ్ర ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఖమ్మం జిల్లా టీడీపీ ఆఫీస్ కు వెళ్లి, తనకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు. ఇతర పార్టీలకు చెందిన కేడర్ ను తమ పార్టీలోకి రప్పించే ప్రయత్నం చేస్తూ, చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇలా గతంలో కంటే ఓటు బ్యాంకును పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది.
బీఆర్ఎస్ డీలా
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా డీలా పడింది. ఫలితాలు వచ్చిన తర్వాత ఓడిన అభ్యర్థులు, ముఖ్యనేతలు చాలా మంది కార్యకర్తలకు ముఖం చాటేయడంతో క్యాడర్మరింత నిరాశగా ఉంది. మిగిలిన పార్టీల కంటే ముందుగానే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థిని ప్రకటించినా, ఆశించిన మేర స్పందన రావడం లేదు. సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావునే మళ్లీ అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత ఖమ్మంలో ఎన్నికల సన్నాహక సమావేశం మాత్రమే జరిగింది.
త్వరలోనే మండలాల వారీగా మీటింగ్‌లో ఉంటాయని ప్రకటించినా, ఇంత వరకు ఎలాంటి పురోగతి లేదు. తన కొడుకు పెండ్లి, రిసెప్షన్ పనులతో నామ కొద్దిరోజులు బిజీగా ఉంటారని, ఇతర లీడర్లంతా తామే అభ్యర్థిగా భావించి ప్రచారంపై దృష్టిపెట్టాలని సూచించారు. ఆ రోజు చెప్పిన మాటలే తప్పా, ఇప్పటి వరకు ఎలాంటి మీటింగ్స్, పార్టీ యాక్టివిటీ లేకపోవడంపై కార్యకర్తల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎంపీ నామ నాగేశ్వరరావు పార్టీ మారబోతున్నారని గత రెండు వారాలుగా విపరీతమైన ప్రచారం జరిగింది. బీజేపీలో ఆయన చేరుతారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడంతో పుకార్లకు కొంత బ్రేక్ పడినా, నామా నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో అనుమానాలకు పూర్తిస్థాయిలో తెరపడలేదు.