బీఆర్​ఎస్​కు భవిష్యత్ లేదు : భట్టి విక్రమార్క

మధిర, వెలుగు :  ఈనెల 30 తర్వాత బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గురువారం మధిర మండలం రామచంద్రపురం, జాలిముడి, మల్లారం, రొంపి మల్లారం, వంగవీడు, కిష్టాపురం, సిరిపురం, వెంకటాపురం, ఆత్కూరు, నక్కలగరువు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఇన్నేండ్లలో భూమి పంచారా? ఇండ్లు ఇచ్చారా? ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. పది సంవత్సరాల బడ్జెట్ తాకట్టు పెట్టి తెచ్చిన రూ.5 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ పాలకులు దొరలు కలిసి దోపిడీ చేసి ప్రజలను అన్యాయం చేశారని మండిపడ్డారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోగా ఇందిరమ్మ ఇండ్ల కార్పొరేషన్ ఎత్తివేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. ప్రజల సంపద ప్రజలకు పంచాలని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించి హామీ పత్రాలపై సంతకాలు పెట్టిందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు 15 రోజుల్లో చరమగీతం పాడనున్నారని తెలిపారు. ఆగాయ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 100 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరాయి.