బాలానగర్, వెలుగు : 'జడ్చర్లలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. ఇక్కడి ప్రజలు ఆర్థికంగా చితికిపోయి ఉపాధి కోసం పట్నం పోతున్నారు. తాను అధికారంలోకి రాగానే జడ్చర్లను వంద శాతం అక్షరాస్యత ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా' అని జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం ఆయన బాలానగర్ మండలంలోని కేతిరెడ్డి పల్లి, మోతి ఘనపూర్, గంగాధర్‌పల్లి, సూరారం, మెడిగడ్డ తండా, కుర్వగడ్డ తండాలలో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ అమలు చేయనున్న ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు.
అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే జవాబుదారీతనం ఉంటుందన్నారు. అధికారంలోకి రాగానే ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. మోతీ ఘనపూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేడిగడ్డతండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.