
- కేసీఆర్ మంత్రి వర్గంలో మాదిగలకు చోటు లేదు
- ఎమ్మెల్యే రఘునందన్‌రావు
దుబ్బాక, వెలుగు : రాష్ట్రంలో 23 శాతం ఉన్న ఎస్సీలకు కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు లేదని, మాదిగ ప్రజాప్రతినిధులను చిన్న చూపు చూస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. ఆదివారం అక్భర్పేట-భూంపల్లి మండలం రుద్రారం, చౌదర్పల్లి, ఎనగుర్తి, బొప్పాపూర్, రాయపోల్ మండలం టెంకంపేట, బేగంపేట, ఎల్కల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయ మాటలతో ఎన్నికల ప్రచారానికి వస్తున్న బీఆర్ఎస్ నాయకులను నిలదీయాలన్నారు.
జనాభాలో ఎస్సీలు 23 శాతం ఉంటే మంత్రి వర్గంలో ఒక్కరికే అవకాశం ఇచ్చారని, ఒక్క శాతం ఉన్న సీఎం కులానికి మాత్రం 5 మంత్రి పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. డబుల్‌బెడ్‌రూమ్‌లు, దళిత, బీసీ, మైనార్టీ బంధులను బీఆర్ఎస్ కార్యకర్తలకే పంపిణీ చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వైన్స్టెండర్లపై ఉన్న చిత్తశుద్ధి ఉద్యోగ నోటిఫికేషన్లపై లేదని విమర్శించారు. పదేండ్లుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదని, వీటి గురించి అసెంబ్లీలో మాట్లాడితే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తాను గెలిచిన తర్వాత దుబ్బాకలో డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేసి
నూతన బస్టాండ్ఆధునాతన పద్దతుల్లో నిర్మించానన్నారు. అక్భర్పేట-భూంపల్లి నూతన మండలంగా చేశానని, ఇదే మండలం మీదుగా జాతీయ రహదారిని తీసుకొచ్చానని చెప్పారు. అమాసకోసారి, పున్నానికోక్కసారి వచ్చే ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కావాలో, నిరంతరం ప్రజల మధ్యనే ఉండే రఘునందన్‌రావు కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. దుబ్బాకకు వచ్చిన నిధులను మంత్రి హరీశ్‌రావు అడ్డదారిలో సిద్దిపేటకు తరలించుకపోయారని, ఎంపీ నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్‌లో పెట్టారని ఆరోపించారు. కమలం పువ్వుకు ఓటేసి మరొకసారి దుబ్బాక ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని పిలుపు నిచ్చారు.