వంద కేసులున్న బాల్క సుమన్​కు వెయ్యి కోట్లెక్కడివి? : వివేక్ వెంకటస్వామి

  • కాంగ్రెస్​కు వస్తున్న ఆదరణ చూసి ఆయన దమాక్‌ ఖరాబైంది: వివేక్
  • పిచ్చిపట్టినట్లు ఎట్లపడితే అట్ల మాట్లాడుతున్నడు
  • కేసీఆర్​ పేదలకు ఇండ్లియ్యలే కానీ, కుటుంబ సభ్యులకు ఫామ్​ హౌస్​లు కట్టిండు
  • చెన్నూరు నియోజకవర్గంలో జోరుగా కాంగ్రెస్ పార్టీ​ఎన్నికల ప్రచారం

కోల్ బెల్ట్, వెలుగు : వంద కేసులున్న బాల్క సుమన్​కు ఇప్పుడు వెయ్యి కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చాయని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. ‘‘ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ ప్రభుత్వానికి టాక్స్ కట్టకుండా బాల్క సుమన్ జేబులో వేసుకుంటున్నడు. ఎమ్మెల్యే అంటే ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలి. కానీ, సుమన్​ పనితీరు ఇంకోలా ఉంది. చెన్నూరులో 30 శాతం కమీషన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రి కట్టిండు. కానీ అందులో డాక్టర్లు లేరు.. నర్సింగ్ స్టాఫ్ లేరు.

ఓట్ల కోసమే దవాఖాన ఓపెన్ చేసిన బాల్క సుమన్ ను ఇక్కడి ప్రజలు తరమికొట్టాలి. ప్రశాంతంగా ఉన్న చెన్నూరులో సుమన్ గూండాయిజం చేస్తున్నడు. జనాల్ని బూతులు తిడ్తున్నడు” అని వివేక్ మండిపడ్డారు. ఆదివారం, సోమవారం చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి వివేక్​ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బాల్క సుమన్​కు ఓటమి భయం పట్టుకుంది 

-కాంగ్రెస్​కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఎమ్మెల్యే, బీఆర్​ఎస్​ అభ్యర్థి  బాల్క సుమన్ కు దమాక్ ఖరాబైందని వివేక్​ వెంకటస్వామి  విమర్శించారు. ‘‘బాల్క సుమన్​కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే  పిచ్చిపట్టినట్లు ఏది పడ్తే అది మాట్లాడుతున్నడు. సొంత కార్యకర్తలనే  బట్టలిప్పి కొడ్తా అంటున్నడు. ఒక్కసారి నన్ను గెలిపించండి... సుమన్ బట్టలన్నీ పీకిపడేద్దాం. పోలీసులను, పవర్​ను వాడుకోవడమే సుమన్​కు తెలుసు. 

కానీ కాంగ్రెస్​కు ప్రజలే పవర్​. ఆ పవర్​తో బాల్క సుమన్​ను ఇక్కడి నుంచి తరిమేద్దాం. నాకు సుమన్​ దగ్గర ఉన్నట్లు వేల కోట్ల అక్రమ ఇసుక దందా పైసల్లేవు. ఉన్నదల్లా మంచితనం, జనం ఆదరణే’’ అని ఆయన అన్నారు. 

కేసీఆర్​ అందరిని మోసం చేసిండు

పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టివ్వకుండా సొంత కుటుంబ సభ్యులకు కేసీఆర్​ 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ లను కట్టించారని  అన్నారు. కాళేశ్వరం రీ డిజైన్ పేరుతో కేసీఆర్​ కోట్లు దోచుకున్నారని, మళ్లీ ఆయన గెలిస్తే మరో కాళేశ్వరాన్ని కట్టి ప్రజలను తాకట్టుపెడతారని, ఇంకింత దోచుకుంటారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం తప్ప తెలంగాణ అభివృద్ధి జరగలేదని అన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ..  

ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా మంచి నీళ్లు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రజలకు చెందిన రూ.40 వేల కోట్ల సొమ్మును కేసీఆర్​ కొల్లగొట్టారని ఆరోపించారు.  ‘‘ఉద్యోగాలు అన్నడు.. దళిత సీఎం అన్నడు.. నీళ్లు అన్నడు.. ఇండ్లు అన్నడు.. ఏదీ ఇవ్వకుండా అందరినీ మోసం చేసిండు’’ అని కేసీఆర్​పై ఆయన మండిపడ్డారు. 

వాకర్స్​తో వివేక్​ ఇంటరాక్ట్​

మందమర్రి మండలం క్యాతనపల్లిలోని గాంధారి వనం, రామకృష్ణపూర్​లోని  సింగరేణి ఠాగూర్ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ తో వివేక్ వెంకట స్వామి ఇంటరాక్ట్ అయ్యారు.  వాకర్స్​తో కలిసి వాకింగ్ , జాగింగ్ చేశారు. అదేవిధంగా మందమర్రి మండలం పులిమడుగు, ఊరు మందమర్రి, మందమర్రి మున్సిపాలిటీలోని విద్యా నగర్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బీఆర్​​ఎస్ లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు. మందమర్రి సీఎస్​ఐ చర్చిలో వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ప్రార్థనలు చేశారు.

చెన్నూరులో ‘బాల్కసుర’ వధ

దీపావళి సందర్భంగా చెన్నూరులో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే బాల్క సుమన్​కు వ్యతిరే కంగా వినూత్న రీతిలో నిరసన కార్యక్ర మాన్ని చేపట్టారు . ‘బాల్క సుర వధ’ పేరు తో దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘‘ఇసుక దందాతో వేల కోట్లు కొల్లగొ ట్టిన బాల్క సుమన్​ను  ఓడించిన రోజే నిజమైన దీపా వళి. అహంకారి, సొంత కార్యకర్తలపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్న సుమ న్​ను తరిమికొట్టాలి” అని వారు అన్నారు.