హైదరాబాద్‌లో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

 హైదరాబాద్‌లో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు కాలపరిమితి ముగిసిన మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఖాళీ అయిన ఒక డివిజన్ కు ఉప ఎన్నిక జరగబోతోంది. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ కరోనా బారిన పడి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత డిసెంబర్ 31న కన్నుమూసిన విషయం తెలిసిందే. గతంలో ఎల్బీనగర్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన ఆకుల రమేష్ గౌడ్.. గత డిసెంబర్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి కార్పొరేటర్ గా గెలుపొందారు. గెలిచిన తర్వాత కొద్ది రోజులకే కరోనా బారిన పడి కోలుకోలేక కన్నుమూయడంతో.. ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నికల జరగాల్సి ఉంది. తాజాగా నోటిపికేషన్ విడుదల చేయడంతో ఈరోజు నుండి జీహెచ్ఎంసీ పరిధిలో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిందని గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రకటించారు. ఈరోజు నుండి లింగిజిగూడా ఎన్నిక ఫలితం వచ్చే వరకు ఎలక్షన్ కోడ్ అమలు లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.  జోనల్ కమీషనర్లు,డిప్యూటీ కమీషనర్లు ఎలక్షన్ కోడ్ అమలు పై కఠినం గా ఉండాలని కమీషనర్ ఆదేశించారు. రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలతోపాటే లింగోజిగూడ స్థానానికి రేపటి(శుక్రవారం) నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 20న స్క్రూటినీ జరగనుంది. ఈనెల 22 వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉండగా...ఈనె 30 న పోలింగ్ జరుగుతుంది. 3 న ఫలితాలు ప్రకటించేందుకు నిర్ణయించారు అధికారులు.